అనాథల గూడూ గుండె ఈ ఇన్నారెడ్డి!

ప్రాధమిక హక్కులే అనాథ అయిపోతున్న కాలంలో నిజంగా అనాథల సంగతి ఎవరిక్కావాలి? దిక్కూ దివాణం లేని వీధి పిల్లల బతుకులు ఎవరిక్కావాలి? ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇన్నారెడ్డి దగ్గిర వున్నాయి. వరంగల్ జిల్లా జఫర్ ఘడ్ మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీకుల లో హైదరాబాదు లో అనాధ బిడ్డల హక్కుల సాధన కోసం ఒక అంతర్జాతీయ సదస్సు పెడుతున్నాం అనే కబురు ఈ అనాధల జీవితాల పైన నాలుగు వాక్యాలు రాసే సందర్భం ఇది. ఈ దేశంలో వేల ఏళ్ళుగా మూలవాసులుగా ఆధిపత్య చర్చల్లో నూతన పౌరసత్వ సవరణ వికృత చట్టాల సంక్షుభిత కాలం లో అలగా జనాల ఆర్తనాదం అనాధల గురించి మాట్లాడే ఆలోచించే తీరిక ఈ కాలానికి ఉందా? ఆ ఆలోచన ను ఒక కార్యరూపం చేసినవాడు అనాధ హక్కుల కోసం అలుపెరగ కుండా ఉద్యమం చేస్తున్నవాడు ఇన్నారెడ్డి. వారాంతపు సెలవుల్లో పిజ్జా,పెప్సీ,పల్సర్ అధునాతన మాల్స్ మధ్య సేదతీరుతున వాట్స్ అప్ తరంకు మన మధ్యనే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న కార్ అద్దాలు తూడుస్తూ, హై వే రోడ్ మీద బూట్ పాలిష్ చేస్తూ కాళ్ళ కోసం వెతుకులాడే పసి వాడిన బాల్యం తెలుసా? అనాధ అనే ఒక సమోహాన్ని చేరదీసి ఆచరణ లో నిలబడి వాళ్ళ హక్కుల కోసం ఒక అంతర్జాతీయ సదస్సు పెడుతున్నాడు ఆయన.

ఏ కలత నిద్దర నుండో మెలుకువ వస్తే చేయి వేసి పడుకునేందుకు ఒక ఆసరా లేని బ్రతుకులు వాళ్ళవి. నిలువ నీడ లేక నిట్టాడి కూలి ఆకాశమే ఆవాసంగా బ్రతుకులీడుస్తున్న వ్యదార్ధ జీవితాలు. అమ్మ నాన్న అన్న అనే పిలుపే దూరం అయి ఏ వైపు నుంచి ఏ అఘాయిత్యం ముంచుకు వస్తుందో, ఏ అర్థరాత్రి అపరాత్రి పోలీసులు గద్దింపులు వినాల్సి వస్తుందో, ఏ కామాంధుడి కబంధ హస్తాల లో బ్రతుకు చిద్రం కాకుండా కాపాడు కోవాలో తెలియని నిస్సార బ్రతుకులు. ఆలనా పాలనా లేక పార్కుల్లో , రైల్వే ,బస్టాండ్ ప్లాట్ ఫారాల మీద బ్రతుకు యుద్ధం చేస్తున్న దేశం లోనే అతి పెద్ద సమూహం అనాధలు. అనాధ అనే మిగులు ఏ వికృత విలువల కొనసాగింపు? ఏ వంచిత కాలపు అవశేషం ? ఎక్కడి నుండి వచ్చింది ఆ సమూహం. అమ్మా నాన్న పోతేనో, విడిపోతేనో, ఒక గంట కామపు క్షణికావేశంలో ఈ భూమి మీద పడి ఏ చెత్త కుప్పల్లోనో మిగిలి ధరణికి అదనపు భారం గా అవాంచిత జీవితాలు వాళ్ళవి. రాళ్ల రప్పల మధ్య బ్రతుకు సమరం చేస్తున్న వాళ్ళ జీవితానికి ఏ విలువా లేదు ఏ చట్టాలూ వాళ్ళకు కనీస ఆచ్చాదన అయినా ఇవ్వలేక పోతున్నాయి.

ఎక్కడ పుట్టిన అనాధ అయినా వారి కస్టాలు ఒకటే కానీ ఆ కస్టాలు కూడా బ్రతుకు కు సోపానాలు గా మార్చుకుని ఎదిగిన ప్రపంచ ప్రసిద్ద బ్రతుకులు ఐతిహ్యం అయి కొన్ని తరాలకు సరిపడిన అనుభవ జ్ఞానాన్ని మనకు అందించారు. అవి చదవడానికి వినడానికి ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. మురికి వాడలో పుట్టి పెరిగిన ఒక అనాధ ప్రపంచ అందాల సమాజాన్ని ఆకర్షించి హాలీవుడ్ ను శాసించి చిత్ర పరిశ్రమను పాదాక్రాంతం చేసుకున్న మార్లిన్ మన్రో చీకటి కల్లోల జీవితం ఎందరికి తెలుసు? ప్రపంచాన్ని సమ్మోహనం చేసిన గొప్ప అందగత్తె మార్లిన్ .ఆమె నటన, అందం, అభినయం, ఆకర్షణ, మూలంగా ఒన కూరిన పెట్టుబడి హాలీవుడ్ ఆర్ధిక మూలాలను ఎక్కడికో తీసుకొని పోయిన వైనం వెనక కన్నీటి చారిక ఎందరికి తెలుసు ? ఆమె అనుభవించిన వ్యధలు, లైంగిక దోపిడీ, పీడన జీవితం లో ఒక పుట్టుమచ్చ. మూడు తరాల మానసిక అపసవ్యత. తండ్రెవరో తెలియకుండా పసి వయసు నుండే ఎన్నో అనాధ ఆశ్రమాల పర్యవేక్షణ లో పిసుకుడు కాయ అయిన ఆమె బాల్యం తక్కువ మందికి తెలుసు. లాస్ ఏంజిల్స్ మురికి వాడల్లో కూటికి గుడ్డకు లేక రోజులు రోజులు పస్తులు ఉంటా వాసన వస్తున్న రొట్టె ముక్కను వాంతి వచ్చినా తింటూ దిక్కూ మొక్కూ లేని కాలాన బౌతిక దాడులు, లైంగిక హింసల మధ్య బ్రతికిన నోర్మాజేన్ బెకర్ మార్లిన్ మన్రో అవడానికి బ్రతుకు యుద్దమే చేసింది. తెల్ల వాళ్ళ దురహంకారానికి బాల్యం లోనే తండ్రిని కోల్పోయిన మానసిక అపసవ్యత తో ఆత్మహత్య చేసుకున్న తల్లి లేని మాల్కం ఎక్ష్ అమెరికాలో మానవ హక్కులకు చిరునామా మారిన ఆయన బ్రతుకు కొన్ని తరాలకు ఆదర్శం. పుట్టుకతోనే తల్లి దండ్రులు దూరం అయిన అనాధలుగా బ్రతికిన టాల్ స్టాయ్, ఎడ్గార్ అలెన్ పో, జాన్ కీట్స్ లాంటి వాళ్ళు తమ బ్రతుకు అర్థాన్ని సృజనాత్మకంగా మార్చుకున్న వీరోచిత గాథలో ఎన్నో మన చుట్టూ ఉన్నాయి.

బాల్యం లోనే కన్నవాళ్ళు దూరం అవడం మూలంగానో, పెద్దవాళ్ళను ఎదిరించలేక విడిపోవడం మూలంగానో పరాయి పంచన బ్రతికిన ఆపిల్ కంపనీ అధినేత స్టీవ్ జాబ్స్, నెల్సన్ మండేలా లాంటి ఎంతోమంది దత్తత పేరుతోనో ఇతరుల వితరణ మూలంగానో నిలబడగలిగారు. నిలబడడమే కష్టం అనుకున్న దశనుంచి తామేదో ప్రపంచానికి చూపిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరి ప్రేమోన్మాదమా, మానసిక ఆవేశామో, అవాంచితమో కొన్ని పుట్టుకలు చెత్తకుండే ఆవాసంగా, ఆలంబనగా ఎలా వచ్చారో ఎలా మాయం అయ్యారో తెలియని జీవితాలు కోట్లల్లో ఉన్నాయి.

ఒక అనాధ అలా నిరాకారంగా మిగలడం ఆ అనాధ తప్పు కాదు అది వ్యవస్థీకృత నేరం అది. ఓటమి లోనో , యుద్ధం లో ప్రకృతి విలాపమో, విధి వంచితమో ఈ ప్రపంచం లో అతిపెద్ద వ్యదార్థ సమూహం వాళ్ళు. ఒక దేశం మరొక దేశం మీద దండెత్తిన కాలాన జరిగిన హింస మూలంగా అయితేమి, ప్రత్యామ్నాయ రాజకీయాల లో అమ్మా నాన్న కోల్పోయిన వాళ్ళు, పర్యావరణ, ప్రకృతి విలయం, ఆరోగ్య సమశ్యలు, వ్యక్తిగత బలహీనతలు, రాజ్య హింస, వ్యభిచార కూపాల లో అవాంచిత జననాలు ఒకటా రెండా ఈ దేశం లో అనాదలు లెక్కకు మించి రైల్వే ప్లాట్ ఫారం మీద బస్టాండ్, పార్కులు వీధి లైట్ల కింద బ్రతుకు లీడుస్తున్నారు

ప్రపంచ వ్యాప్తంగా ఈ అనాధల చుట్టూ అల్లుకుని ఉన్న భావోద్వేగాలు నన్ను ఉక్కిరి బిక్కరి చేసాయి . ఇక పోతే గణాంకాలు మరీ ఆందోళన కలిగించాయి. యునిసెఫ్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇరవై కోట్లకు పైగా అనాధలు ఉన్నట్లు లెక్కలు కట్టారు. ఇంకా ఎక్కువ ఉండే అవకాశమే ఉంది. మన దేశం లో పదేల్ల కిందనే దాదాపు రెండున్నర కోట్ల మంది అనాధలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రోజుకి ఆరేడు వేల మంది అనాధలు వీధుల పాలు అవుతున్నారు. వీల్లంతా పదిహేడు ఏళ్ళ లోపు వాళ్ళే.

తెలుగు నాట అనాధల కోసం కొన్ని సమూహాలు స్వచ్చంద సంస్థలు పని చేస్తున్నప్పటికీ అనాధల బాగోగుల కోసం సంస్థాగత మార్పుల దిశగా చట్ట సభల లో అనాధల కోసం ఒక వాహిక అయిన వాడు ఇన్నారెడ్డి. ఈ దేశ పాలన మార్పు కోసం అజ్ఞాత జీవితం గడిపిన ఒకనాటి ఇన్నారెడ్డి మలివిడత తెలంగాణ కు మేథో ఉద్యమ దారులు వేసినవాడు. పందొమ్మిది వందల డెబ్బయ్యో దశకం లో సెయింట్ గాబ్రియల్ లో శివసాగర్, కొండపల్లి సీతారామయ్య శిష్యుడుగా, సికేయెం కళాశాల లో విద్యార్ధి నాయకుడిగా, గ్రామాలకు తరలండి నినాదం లో రూపొందిన వ్యక్తిత్వం ఆయనది. భూస్వామ్య కుటుంభం అందునా రోమన్ కాథలిక్ నేపధ్యం లో పుట్టి పెరిగిన ఇన్నయ్య వరంగల్ జిల్లా రాడికల్ విద్యార్ధి నాయకుడిగా విద్యార్ధి దశలోనే నగర బహిస్కరణ గురై జైలు నుండే విద్యార్ధి నాయకుడిగా ఎన్నిక అయిన విప్లవ విద్యార్ధి ఇన్నయ్య. నగరాలకు తరలండి అనే నినాద వెలుగులో పూర్తికాలం కార్యకర్త గా ఉత్తర తెలంగాణ రాయలసీమ లో ప్రత్యామ్నాయ రాజకీయాలను పదునెక్కించిన ఆయన మలివిడత తెలంగాణ లో ఉద్యమ పార్టీ గా చెప్పుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుల లో ఒకడు. ఇదు దశాబ్దాల మడమతిప్పని వ్యక్తిత్వం ఆయనది. దగాపడ్డ తెలంగాణ వెనకబాటుకు కార్యకారణ సంభంధాలు చర్చించడమే కాదు ఆ తెలంగాణ విముక్తి కోసం కలలు కన్న స్వాప్నికుడు.

రోమన్ కాథలిక్ నేపధ్యం కలిగిన పెద్ద భూస్వామ్య కుటుంభం, విద్యార్ధి విప్లవ గమనం, మలివిడత తెలంగాణ పోరాటం లో ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఆయుధం వదిలి బాలెట్ రాజకీయాల దిశగా మారిన ఇన్నయ్య వరంగల్ జిల్లా లో స్థాపించిన ‘మా ఇల్లు ప్రజాదారణ ఆశ్రమంలో’ ఒకటి నుండి ఉన్నత విద్య దాకా చదువుకుంటున్న వందల మందికి తానే అమ్మా నాన్న అయ్యాడు. అలా ఒక చిన్న పాఠశాల, కళాశాల ఏర్పాటు చేసాడు. ఆయన కేవలం అక్కడే ఆగలేదు అనాధ హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి వారికి విద్య ఉద్యోగ ఉపాధి కల్పన లో రిజర్వేషన్ ల లక్ష్యంగా తన కార్యాచరణ మొదలు పెట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనాధ పిల్లకోసం రెండు శాతం రిజర్వేషన్ పొందేలా ప్రభుత్వ అనుమతి పొందడం లో విజయం సాధించిన ఆయన ఆ వెసులు బాటు దేశవ్యాప్తంగా అమలు చేయాలి అనే లక్ష్యంగా తన కార్యాచరణ ప్రకటించాడు. అనాధల హక్కుల లక్ష్యంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. ఆ ప్రయత్నం లోనే అనేక మంది ముఖ్యమంత్రులను ప్రధానులను కలిసి సమష్య తీవ్రతను పాలకుల దృష్టికి తీసుకుపోతూ ఉన్నాడు.
సామాజం లో వర్గ ప్రాతిపదిక మీద భూమి ఇరుసుగా ఇరుసుగా నడుస్తున్న రాజకీయాల మధ్య వ్యవస్థ లో అవిటి బ్రతుకులు గడుపుతున్న సెక్సువల్ మైనారిటీలు, అనాధలు లేదా నమ్మిన రాజకీయాల మూలంగా అమ్మా నాన్నలను కోల్పోయి న వాళ్ళు మిగిలిన ఎన్నో కుటుంబాలు వారి వారసుల బ్రతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ఆ పసి జీవితాలను ఆదుకునే కార్యక్రమం ఏమన్నా మన ముందు ఉందా? ఈ వ్యధాభరిత స్థితిని మెరుగు పరచడానికి ఉద్యమకారుల కార్యాచరణ ఏమన్నా ఉందా అనిపిస్తోంది అటు వంటి సంక్షుభిత కాలం నుంచే ఆ వైఫల్యాల పునాదుల నుండే ఇన్నారెడ్డి లాంటి విప్లవ స్వాప్నికులు మన ముందు బ్రతుకు పట్ల ఒక ఆశను కలిగిస్తారు. జఫర్ ఘడ్ కేంద్రంగా మొదలైన ఆ చిరు ప్రయత్నం ఎందరో అనాధలను చదివించి చేయూత నిస్తోంది. ఆ ఆశ్రమం లో చదువుకొని అదే ఆశ్రమం లో పనిచేస్తూ తన తోటి వారికి సహాయం చేస్తున్న ఒక మానవీయ కార్యక్రమం ఆయన నడుపుతున్న సంస్థ కేంద్రంగా జరుగుతోంది. ఇవ్వాళ అక్కడ చదువుకొని బయట కొలువులు చేస్తూ ఎంతో మంది నిలబడగలిగారు. ఒక చిన్న ప్రయత్నమే అయినా కొన్ని తరాలు యాది చేసుకోవాల్సిన ఒక పరంపర అక్కడ కొనసాగుతోంది.

ఈ నాటి పాలక వర్గాలు రూపొందించిన పౌరసత్వ చట్టాలు ఇక్కడ పుట్టిన వాళ్ళకే స్థానం లేకుండా చేస్తున్న సంక్షుభిత కాలం లో ఎవరికీ చెందని అనాధల గురించి ఎవరు పట్టించుకోవాలి ? మారిన దేశ కాలమాన పరిస్థితులు మనిషి నుదిటి మీద వేలాడుతున్న కత్తిలా పౌరసత్వ సమష్య మీద జామియా లో, షహీన్ భాగ్ లో ఆందోళనల మధ్య అనాధల ఆనవాళ్ళు ఎవరికి కావాలి. ఈనాడు నిర్భంధంగా మన ముందుకు వచ్చిన చట్టాల మూలంగా ఇక్కడ మిగిలేది ఎవరో అన్న ఆందోళన సర్వత్రా వ్యాపించింది. ఇక్కడ పుట్టుక ఆధారాలు లేకుండానే కొన్ని తరాలు పుట్టాయి గిట్టాయి. ఇప్పుడు వ్యవస్థ దృష్టిలో నూతన పౌర సత్వ చట్టాల ప్రకారం ఈ దేశం లో అనేక మంది మైనారిటీలు, దళిత బహుజనులు కూడా అనాధల జాబితాలో చేరబడి కాన్సంట్రేసన్ కాంపులకు పరిమితం అయ్యే రోజు మరెంతో దూరం లో లేదు. ఇక ఈ దేశం లో ఇప్పటిదాకా అనాధలుగా బ్రతుకీడుస్తున్న అనాధ హోదా రద్దు అయి దేశ ద్రోహుల జాబితాలోకి బట్వాడా చేయబడి క్యాంపు ల మధ్య నే కునారిల్లి చనిపోయే కష్టకాలం దాపురించింది. ఇప్పుడు అనాధ ఒక సర్వనామం.

ఆధునికత తెచ్చిన అనేక విధ్వంసాల లో కుటుంబ విచ్చినం ఒకటి. విడాకుల చట్టాలు, మానవ సంభందాల లో పెరిగిన సంక్లిష్టత, లైంగిక అంశాల పట్ల కలిగిన ఎరక మూలంగా పట్టింపు లేని తనం, ఆకలి అవమానాల మూలంగా దిగజారిన సంబంధాలు ఇవన్నీ కుటుంబం పట్ల, సంతానం పట్ల పెద్దగా పట్టింపు లేని తనం ఒకటి ఆ అనాధ అనేభావన పెరగడానికి కారణం. అది కాకుండా మతం పేరుతో జరిగిన విధ్వంశం మూలంగా మిగిలిన విధి వంచితులు, రాజ్యవిస్తరణ మూలంగా బలైన విస్తాపితులు, యుద్ధభూమిలో ఒంటరి క్షతగాత్రు ను కాపాడుకోవడం కోసం వారి బ్రతుకు పట్ల, రక్షణ పట్ల ,భవిష్యత్ పట్ల ఒక మద్దతు మన్నన కల్పించే చట్టాలు దుర్భిణి వేసి వెతికినా దొరకవు. అనాధలు కూడా మన లాగే మనుషులు అనీ వారికి కూడా జీవించే హక్కు ఉంది, వారికి ప్రభుత్వ ఉపాది పరికల్పన అవసరం అనే చట్టాలు ఇంకా మాటలుగా నే మిగిలాయి. వారి భవిష్యత్ కోసం సమగ్ర చట్టాల రూపకల్పన అవసరం అనే నినాదం ఒక ఉద్యమ స్థాయిలో బయలుదేరాల్సిన అవసరం ఉంది. బహుశా ఆ ఆ వైఫల్యమే బాల్యం లోనే ఆదరణ కోల్పోయి డ్రగ్ బానిసలుగా, నేరస్వభావలక్షణాలు పెరిగి అసాంఘిక శక్తులుగా మారే అవకాశం మనమే ఇస్తున్నాం. ఆ అపసవ్యత్లను సరిదిద్దాల్సిన పాలకులు, పౌర సమాజ నిర్లిప్తత కు మనం తగిన మూల్యమే చెల్లిస్తున్నాం.

పందొమ్మిది వందల యాభయ్యో దశకం లో ఇఖ్యరాజ్య సమితి బాలల హక్కుల చట్టాల కోసం చేసిన కార్యాచరణ ను పరిగణ లోకి తీసుకొని వారి రక్షణ పట్ల నూతన చట్టాలు రూపొందించడం లఅత్యవసరం. ఎన్నో సార్లు పార్లమెంట్ లో ఈ అమానవీయ దుస్థితి మీద చర్చలు జరిపినా ఆచరణ లో కార్యరూపం దాల్చడం లేదు. పొరుగు దేశాల లో ఆయా దేశ పౌరుల రక్షణ , సంక్షేమం కోసం రక్షణ చట్టాలు ఉన్నాయి. స్వచ్చంద సంస్థలు, ఇస్లాం సమాజం అనాధల కోసం మదరసాల నిర్మాణాలు, పెద్ద ఎత్తున అనాధలకు చేయూతనిచ్చాయి. లేదా సంపన్న కంపనీల వితరణ మీద నడుస్తున్న పునరావాస కేంద్రాలు ఎన్నో మనం చూడగలం.

సోషలిస్ట్ సమాజాల లో ముఖ్యంగా రష్యా లో అక్టోబర్ విప్లవం, మొదటి ప్రపంచ యుద్ద కాలం లో, రాజకీయ అనిశ్చితి మూలంగా, బలవంతపు వలసల మూలంగా కోట్లాది మంది అనాధలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సోసలిస్ట్ సమాజాలు అనాధల పట్ల ఒక నిష్పాక్షికమైన రాజకీయ కార్యాచరణ రూపొందించినవి.ఆ విప్లవాత్మకమైన ఆలోచన ను అనాధల కలల సాకారానికి ఇక నుంచి ఈ దేశం లో అనాధ అనే పేరు వినపడదు అని నినదించిన మహోన్నతమైన లెనిన్ కాలాన్ని ఈ ప్రపంచం చూసే ఉంది. ఆ అనుభవాల నుండి మిగతా ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉండే. ఆ పరంపరను కొన్ని దేశాల లో వ్యక్తులు సంస్థలుఅనాధల కోసం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసినప్పటికీ ఇంకా కోట్లాది మంది వీధుల్లో మురికి కూపాల లో దినమొక గండంగా బ్రతుకు లీడుస్తునారు.

ఈ దేశం లో పుట్టిన ప్రతిమనిషికి జీవించే హక్కును నిరాకరిస్తున్న ఈ సందర్భం లో అనాధలూ ఈ దేశ బిడ్డలే వాళ్ళను కాపాడాల్సి న బాధ్యత ఈ దేశ పాలకుల మీద ఉంది.అది ఒక దేశ సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అన్నార్తుల కోసం మాట్లాడాలి. ఒక మారు మూల గ్రామం లో యాభై మంది అనాధల తో ప్రారంభం అయిన ఇన్నారెడ్డి ప్రయత్నం వందాలాది మంది చీకటి బ్రతుకుల్లో వెలుగుని నింపే క్రమానికి ఒక అడుగు ముందుకు పడ్డది.
రేపు రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ అనాధ హక్కుల సాధన తొలి మహాససభ ఒక చారిత్రక మైనది. ఒక రకంగా ఇది తొలి ప్రయత్నం. ఈ క్రమం లో అనాధల హక్కుల సాధన కోసం చర్చలు భవిష్యత్ కార్యాచరణ కోసం ఒక తొలి ప్రయత్నం. ఈ కార్యక్రమం లో దాదాపు పది దేశాలకు చెందిన అనాధ హక్కుల కోసం పనిచేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిథులు, మన దేశం లో దాదాపు పదిహేను రాష్ట్రాల కు చెందిన నాయకులు, కార్యకర్తలు, అనాధ ఆశ్రమాల లో పెరిగి అనేక కేంద్రీయ విశ్వవిధ్యాలయాల లో అనాధల వెనకబాటు కార్య కారణ సంభందాల మీద పనిచేస్తున్న కేంద్రీయ విశ్వవిధ్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు ఒక వేదిక మీద కలుసుకోబోతున్నారు. తమ కస్టాలు కన్నీళ్ళకు స్వాంతన కోసం జరుగుతున్న ప్రపంచ అనాధ హక్కుల సాధన ఫోరం ఆహ్వానించదగిన విప్లవాత్మక కార్య్రమం. ఆ క్రమానికి ఒక వాహిక అయ్యాడు ‘మా ఇల్లు ప్రాజాధారణ ఆశ్రమ’ నిర్వాహకుడు ఇన్నారెడ్డి. ఆయన లక్ష్యం గొప్పది. ఆ లక్ష్య సాధన లో మమేకం అవడం కోసం, అన్నార్తులు అనాధలుందని ఆ నవయుగ ఎంత దూరం లో ఉందొ కానీ మన ముందు ఉన్న తక్షణ సమష్య కలల సాకారానికి మనందరి చేయోత అవసరం. వీలుంటే ఆ ఆనాధల గొంతుకు ఒక మద్దతు వాఖ్యంగా కదులుదాం.

ఆంద్ర జ్యోతి ఎడిట్ పేజి 08-02-2020

 

(ఈ నెల 8,9 తారీకున ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ (FORCE) హైదరాబాద్ఇన్నయ్య లో జరగనున్న అంతర్జాతీయ సదస్సు సందర్భంగా.)
##FORCE ##మాఇల్లు ##Maaillu ##ORPHANS

డా.గుఱ్ఱం సీతారాములు
9951661001

One response to “అనాథల గూడూ గుండె ఈ ఇన్నారెడ్డి!”

  1. gujjula dattathreya Avatar
    gujjula dattathreya

    గ్రేట్ ఆర్టికల్ ఆన్ గ్రేట్ పర్సన్

    Like

Leave a comment