ఈ రోజు ఆంధ్ర జ్యోతి లో ఆంధ్ర,తెలంగాణ,హైదరాబాదు ఎడిషన్ లో నా వ్యాసం…వీలుంటే చదవండి.ఇది పూర్తి గా .

 

కొంకణ్ తీరం వెంబడి ఇంట్లో అల్లిన తట్టలు బుట్టలు నెత్తిన పెట్టుకొని వంట్లో చమటను ఉప్పు చెలిమిగా మార్చుకున్న బాల్యం ఆవిడది. పచ్చిగడ్దో, ఎండుకట్టెలో అమ్మ అల్లిన తట్టలో,బుట్టలో నెత్తిమీద పెట్టుకొని సమీప పట్టణానికి నడిచి వెళ్లి ఊరంతా తిరిగి అమ్మి కాసిన్ని నూకలు ఇంటికి తెస్తే అప్పుడు నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళేవి. రత్నగిరి లో మొదలైన ఒక అంటరాని జ్ఞాపకాలు నేడు ప్రపంచ వ్యాప్తంగా బ్రతుకు పాఠాలుగా మారి తరగతి గదుల్లో ప్రతి ద్వనిస్తున్నాయి. తరతరాలుగా సహ్యాద్రి పర్వత శ్రేణుల కింది అణగారిన బ్రతుకులు వాళ్ళవి.ఆకలి,అబద్రత,అంటరానితనం,అంధవిశ్వాసాల నడుమ పెరిగిన బాల్యం, యావత్ కొంకణ్ రీజియన్ లోనే తొలి పోస్ట్ గ్రాడ్యుయేట్ . తన పూర్వీకుల మౌఖిక గాధలకు తరాలుగా అల్లిక వార రసత్వాన్ని చరిత్ర రచనలో సృజనాత్మక సాహిత్యంలో అన్వయించి రాసిన ఆమె రాతలు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించినవి. ఆమే ఊర్మిళా పవార్. ఆమెకు ఈ ఏడాది త్రిపురనేని గోపీచంద్ జాతీయ పురస్కారం ప్రకటించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్య సాహిత్య చరిత్ర ‘ఆత్మకథ’ను తక్కువ చూపు చూసింది. పదిహేడో శతాబ్దం తర్వాత ప్రపంచ సాహిత్యంలో నల్లజాతి స్వాభిమాన పోరాటాల అనుభవిక జ్ఞానం పునాదిగా బయలుదేరిన ఆత్మకథలు ప్రత్యామ్నాయచరిత్ర నిర్మాణ వనరుగామారాయి. యూరోపియన్ మేదో ప్రపంచం లో 17 శతాబ్దం తర్వాత జరిగిన మార్పు, బానిసత్వ నిర్మూలన చర్చ మూలంగా బానిసల అనుభవాలకి, జ్ఞాపకాలకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ స్పూర్తిని కొనసాగించింది మరాఠా సాహిత్యలోకం. ఫూలే అంబేద్కర్ విప్లవాత్మక తాత్విక భూమికగా విస్తృతమైన కథ,కవిత్వం,నవల,ఆత్మకథలువచ్చాయి. వీటి వెనక భక్తిఉద్యమ చోఖమేల, సంతురవిదాస్,నామదేవ్ పరంపరఉంది. యాభయ్యో దశకం చివరి అంకంలో ‘మహారాష్ట్ర దళిత సాహిత్య సంఘ’ ఆవిర్భావం దాని కోనసగింపు గా ‘దళిథ్ పాంథర్’ ఆత్మగౌరవ దిక్కారం తొంబైల చివరలో ధారావి మురికివాడల్లో ఆదిపత్య మరాఠా సాహిత్యానికి వ్యతిరేకంగా పురుడు పోసుకున్న‘విద్రోహి’ సాహిత్య సమ్మేళనం స్ఫూర్తి ఉంది. ఆపరంపర నుండి బాబూరావు బాగుల్, నామదేవ్ దసాల్, వసంత మూన్,దయపవార్,లక్ష్మన్ మానె,శరణ శరణ్ కుమార్ లింబాలే లాంటి ఎంతో మంది బయలుదేరినా ఈ పోరాటాల్లో స్త్రీవాద అస్తిత్వ పొలికేక రత్నగిరి ఆడబిడ్డ ఊర్మిలా పవార్.

పందొమ్మిది వందల నలభై చివరి అంకం లో బోంబే ప్రెసిడెన్సీ రత్నగిరి జిల్లాలో జన్మించిన ఆమె తండ్రి ఒక బడిపంతులు,కుల పూజారి కూడా. తన పూర్వీకులకు పూజారులకూ మధ్య జరిగిన అభిప్రాయబేదాలతో తానే కుల పూజా క్రతువులు నడిపాడు. బాల్యంలోనే దూరం అయిన తండ్రి, ముగ్గురు చెల్లల్లు,ముగ్గురు తమ్ముళ్ళు నిట్టాడి లేని వంటరి బ్రతుకుల్లో ఒక్కొక్క పైసా కూడేసిన వెలుగు నింపడానికి తన తల్లి బ్రతుకంతా యుద్దమే చేసింది. పుట్టింది దళిత కుటుంబం అయినా తన పూర్వీకుల వ్రుత్తి మేదరిపని. ఇంట్లో అల్లిన తట్టలు,బుట్టలు తన బ్రతుకు సోపానాలు అయ్యాయి. తల్లి త్యాగం తన చుట్టూ వ్యవస్థ చేసిన కుల గాయాలు ఆమెను దేశం గర్వించ దగిన రచయిత్రినీ ,చరిత్రకారిని, స్త్రీవాదిని చేసింది. ఏ తరగతి గదులు తనను అంటరానిది,మురికిది అని ముద్రేసాయో, ఏ తరగతి గదులు పాకీదానిలా మార్చి అవమాన పరిచాయో, అవే తరగతి గదుల్లో ఆమె బ్రతుకు పాటం బడిపాఠాలు అయ్యాయి.

ఊర్మిళ పవార్ పుట్టిన పెరిగిన ప్రాంతాలు బుద్దుడు బ్రతికి ఉండాగానే ఆయన తాత్విక ధారలో ఉన్నట్టు చారిత్రిక ఆధారాలు అంబేద్కర్ పెరిగిన గుర్తులూ ఉన్నాయి. మళ్ళీ రెండు వేల ఏళ్ళ తర్వాత అంబేద్కర్ చివరి దశలో వేలాది మందితో ప్రత్యామ్నాయ ఆలోచనల వైపు మళ్ళారు. మహారాష్ట్ర పల్లెల్లో పూరి గుడిసెల్లో గోడలకు తరతరాలుగా వేలాడుతున్న విశ్వాసాల అవశేషాలను చెత్త బుట్టల్లో విసిరేశారు. ఇదేదో ఒక మతం మీద మరొక మతం సాధించిన పైశాచిక విజయం కాదు. మనిషిని మనిషిగా చూడని ఒక విశ్వాసం మీద సమతా భావనల తిరుగుబాటు. అది జరిగే నాటికి ఆమె వయసు పదకొండేళ్ళు. తన అసలు పేరు విమల తన సహచరుడు అంబేద్కర్ ఆలోచనపరుడూ అయిన హరిశ్చంద్ర తో పెళ్లి తర్వాత విమల ఊర్మిళ పవార్ అయ్యింది.

ప్రపంచ ద్రుష్టి రాత అయితే ఉర్మిలది అల్లిక సంస్కృతి. ఒక వైపు వాళ్ళ అమ్మ తన జీవిక కోసం బుట్టలు అల్లడం ఇంకో వైపు ఊర్మిళ తన నడిచి వచ్చిన కస్టాలు, నష్టాలు అల్లుకుంటూ ఒక రూపం ఇవ్వడం. ఇద్దరూ ఏకకాలం లో చరిత్ర నిర్మిస్తూ ఉన్నారు. ఒకరు తన బ్రతుకు నిట్టాడి కూలి తనువంతా బరువూ బాధ్యతలు మోస్తే మరొకరు ఆ అల్లిక వారసత్వ పునాదిగా దళిత మహిళా చరిత్రను పునర్న్నిర్మించే పనిలో ఉన్నారు.

డెబ్బైల లో రత్నగిరి నుండి బొంబాయికి మారాక అక్కడి కవులు రచయితలు మేధావుల కలయికతో మొదట మైత్రిని, ‘సంవాదిని’ అనే సాహితీ మిత్రమండలితో కలిసి స్త్రీవాద సాహిత్య నిర్మాణాలు చేసిన ఆమె నాందేవ్ దసాల్,అరుణ్ కాంబ్లె, జెవి పవార్, అర్జున్ డాంగ్లె లు ఇచ్చిన స్ఫూర్తి, షర్మిలారేగె,ఎలెనార్ ల సహచర్యంలో ప్రోదిచేసుకున్న బౌద్ధిక జ్ఞానం అట్టడుగున కనిపించని మరాఠ మహిళా చరిత్ర వెలికి తీయడానికి దోహదపడ్డది. వసంతమూన్ సహచరి మీనాక్షిమూన్ తో కలిసి మహారాష్ట్ర కేంద్రంగా బయలుదేరిన స్వాభిమాన ఉద్యమాల చారిత్రిక నేపధ్యాన్నివిద్యావ్యాప్తిని,అనాదిగా దళితబహుజన కులాల్లో అమానవీయమైన దేవదాసి వ్యవస్థను, మొదట అంబేద్కర్ రాజకీయ పునాదుల్లో అనామకంగా మిగిలిపోయిన స్త్రీవాద రాజకీయాలను,దళిత స్త్రీవాద నిర్మాణాలకుఒక రూపంఇవ్వాలనుకుంది. యాభయ్యో దశకం మొదలు నేటి దాకా సాంస్కృతిక నిర్మాణంలో ఉన్న దాదాపు యాభై మందికి పైగా స్త్రీల బ్రతుకు చిత్రాలను చరిత్రలో మొదట మరాఠలో ఆ తర్వాత ఆంగ్లం లో “వి అల్సొమేడ్ హిస్టరీ” మేధావుల విమర్శకుల అభిమానాన్ని పొందింది. రమాబాయి అంబేద్కర్ మొదలు రాధాబాయికాంబ్లె,బేబీకాంబ్లె,ఎందరోఅట్టడుగునకనిపించనికథలు బయటకు తేవడం దేశస్త్రీవాద రాజకీయాలకు ఒక మేధో చేయూత నిచ్చింది.

ఆమె అనుభవించిన వివక్ష ఉద్వేగాల కొలిమిలోంచి పురుడుపోసుకున్న ‘సిక్స్త్ ఫింగర్’,’ఉదాన్,’అయదన్’ రెండు ఏకాంకికల తోబాటు యత్రాకథనాలు, నాందేడ్, వార్ధా,ముంబై ప్రపంచ వ్యాప్తంగా అనేక పేరుమోసిన విశ్వవిద్యాలయాలలో ఆమె ఆత్మకథమీద చర్చలు పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుకు పరిశోధనా పత్రాలు, వందలాది సదస్సులలలో పాల్గొన్న ఆమె ఈ తరానికే కాదు రాబోయే తరాలకూ ఒక దిక్కార పతాక. ’నేను సావిత్రి భాయిఫూలే నాటకాన్ని రాసి అందులోనటించిన ఆమె సాహిత్యం అనేక భాషల్లోకి అనువాదం జరిగి , రేడియో వివిధ టి వి చానెల్లలో కథా వస్తువుఅయ్యాయి. జబ్బార్ పటేల్ తీసిన అంబేద్కర్ సినిమాకి కూడా పనిచేసారు.
పందొమ్మిది వందల డెబ్బై లలో మొదలైన ‘దళిత్ పాంథర్స్’ దేశ స్వాభిమాన ఉద్యమాలకు ఒక దిక్సూచి. దానిలో మహిళా ప్రాతినిథ్యం లేకపోవడాన్ని సూటిగా ప్రశ్నించింది. ఆకలి అవమానం,నిరక్ష్యరాశ్యత,అంధ విశ్వాసాలులతో సతమతం అవుతున్నమహిళలకు రాజకీయ,సాహిత్య నిర్మాణాలు ఉండాలని ఉద్యోగాన్ని కుటుంబాన్ని వదిలి తన సాహిత్య జీవిత గమనాన్ని నిర్మించుకుంది. తన రాజకీయ కార్యాచరణ లక్ష్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని అంబేద్కర్ చూపిన ప్రత్యామ్నాయ మార్గం వైపు మారేలా దారి చూపాయి.

పదిహేను ఏల్లకింద మరాఠ లో ‘ఆయదాన్’ గా ఆంగ్లం లో “వీవ్ అఫ్ మై లైఫ్” పేరుతో రాసుకున్న ఆత్మ వ్యధాత్మక కథనం అస్తిత్వ రాజకీయాలలో, స్వాభిమాన పోరాటాలలో చెరిగిపోలేని సంతకం. తన మాతృభాషలో రాసిన దానిని ఆంగ్లంలో మా ఎఫ్లూ అధ్యాపకురాలు మాయ పండిట్ అనువదించగాప్రఖ్యాత కొలంబియా విశ్వవిధ్యాలయం ప్రచురించారు. ఆమె రచనలు అనేక భాష లోకి అనువాదం అయ్యాయి.గడిచిన ఏడు దశాబ్దాల దళిత మహిళ గుండె చప్పుడు ‘అయదాన్’. ‘ఇది కేవలం నా కథ కాదు నా మూలవాసుల ఆత్మకథ’ నేను పొందిన అనుభూతులూ అనుభవాలు నాసొంతం కావు అవి ప్రజల సామూహిక దుఖంసాగరం నుండి పురుడు పోసుకున్న ఆకాంక్షలు అని రాసుకుంది. బాల్యం లోనే కోల్పోయిన తండ్రి, గంపెడు కుటుంబాన్ని గంపలు అల్లి అమ్మి సాకిన తల్లి, డెబ్బై ఏల్లకింద కొంకణ్ తీరంలో ఆకలి అవమానాలకు, జ్ఞాపకాలకు తన వర్తమాన కార్యాచరణ కలిపి రాసింది. తనకు ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు. ఆమె జీవితం లో అంతులేని విషాదం ఉంది. ఇష్టపడి చేసుకున్న హరిశ్చంద్ర, వైద్య విద్యచదువుతున్న ఒక్క గానొక్క కొడుకునూ కోల్పోవడం. ఆ క్షోభని తథాగతుని తత్వాల అనువాదంలో సాంత్వన పొందింది.

ఆదిపత్య కులాల స్త్రీ హక్కుల మధ్య అనాకారిగా మిగిలిన దళిత మహిళ అస్తిత్వ పునాదుల్లో ఊర్మిలాపవార్ నడిపిన రాజకీయాలు ఉన్నాయి. జాత్యహంకార వ్యతిరేక దర్భన్ సదస్సు మొదలు బీజింగ్ లో అంతర్జాతీయ మహిళా సదస్సు మహారాష్ట్ర కేంద్రంగా జరిగిన అనేక స్వాభిమాన పోరాటాల లో ఆమె ప్రాతినిత్యం ఉంది. తన అమ్మ బువ్వ కొరకు బుట్టలు అల్లుతూ ఉంటె మరోవైపు వైపు తనబ్రతుకును అక్షరాలలోకి బట్వాడా ఏక కాలంలో చేసింది . అల్లిక తన పూర్వీకుల నుండి అబ్బిన విద్య, రాత తన జీవితాలోకి ఆలశ్యంగా వచ్చినా వారసత్వంగా వొనకూరిన అల్లిక తన రాతలనుభిన్నంగా నిలిపాయి. ఆధునిక సమాజం లో కులం అరణ్యాలలో క్రూర జంతువులు మాయం అయినట్లు కనిపిస్తది,కానీ పొదల్లో ఏ క్రూర జంతువు ఏ క్షణాన దాడి చేస్తాదో నిత్యం బడుగు జీవితాలు బిక్కు బిక్కుబిక్కుమంటూనే ఉన్నాయి. రోజు కొక కుల ఉత్పాతం మానుదిటిపై చేసిన గాయాలను మోస్తూనే ఉన్నాం అంటుంది. ఆమె ఈ కాలపు నిజమైన ఆచరణ వాది.
తన తల్లిచెమట రక్తం కలిపిన అల్లికల కొనసాగింపుగా ఊర్మిల ఒక్కొక్క దర్భ కూడేసి తన జీవితాంతం అల్లుకున్న పిచ్చుక గూడులోంచి ఒక్కొక్క పాత్రా మాయం అయ్యింది.పెంచి పెద్దచేసిన తల్లి, తండ్రి, తమ్ముడు, కొడుకు, భర్త ఒక్కొక్కరు దూరం అయితే తన కల్లోల జీవితానికి రచనవ్యాపకం మాత్రమె సాంత్వన అయ్యింది. ఆమె ఆత్మకథ అయదాన్ కుపదిహేను ఏల్ల కిందనే ‘మహారాష్ట్ర సాహిత్య పరిషత్’ ‘లక్ష్మిభాయితిలక్’ పేర ఏర్పడిన రాష్ట్ర ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని తిరస్కరించిన ఆమె రాజ్యం ఇస్తున్న పురస్కారాల పట్ల తన వైఖరిఏమిటో ప్రకటించారు. పందొమ్మిది వందల యాభైలలో మొదలైన ఊర్మిళ ప్రస్తానం గడిచిన ఆరు దశాబ్దాల కష్టాలలో,కన్నీళ్ళలో జయాపజయాలలో మహోన్నతమైన మరాఠ దళిత స్త్రీవాద రాజకీయాలో అణువణువూ నింపుకున్నది. ఆమె వర్తమాన రాజ్య వికృతానికీ, విషాదానికీ సాక్ష్యంగా మిగింది.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసాక రెండు మహోన్నతమైన వ్యక్తిత్వాలు లండన్ కేంద్రంగా తమ రాజకీయ తాత్విక కార్యాచరణను మొదలు పెట్టాయి.అంబేద్కర్ కొలంబియా వదిలి లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో రీసెర్చ్ మొదలు పెట్టేనాటికి త్రిపురనేని డబ్లిన్ నుండి బారిస్టర్ పట్టాతో తిరుగు ప్రయాణంలో ఉన్నాడు అదే ఏడు అంబేద్కర్ స్కాలర్ షిప్ అయిపోతే ఇండియా వచ్చాడు. ఒకరు ఫూలే మరొకరు పెరియార్ స్పూర్తితో ఆధునికతను ప్రత్యామ్నాయ ఆలోచనలనూ తమ పుట్టిన గడ్డకు మోసుకొని వచ్చారు. ఒకరు విశాలమైన విముక్తి రాజకీయాలను నడిపితే మరొకరు తెలుగునాట ద్రావిడ,జస్టిస్ పార్టీ రాజకీయాలు కొనసాగించారు. అచంచల విశ్వాసం తో కడదాకా నమ్మిన విలువల కోసం తపించిన మహోన్నత వ్యక్తిత్వాలు వాళ్ళవి.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక ప్రపంచ వ్యాప్తంగా అల్లుకున్న అబధ్రతా భావం,మానసిక భావసంఘర్షణ, జాతీయోద్యమ ప్రభావం,హేతువాద,నవ్యమానవవాద రాజకీయాల కొనసాగింపును తెలుగు సాహిత్యంలో, కథల్లో,నవలాతాత్విక రచనల్లో మధ్య తరగతిఊగిసలాట, తన చుట్టూ ఉన్నసంక్లిష్టత ‘అసమర్ధుని జీవన యాత్ర’, ‘పండిత పరమేశ్వరుని వీలునామా’ లాంటి రచనలలోకి మరికొన్ని సినిమాల్లోకి మనల్ని తీసుకొని వెళ్ళిన గొప్ప సాహితీవేత్త గోపీచంద్. అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితం అయిన ఊర్మిళాపవార్ కు గోపీచంద్ పేర ఏర్పడిన పురస్కారం లభించడం కేవలం యాదృచ్చికం కాదు. మూడున్నర దశాబ్దాల కొనసాగింపు లో భాగంగా, అదే విలువల దారిలో నడిచిన ఏడు దశాబ్దాల స్వాభిమాన పోరాటాల నిలువెత్తు ఆత్మగౌరవానికి ఇవ్వడం నిజంగా ప్రత్యామ్నాయ విలువల కొనసాగింపే.

(అపర్ణ లాంజీవర్ అమ్మమ్మ అంబేద్కర్ తో కలిసి పనిచేసిన వాలంటీర్, ఊర్మిళ పవార్ వసంత మూన్,అంబేద్కర్ కొడుకు తో కలిసి పనిచేసింది. వాళ్ళ జ్ఞాపకాలు వినడానికి అయినా రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో కలుద్దాం… )

డా.గుఱ్ఱం సీతారాములు 9951661001
(సెప్టెంబర్ ఎనిమది సాయంత్రం తెలుగువిశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రఖ్యాత మరాటీ రచయిత్రి ఊర్మిళా పవార్ కు త్రిపురనేని గోపీచంద్ అవార్డు ఇస్తున్న సందర్భంగా)

Advertisements