1926205_768759206496103_2140984551297945854_o

‘తెలంగాణా ప్రజలు భావోద్వేగాలను ఆపుకోలేరు’ అన్నాడు ఓ సీమాంధ్రమిత్రుడు. ఈ మాట అతను సరదాగా అన్నా ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్ధం అయింది . ఇచ్చిన మాటకోసం ఏ త్యాగానికి అయినా సిద్దపడే బలహీనత లోంచి అతను ఆ మాట అని ఉండొచ్చు.వాస్తవానికి అదో విచిత్రమయిన మానసిక దౌర్భల్యం. ఈ లక్షణం కేవలంతెలంగాణాలోనే కాదు, తరతరాల అణచివేత దోపిడీ పీడన వివక్ష ఎక్కడున్నా ఆప్రజల భావోద్వేగాలు వర్తమానసమాజాల కంటేభిన్నంగానే ఉంటాయి . చరిత్రలో అవి అరుదుగా అప్పుడప్పుడూ బయటపడతాయి . ఒక ప్రాంత విముక్తికోసం వందలాదిగా సామూహిక హననం చేసుకున్న దుష్టాంతాలు అరుదు. అక్కడక్కడా శత్రుదేశాల బారినపడకుండా ఆత్మాహుతి చేసుకున్నవి, మతపరమయిన బలిదానాలు మినహాయిస్తే, తెలంగాణా లో మొఘలాయీ లకు బందీగా చిక్కి న ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి చనిపోయిన వైనం వెనక ఓటమిని జీర్ణించు కోలేని బలహీనత చరిత్రలో మనం విన్నాం . మళ్ళీ ఆ ఒరవడి ప్రత్యేక తెలంగాణా సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఒక ప్రాంత ఆక్రోశం అగ్గిఅయి మండింది. దేశ రాజధాని ఒక ఉరిని చూసి ఉలిక్కి పడింది, ఒక ఆనాద ఆశ్రమం లో పెరిగిన యాదయ్య తాను సంపాదించిన దానిని అదే ఆశ్రమానికి ఇచ్చి యన్ సి సి గేటు దగ్గర ఆత్మగౌరవ పతాక అయి కనుమరుగు అయ్యాడు. రక్షణ కోసం వాడాల్సిన తుపాకి కానిస్టేబుల్ కిష్టయ్య కణత మీద నర్తించుకునేలా చేసింది. పరిగెత్తుతున్నరైలును ఒక నినాదం డీకొని ఉలిక్కి పడేలా చేసింది, చీకటిని పారద్రోలే వెలుగు పెట్రోల్అయి పెయ్యి మీద నర్తించింది. ఒకటా రెండా వందల అత్మాహుతులు ఇవన్నీ దానికి మరొకటి ప్రేరేపితమయిన చర్యలు ఆ చర్యల వెనక ఒక ఉద్వేగం ఉంది ఒక ఆశ ఉంది ఒక ఆర్తి ఉంది ఒక కన్నీటి వలపోత ఉంది. దాని వెనక ఒక సుందర స్వప్నం కోసం కన్న తరం ఆశలు ఉన్నాయ్. ఆశయం సన్నగిల్లితే జరిగిన తప్పిదాలు అవి . తెలంగాణా ప్రజల అదృష్టమో దురదృష్టమో కానీ ఉస్మానియా విశ్వవిధ్యాలయ కేంద్రంగా నే ఎక్కువగా ఈ ఉద్వేగాలు పెల్లుబికాయి. ఇలాంటి కథనాలు కష్టాలు కన్నీళ్లు కలగలసి ఉంటాయ్ అక్కడ . ఒకసారి ఉస్మానియా కి వచ్చి పలకరించండి. ఒక్కొక్క విధ్యార్దిది వెతలకలబోత. ఒక్కో తండ్రిది ఒక్కో ఆశ. పండిన దాన్యం అమ్ముకొని వాళ్ళను పట్నంచద్వులకు పంపిస్తూ కన్నీటిపొరలు కదులుతున్న కళ్ళతో చేసుకున్న వీడ్కోలు, తన కొడుకులు ఉన్నత చద్వులు చదవి తన తలరాతను మారుస్తాడు అనుకొని కోటిఆలోచనల తో భవిష్యత్ మీద గంపెడు ఆశతో,తర తరాలుగా  తన తండ్రులు తట్టలు మోసారు. దానికి చదువే విముక్తి అనుకుని ఒక్కో విద్యార్ది నడవాలనుకున్న గమనం గతుకుల మయిమయిన రోడ్డులా మారింది .

తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్ది జీవితం నల్లేరు మీద నడకలా నిత్యకల్లోలాలతోనే బాల్యం గడిచింది.తన యవ్వనం ఆకలి, అంటరాని తనం మధ్య, విశ్వవిధ్యాలయ చదవు ఒక సైనిక పహారామధ్య నడిచింది. నగరం అంతా పోలీసుల డేరాలతో శత్రు దేశాల మధ్య ఉండాల్సిన మిలటరీ పద గట్టనల మధ్య గడిచింది ,హాస్టల్ మూసి వేతతో ఛీకటి గదుల మధ్య ఆకలి కడుపులను ఎండబెట్టిన వైనం. ఒక భద్రత లేని పరిస్థితుల  మధ్య బిక్కు బిక్కుగా గడిచింది. అదో మానసిక ఉక్కపోత ,చీటికి మాటికి కేసులతో  నీడలా వెంటాడిన ఒక భయానక స్థితుల మధ్య కొట్టు మిట్టాడిన ఒక నిరుద్యోగి జీవితం ఎందుకు బళ్ళున తెల్లారిందో మీకు చెప్పాలనిపించింది .

పెద్దపల్లి కి చెందిన సూర్యనారాయణ ఉస్మానియాలో పరిశోదకవిద్యార్ది కెసిఆర్ నిరాహారదీక్ష తదనంతరం ఊస్మానియాతో సహా యావత్తెలంగాణా విద్యార్దిలోకం అగ్గి రవ్వై మండింది. ఆ ఉద్యమ ఉద్రితిని ఆపేందుకు సీమాంధ్ర పోలీసు చేసిన కసాయి తనానికి బలయిండు.హాయిగా తిని చద్వుకోవాల్సిన పరిశోదక విద్యార్ది ఒక అర్ద రాత్రి హటాత్తుగా ‘అయ్యో తుపాకులు’ ‘బాంబులు’ ‘పారిపోండి’ ‘రక్షించు కొండి’ అని అరవడం మొదలెట్టాడు. ఆనాడు ఉస్మానియా బి హాస్టల్ దగ్గర జరిగిన లాటీ చార్జిని బహుసా దగ్గరగా చూసిఉండొచ్చు. పోలీసుల చేసిన స్వైర విహారానికి కలత చెంది మనో వైకల్యానికి గురై,తన ఊరికి పోయి ఓ కాళరాత్రి ఇంట్లో నిద్రపోతున్న కన్న తల్లిని రోకలి బండతో కొట్టి చంపాడు, పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు పంపారు. కొంతకాలం జైల్లో ఉన్నాడు. బెయిలుమీద ఇంటికి వచ్చాడు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత అర్దరాత్రి తన తండ్రినీ అదేరోకలి బండతో కొట్టి చంపాడు. ఇది అతనిచెదిరినకల ఒక బవిష్యత్ కు బలవంతపు పులుస్టాప్ . ఇదే క్రమంలో బల్వన్మరనానికి గురిఅయిన మరో విద్యార్దిగతం కూడా చెప్పాలనిపించింది బోగాసత్యనారాయణ అనే ఒక పద్మశాలీ విద్యార్ది వ్యదార్దమయిన వైనం కూడా మీకు చెప్పాలి. కోటి ఆశలతో కూటికోసం పేగులు దారల్లా మారిన ఒక చేనేత బడుగు జీవి వలపోత గురించి చెప్పాలి. సత్యనారాయణ అనే ఒక నిరుద్యోగి అత్యంత ప్రతిభావంతమయిన విద్యార్ది. కూటి కోసం కోటి ఆశలతో కన్నారం నుండి ఒక వలస కూలీ లా వచ్చాడు. తెలంగాణా ఉద్యమం ఉదృతంగా ఉన్న రోజులు అవి దశాబ్దాల వెనకబాటు తనం విద్య ఉద్యోగం ఉపాది లో వివక్ష కు మతిచెడి ఇంటికి వెళ్ళాడు . నిరుద్యోగ రూపం లో విధివెక్కిరించింది మనసు కలత చెందింది. తనలో తానె మాట్లాడుతూ ఉండేవాడు . గేటుకాడ గుంటలు తవ్వారని అవి తనను అందులో పాతి పెట్టేందుకే తీసారని తనతో పాటు చదవు కుంటున్న తన తమ్ముడితో అనేవాడట. పరిస్తితి విషమించడం తో తమ్ముడు తన అన్నను ఇంటికి పంపాడు అక్కడన్నా ప్రశాంతంగా ఉంటాడని.పాపం తనకేం తెలుసు విధి తనను హంతకుడిగా మార్చి బలవన్మరానికి లోనవుతాడని అలా ఓ కాళరాత్రి రోకలి బండతో తన తండ్రిని బాది చంపి మరుసటి రోజు తానూ బల్వన్మరనానికి పాల్పడ్డాడు. వ్యవస్థ దృష్టి లో అతనో హంతకుడు,పిచ్చివాడు, జీవితాన్ని ఎదిరించలేక నిష్క్రమించినవాడు, దుర్భలుడు పిరికివాడు . ఎన్ని లేబుళ్ళు అయినా తగిలించడానికి అర్హులు వాళ్ళు . కానీ ఆ హత్యలకు మూలం ఈ ప్రాంతం లో విద్యార్ది లోకం తమ ఆత్మస్థైర్యం మీద కోల్పోతున్న నియంత్రణ, దాని మూలంగా దాదాపు తొలి విడత మలివిడతలో పదిహేను వందల మంది బలవన్మర్నాలకు గురయ్ కన్న వారికి కడుపు కోత మిగిల్చిన వైనం తెలంగాణా సాధన సాక్షిగా చూసాం . ఒక ప్రాంత విముక్తి కోసం యుద్ధం లో పోరాడి ప్రాణాలు అర్పించిన చరిత్ర చూసి ఉంటాం కానీ, తమను తాము బలవన్మ రానలకు కారణ భూతం కచ్చితంగా వ్యవస్థీకృత హత్యలు గానే చూడాలి. ఇక్కడ ఆత్మహత్య లు వ్యక్తిగత మయినవా వ్యవస్థీకృత మయినవా అనే చర్చ పక్కన పెడితే, ప్రతి మానసిక దౌర్భల్యం వెనక రాజ్యం లో ఉన్న అపసవ్యత నే కారణం దర్ఖ్ హమ్ లాంటి వివేచనా పరులు సూత్రీకరించారు . అదే సందర్భం లో ఈ వ్యాస రచయిత తో సహా వందలాది మంది విద్యార్దులు హైదరాబాద్ నుండి ఉత్తర తెలంగణా దక్షిణ తెలంగాణా లు కలుపుతూ చేసిన పాదయాత్రలో వరంగల్ జిల్లాలో ఒక తండా ఊరి బయట స్మశానం లో ఆత్మహత్య చేసుకున్న తన కొడుకు బొంద మీద పడి ఓ బక్క తల్లి చేస్తోన్న వలపోత గుండెలను పిండేసింది. నీ తోటోల్లు వచ్చారు లే బిడ్డా వాళ్ళకు గన్ని నీళ్ళు ఇవ్వు అని ఆ తల్లి చేసిన రోద మా మదిలో ఇంకా సుడులు తిరుగతూనే ఉంది. అలా పోయిన ప్రతి ఊరిలో ఉరితాల్లను చూస్తూ వరంగల్ దాకా సాగిన గతించి పోయిన గాయాలు సలుపుతున్నా అమరత్వాన్ని ఎత్తి పడుతూ ఒక లక్ష్యం కోసం చేసిన నడక అది. ఈ అన్ని ఒలపోతల వెనక ఒక వెనకబాటు తనం నుండి వచ్చిన ఆక్రోశం. ముఖ్యంగా నిరుద్యోగం. నాటి వందేమాతరం నినాదం నుండి విశ్వవిద్యాలయాల నుండి బహిష్కరణకు గురి అయిన తరం తదనంతర నరహంతక ఎమెర్జెన్సీ తర్వాత ఒక వెల్లువలా వచ్చిన వామపక్ష విప్లవ చైతన్యం ఒస్మానియా లో విద్యార్దుల వైపు యావత్ దేశం చుసిన వైనం, ఇడ్లీ సాంబార్ గోబాక్ , బూర్జువా చద్వులు బువ్వ పెట్టవ్ అని తమ బవిష్యత్ ను ‘గ్రామాలకు తరలండి’ లో చుసుకున్న్ వైనం , కోరుట్ల జగిత్యాల వెలుగులో ఓనమాలు దిద్దుకున్న తరం , ‘బండ’ కాంటీన్ సాక్షిగా రగల్చిన తూర్పు పవనం, గిచ్చేన్న గిరిమల్లెలో అని పాడుకున్న పాటలు, చుండూరు కారంచేడు రగిల్చిన కసితో స్కాలర్స్ హాస్టల్ అంబేద్కర్ గా పేరు మార్చుకోవడం , కసాయీ మూకల మిన్నాగుల నుండి తల్లి కోడిలా కడుపు కింద దాచుకున్న వైనం అది . పడగవిప్పిన కాషాయీ మూకలకు ఇ టు (సరయూ హాస్టల్) లో తీర్చుకున్న పగ దాచేస్తే దాగని సత్యాలు. వామపక్ష విప్లవ శిభిరాల్లో కుల చర్చ ఒక అనివార్యతను సంతరించుకున్నప్పుడు తాము ఎటు వైపు ఉండాలో అని మేధో చర్చ చేసిన వైనం. చరిత్ర గతులూ గమనాలు చిత్రిక పట్టిన విద్యార్ది తరం లోకానికి ఒక ఆదర్శ వంతమయిన వీరులను కల గన్న వైనం అది. వీరులారా వందనం నుండి చంచల్ గూడా జైలు లోన చంద్రవంకలారా! ఓ చంద్రవంకలారా!! వరకూ పరిణామం చెందిన చరిత్ర మన కళ్ళముందే ఉంది. నాటి పీవీ నుండి పిడమర్తి దాకా తెలంగాణా లో విద్యార్దులు ఏం చేసారు ఏం చేస్తారు అంటే ఒక నాలుగు దశాబ్దాల సాహిత్య సాంస్కృతిక పోరాటాల వెనక విడదీయలేని సంబందాలను సజీవంగా ఉంచిన వైనం అది. యావత్ విద్యార్ది శక్తి తమ కష్టాలను సుఖాలను భవిష్యత్ ను తెలంగాణా వెలుగులో, తాము నిర్మించుకున్న ఒక ఆశల సౌధం వైపు నడక. ఆ నడకే ఉద్రుతుమై పెను మంటై దావానాలం అయి ఒక నినాద ప్రాయమయింది అదే జై తెలంగానా. ఏది ఏమయినా తెలంగాణా అనే ఒక ఊహను కలగన్నది విద్యార్ది లోకం. వీటి వెనక ఏ పెద్ద పెద్ద కోరికలు లేవు కోట్లు సంపాదించి, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనే తపనా లేదు. కేవలం చద్విన చద్వుకు ఉపాధి దొరికితే చాలు అనే చిన్న ఆశ వాళ్ళను నాలుగు దశాబ్దాల చరిత్రలో భాగస్వాములను చేసింది.

ఒకప్పుడు నినాదాలతో పిక్కటిల్లిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఇక ప్రశాంతంగా ఉంటది ఇక ముళ్ళ కంచలు ఉండవు టియర్ గ్యాస్లు రబ్బరు బుల్లెట్లు ఉండవు అని విద్యార్థి లోకం ఆశించింది. కానీ నెల రోజులకే మొదటిసారి స్వీయ రాష్ట్రంలో పోలీసుల లాఠీలు తార్నాకా చౌరస్తా సాక్షిగా విద్యార్థినుల వీపులపై నర్తించాయి. ఇప్పడు తెలంగాణా రెండు నెలల పసిగుడ్డు. తెలంగాణా రాగానే ఇక్కడ ప్రజల తల రాతలు మారతాయనే భ్రమలు లేనప్పటికీ, నీళ్ళు నిధులు వనరులు దోపిడీ నుండి విముక్తికోసం ఉద్యోగాల సాధన తాత్విక భూమికగా స్వీయ రాజకీయ అస్తిత్వ పునాదిగా సాగినప్పటికీ, నెల గడిచాక కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం అని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటన విద్యార్దుల అక్రోశాలకు కారణం అయింది. అటు సీమంద్ర ఇటు తెలంగాణా పాలకులు ఎన్నికల్లో గెలిపిస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసారు. ముందు నోటిఫికేషన్ ఇచ్చేపని మొదలెట్టకపోగా ఉద్యోగం అడిగితే లాటీలు చూపించారు దాని పర్యవసానం భావోద్వేగాలు మళ్ళీ పెల్లుబికాలా చేసాయి. ఏ విద్యార్ది లోకం అయితే ఈ నేల విముక్తి కోసం జాక్ గా ఎర్పడ్డారో అదే విద్యార్ది లోకం ఈ కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ చేసే క్రమాన్ని వ్యతిరేకించడం కోసం “జాక్” గా ఏర్పడి నిరవదిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఏం ఆశించి ఈ విద్యార్దులు లోకానికి భిన్నంగా నడ్వాలనుకున్నారు? చదవు కున్న చద్వుకు చిన్న ఉద్యోగం తో పాటు అసమానతలు లేని ఒక మెరుగయిన సమాజం కోసం. నూతన ఆర్ధిక సరళీకృత విధానాలు తెచ్చిపెట్టిన కాంట్రాక్ట్, ఔట్సొర్సింగ్ ఉద్యోగుల నియామక విధానం వెనక ప్రపంచ బ్యాంకు ఆంక్షలకు ప్రతి బింబం. ఈ లోపబూయిష్టమైన విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎప్పుడో ఐక్య పోరాటాలు నిర్మించాల్సి ఉండే. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కొత్త ప్రభుత్వం ఎన్నో ఏళ్ళుగా పేరుకుపోయిన జఠిలమయిన సమస్యను నేత్తినేసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం అనే ప్రధాన నినాదం నిజంగా అభినందనీయమే కానీ జూనియర్/డిగ్రీ లెక్చరర్ లాంటి గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలను కూడా క్రమబద్దీకరణ చేయాలనుకోవడం సరయినది కాదు. ఎందుకంటే ఇప్పడు కాంట్రాక్ట్ లో, ఔట్సొర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళు చానామంది కనీస అర్హతలు లేకుండా, చాలా చోట్ల బంధు ప్రీతితో కుల సమీకరణలో బాగంగా జరిగినవే ఎక్కువ. పైగా ఈ మధ్య కాంటాక్ట్ లెక్చరర్ ఉద్యోగ నియామకానికి యాభై వేలు డిమాండ్ చేస్తూ ఒక రీజినల్ జాయింట్ డిరెక్టర్ స్తాయి అధికారి పట్టుబడటం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది జరిగిన నియామకాలు ఎక్కువగా రోల్ అఫ్ రిజర్వేషన్ల కు విరుద్దంగా శాస్త్రీయత కు అతీతంగా జరిగినవే. వీటిని సరిదిద్ది తాజా నియామకాలు చేపట్టే క్రమం లో కాంటాక్ట్ వాళ్ళకు కొంత వైటేజీ ఇవ్వడానికి ఎవరూ వ్యతిరేకం కాదు. అందునా నాలుగో తరగతి స్తాయి ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమంజసమే అయినా, గెజిటెడ్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ అనేది అసమంజసమైందే. మొత్తం ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయడం అంటే విదార్డుల నోట్లో మన్ను కొట్టినట్టే. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించడం మూలంగా తలెత్తే న్యాయపరమయిన చిక్కులను అధ్యయనం చేయకుండా గత అనుభవాలు కర్ణాటక వెర్సెస్ ఉమాదేవి , సురేంద్ర ప్రసాద్ తివారి వెర్సెస్ ఉత్తరాప్రేదేశ్ తో పాటు సుప్రేం కోర్ట్ లో ఎన్నో తీర్పులు ఈ విధాన పరమయిన లోపభూయిష్ట మయిన క్రమబద్ధీకరణలకు వ్యతిరేకమయిన తీర్పులు చూసయినా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆ అనుభవాల నుండి ఇంకా గునపాటాలు ప్రభుత్వాల్లు నేర్చుకోవల్సే ఉంది. దాదాపు మూడు తరాలు గెలుపు యాత్రలో విసిగి వేసాగి పోయాయి.తెలంగాణా వచ్చింది ఇప్పుడు సూర్యనారాయణ తమ్ముడు టెంట్ కింద బిక్కుబిక్కుమంటూ రాబోయే ఉద్యోగాల కోసం చూస్తుండు. అతని బవిష్యత్ ఉద్యోగ నియామకాల పట్ల ప్రభుత్వ విచక్షణ మీద అధారపడ్డది

గుఱ్ఱం సీతారాములు

9951661001

పరిశోదక విద్యార్ది, ఆంగ్లము మరయు విదేశీ బాషల విశ్వవిద్యాలయం

Advertisements