అతడు ఆకలినీ అవనినీ జయించాడు

Tags

, , , , , ,

అవి అమెరికన్ సమాజంలో బానిసలను బహిరంగ మార్కెట్లో సంతలో పశువులను అమ్ముతున్న దశ, నాడు పెల్లుభుకుతున్న విప్లవ సెగలు, బానిసల తిరుగుబాటు, దొంగలదాడులు ప్రతిదాడులతో అంతర్యుద్ధం తో సతమతం అవుతున్న సంక్షుభిత కాలం లో  అమెరికా న్యూటన్ కౌంటీ సమీప  మిస్సోరీ లో ‘మేరీ’ మరియు  ‘గిల్’ అనే నల్లజాతి బానిస జంటను ‘మోజెస్ కార్వర్’ అనే   జర్మన్ శ్వేత జాతీయుడు సంతలో కొన్నాడు. ఆ జంటకు ఐదుగురు సంతానం. ఒక రోజు ఎక్కడి నుండి వచ్చారో ఒక పెద్ద గుంపు మోజెస్ కార్వర్  ఇంటిమీద దాడి చేసి అక్కడి బానిసలను తోలుకొని పోయారు. ఆ అంతర్యుద్దం లో చిన్నాభిన్నం అయిన ‘మేరీ’ కి  ఐదుగురు సంతానం. భర్త పిల్లలు ఎక్కడున్నారో తెలియదు . కానీ ఒక రెండు వారాల పసిగుడ్డు  మాత్రం యజమాని  దగ్గరే చావు బ్రతుకుల మధ్య మిగిలిపోయాడు. అన్నీ పోయిన ఆ యజమాని చివరి దశలో ఆ పసిబాలుడే తనకు వ్యాపకం అయ్యాడు. వాణ్ని సాకి సంక నేసుకొని తిరిగాడు. నూట అరవై ఏళ్ళ కింద ముచ్చట. బానిస వ్యతిరేక చట్టం అమలు అయినా నల్ల జాతీయుల మీద నిర్భంధం వివక్ష మాత్రం తగ్గలేదు. తనకు సమీపం లో నల్లవాల్లకు మాత్రమే ఉండే బడులు లేవు. అలా ఒక సంచారిలా దేశ దిమ్మరిలా బయటపడిన ఆ బాలుడు. సమీప బడుల్లో ఇళ్ళలో పాచీ పనులు చేస్తూ ఒక లాండ్రీ షాప్ పెట్టుకొని బట్టలు ఉతుకుతూ వివక్షల మధ్య బ్రతుకు యుద్ధం చేసాడు. నాటి అంతర్యుద్దం లో తండ్రి చనిపోయాడు. తల్లి ఎక్కడుందో తెలియదు కాకుంటే తన తల్లిని కొన్న ఆధారం ఒక రసీదు మినహా. ఆ రసీదు సహాయంతో తన మూలాల వెతుకులాట మొదలు పెట్టాడు. రెండు వారాల పసిగుడ్డుగా మిగిలిన ఆ బాలుడు  తన రక్త భందువుల కోసం ఎంత వగచాడో. తన యజమాని సహకారంతో కోల్పోయిన  తన అన్న ‘జార్జ్’ ని తల్లిని ఇద్దరు అక్కలు అన్నలను కలుసు కుంటాడు. అలా మొదలైన తన ప్రయాణం ఒక పేరుమోసిన శాస్త్రవేత్త గా మార్చింది. అతనే ప్రసిద్ద వ్యవసాయ శాస్త్రవేత్త  జార్జ్ వాషింగ్టన్ కార్వర్. పెంచిన యజమాని,తన అన్న పేరు వచ్చేలా యజమాని పెట్టిన పేరు అది. అలబామాలో  టస్క్ గీ విశ్వవిద్యాలయంలో తొలి ఆఫ్రో అమెరికన్ బొటనిస్ట్ గా శాస్త్రవేత్తగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. వ్యసాయ రంగంలో పంట మార్పిడీ పద్ధతి ముఖ్యంగా వేరుసెనగ పంట మీద ఆయన చేసిన పరిశోదనలు విశ్వవ్యాప్తం అయ్యాయి. వేరుశనగ పంటతో నూట ఇరవై ఒక రకాల ఉపయోగాలు ప్రపంచానికి చెప్పిన వాడు. ఇవ్వాళ మనం తింటున్న ప్రతి వేరుశనగ గింజ మీద కార్వర్ పేరు ఉంటాది. ఎందుకు అంటే అది ప్రపంచానికి పరిచయం చేసిన వాడు ఒక బానిస కొడుకు. ఆయన పేరుమీద ఎన్నో విద్య సంస్థలు ఉన్నాయి. సెయింట్ లూయిస్ లోని మిస్సోరి బొటానికల్ గార్డెన్ లో ఆయన విగ్రహం ఇప్పటికీ ఉంది. నాడు అమెరికా బానిస సమాజం అయినా యజమానులు బానిసలకు చదివే ఆలోచించే వెసులు బాటు కల్పించారు. ఒక బానిస కొడుకు ఒబామా అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. మండేలా,మార్టిన్ లూథర్ లాంటివాళ్ళు ప్రపంచ స్వాభిమాన ఉద్యమాలకు దిక్సూచిలా మారారు.

ఒక నల్లజాతి బానిస అనుభవించిన వివక్ష అన్ని వివక్షల కన్నా కస్టమయినది అని చెప్పవచ్చు.  ప్రపంచం లో ఏ రెండు సుఖ పడ్డ,కష్ట పడ్డ సంసారాలూ ఒకే రకంగా ఉండవు అన్నాడు టాల్ స్టాయ్ . కానీ ఆఫ్రో అమెరికన్  బానిస వ్వాషింగ్టన్ కార్వర్ లా గెలుపు పోరులో బట్టలు ఉతికిన చేతులే చరిత్రను తిరగ రాస్తాయని ఒక తెలంగాణ బహుజనుడు నిరూపించాడు కాకుంటే లోకానికి తెలియదు అతనే మామిడాల రాములు.  యాదృచ్ఛికం కాదు ఈ ఇద్దరు ప్రపంచ విజేతలూ ఒకరు జాతి మరొకరు కుల వివక్షను ఎదుర్కొన్న వారే. ఏ గడ్డమీద వలస బానిసగా పుట్టి పెరిగి గెలిచి ఒడాడో. అదే గడ్డమీద ప్రవాసిగా ఒక తెలంగాణ బహుజనుడు నిలబడడం చారిత్రకం. కార్వర్ సాదించిన విజయాలు అందునా ఒక ఆనాద బానిస ప్రస్తానం ఎక్కడ ముగిసిందో అక్కడే తెలంగాణ పెత్తందారీ తనానికీ పీడనకూ ఆకలి అవమానాల  మధ్య నలిగిన మరొక తెలంగాణ కార్వర్ బయలుదేరాడు అతనే మామిడాల రాములు అలియాస్ అమెరికా రాములు.

వరంగల్ జిల్లా తరిగొప్పుల గ్రామం లో పందొమ్మిదివందల యాభై వ దశకం లో పుట్టిన ఆయన అత్యంత దుర్భర స్థితుల మధ్య పెరిగాడు. తెలంగాణ లో తరిగొప్పుల పరిసర గ్రామాలు సాయుధ పోరాట క్షేత్రాలు.  బైరాన్ పల్లి రుధిర క్షేత్రానికి కూతవేటు దూరంలో నాటి వరంగల్ జిల్లా తరిగొప్పుల గ్రామంలో మామిడాల సోమయ్య జీవితాన్ని దొరల గడీలలో వెట్టి బ్రతుకులు, పొద్దస్తమానం ఊరి చెరువులో సౌడుతో బట్టలు ఉతికి ఇంటికి ఒక ముద్ద వేస్తే తనువు గడిచి పోతున్న బ్రతుకుల్లోకి మామిడాల రాములు అనే ప్రపంచ పేరుగాంచిన మెకానికల్ ఇంజనీర్ పురుడు పోసుకున్నాడు. ఇంటికి ఇంత అన్నం అడిగి తెచ్చుకున్న చేతులే ప్రపంచంలో ఒక మెకానికల్ ఇంజనీర్ అందుకోవాల్సిన అన్ని అవార్డులూ రివార్డులూ ప్రపంచ పేరుమోసిన అన్ని విశ్వవిధ్యాల యాలలో మేధో చర్చలు అమెరికా అధ్యక్షుడి నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకునేలా చేసిన  ఒక విజేత కథ ఇది.

పందొమ్మిది వందల యాభయ్యో దశకంలో మొదలైన ఆయన ప్రస్తానం తరిగొప్పుల, బచ్చన్నపేట నర్మెట్ట, జనగామ ప్రభుత్వసాంఘీక సంక్షేమ పాఠశాల వసతుల లేమి మధ్య గడిచిన బాల్యం ఒక వైపు. ఊరిలో దొరల ఆగడాలు మరో వైపు ‘నీ కెందుకురా చదువు నాలుగు గుడ్డలు ఉతికి బ్రతికేదానికి’ అనే ఈసడింపుల మధ్య పారాడిన బాల్యం ఆయనది. అటేడు ఇటేడు తరాలలో మొదట అక్షరం ముక్క నేర్చుక్కున్న మామిడాల రాములు. తండ్రి సోమయ్య పరమ శివ భక్తుడు, చిన్న నిట్టాడి ఒక్క మంచం కూడా పట్టని ఇంట్లో పెద్ద పాముల పుట్ట అటువంటి  అంద విస్వాశాల మధ్య పెరిగిన బాల్యం రాములుది. ఏనాడూ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేసేది కాదు. నిస్సారమైన బాల్యం,అగమ్యం అయిన దారి చుట్టూ కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం. అరవైలలో తెలంగాణ రూమీ టోపీ గాంధీ టోపీ గా మారినా ప్రజల బ్రతుకుల్లో నిప్పులు మాత్రమే మిగిలాయి.బోయింగ్ లాంటి ఒక యుద్ద విమాన నిపుడు పురుడు పోసుకోవడం అంత తెలికాగా జరగలేదు.

మిత్రుల చందాలతో చదువు ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలదాకా సాగింది. ఆయన ఉస్మానియా ఇంజనీరినగ్ కళాశాలలో చేరేనాటికి  జంపాల చంద్ర శేఖర ప్రసాద  సహచర్యం, తనలో ఏమూలనో దాగిన కవితా స్ఫూర్తి రగిలేలా చేసింది. జార్జ్ రెడ్డి అమరత్వం నెత్తుడి తడి ఆరలేదు, ఆయన మీద రాములు  రాసిన స్మృతి కవితకు శ్రీ శ్రీ ప్రశంస. సమకాలీన అంశాల మీద తన అసంతృప్తిని తన కవిత్వం ద్వారా వ్యాసాల ద్వారా తనలో రగిలిన కవిని మేల్కొలిపాడు.అమరుడు తారకం ముందు మాటతో ‘నిజామాబాద్ సాహితీ మిత్రుల’ పక్షాన ‘కాలం కదలికలతో’ అనే పుస్తకం లో చిత్రిక పట్టాడు . మరో వైపు తొలి దశ తెలంగాణ ఉద్యమ కల్లోల కాలం లోనే ఇంజినీరింగ్ చదువు . నిజానికి ఆయనని కదిలిస్తే తెలంగాణ కల్లోలాలు మరింతగా బయటకు వస్తాయి. ఐ.ఐ.టి డిల్లీ లో విద్య ముగించి ఉన్నత విద్య కోసం అమెరికా లో ప్రసిద్ద వాషింగ్టన్ యూనివర్సిటీలో పరిశోధన, ఒక బానిస కార్వర్ తిరుగాడిన నేలలోనే  తెలంగాణ ఆకలి, కరువు, పెత్తందారీ తనాల మధ్య చిద్రమైన వ్యక్తిత్వం మారు మొగ్గ వేస్తోంది. కేవలం పదిరూపాయల ఫీజు కోసం వెతుకుడిన బాల్యం దేశ విదేశాల లో పొందని పురస్కారాలు లేవు అంటే అతిశయోక్తి మాత్రం కాదు. తెలంగాణ తొలిదశ ఉద్యమం ఊపందుకున్న కల్లోల దశలో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీర్ గా పురాణా హవేలీ దారుల్ షఫా హాస్టల్లో బ్రతుకు పోరాటం చేసాడు. నల్లులు, ఆకలి, అవమానాలు, తెలంగాణ  స్వాభిమాన పోరాటాల మధ్య కాసింత కవిత్వం మరికాస్త కసి కలగలిపిన బ్రతుకు. ఆకలి అవమానాలను జయించిన వాడు ఆయన. కాలికి చెప్పుల కోసమూ వెతుకులాడిన తాను నర నరాన సంఘీక సంక్షేమ హాస్టల్ వితరణతో మాత్రమె చదువుకున్నా అని సగర్వంగా అంటాడు రాములు సర్. ఆకలి అవమానాలు దగ్గరకు వచ్చినా అపజయాన్ని మాత్రం ఎడమకాలితో తన్నాడు. తాను పుట్టి పెరిగిన నేల అసమ విలువలు ఆయనను ఎంతగానో కదిలించాయి. వీటి వెనక ఉన్న సోషల్ ఇంజనీరింగ్ లో లోపాలు ముందే పసిగట్టాడు. ఈ సమాజ అసమవిలువల ద్వంశం కేవలం చదువు మాత్రమే మారుస్తాది అని నమ్మాడు. ఈ పనికి తనను ఎవరూ పురికొల్పలేదు అనీ ఏ సిద్దాంత రాద్దాంతాలూ తనను మార్చలేదు అని వినమ్రంగా అన్నా తన బ్రతుకు నావ నిరంతరం అన్వేషణ లోనే గడిచింది అనీ  తాను నడిచి వచ్చిన  దారిలో మానవీయంగా ఆదుకున్న చేతులను మాత్రం మరవలేను  అంటాడు.

నాటి ఢిల్లీ ఐ.ఐ.టి. లో కేవలం పది సీట్లు మాత్రమె ఉండేవి, అందులో మెరిట్ లో మూడో స్థానం లో నిలిచి తన ప్రస్థానాన్ని దేశ రాజధానికి మార్చాడు. దేశం ఎమెర్జెన్సీ చీకటిలోకి వెళ్ళిన దశలో మాస్టర్స్ పూర్తి చేయనీకి రాజధానికి ఒక వైపు, మరోవైపు  తన సహచరులు  ప్రత్యామ్నాయ ఆలోచనలో కుటుంబాలను జీవితాలను ప్రయోగశాలగా మార్చుకుంటున్న దశలో తన చదువు లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. అక్కడే పరిశోధనలో ఉండగానే అమెరికాలో పరిశోధన కోసం ప్రభుత్వ మెరిట్ స్కాలర్ షిప్ మీద ఆకలి అవమానాలు మోసుకొని అమెరికా ప్రయాణం అయ్యాడు. ఆలబెర్ట్ సి కోవయాస్కి అనే పేరుమోసిన విద్యావేత్త  పర్యవేక్షణలో వాషింగ్టన్ యూనివర్సిటీ సియాటిల్ లో ‘డైనమిక్ క్రాక్ కర్వింగ్, క్రాక్ బ్రాంచింగ్’ లో పరిశోధన చేసాడు. ఎనభయ్యో దశక ప్రారంభ దినాలలో కోటి ఆశలతో బ్రతుకు దెరువు కోసం కన్న ఊరికి ప్రయాణం, సన్నగిల్లిన కొలువు ప్రయత్నాలు. అయినా చీకట్లో పారేసుకొని వెలుగుని వెలుతుర్లో వెతుక్కోవడం అవివేకం అనిభావించి మళ్ళీ అమెరికా తిరుగు ప్రయాణం అయ్యాడు.

శాస్త్ర సాంకేతిక రంగాలలో మానవీయ శాస్త్ర పరిశోధనలో ఐరోపా అమెరికా సమాజాలకూ మూడో ప్రపంచ దేశాలకూ పూడ్చ లేనంత అఘాతం ఉంది.అది మన దగ్గర ఊరుకూ వాడకూ మధ్య ఉన్న సాంస్కృతిక దాష్టీకం అంత. అమెరికాలో ఉన్నత విద్య ముగించాక రాములు నిజాయితీగా తాను పుట్టిన ప్రాంతం లో కొలువు కోసం ప్రయత్నం చేసినవాడే. ఏ అవరోధాలు ఆయనను ఇక్కడ ఇమిడేలా చేయలేదో అనే చర్చకన్నా ఆయన తాను పరాయి దేశంలో ప్రపంచ విజేత కాగలిగాడు అనేది జగమెరిగిన సత్యం. తాను చేసిన  పరిశోధనలు సాదించిన విజయాలు ఒక్కొక్కటిగా రాస్తే ఒక గ్రంధమే అవుతాది. స్వతహాగా రెండు గ్రాడ్యుయేట్ మరియు  కంపోసిట్ మెటిరియల్స్ డిప్లమా కోర్సులను అందిస్తూ, వైమానిక నిపుణుడుగా ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఆయన దాదాపు ఇదు వందలకు పైగా అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రాలు రెండు వందలకు పైగా గ్రాడ్యుఏట్ విద్యార్ధులకు మార్గ నిర్దేశకత్వం చేయడం అరుదయిన విషయం .

ప్రపంచాన్ని శాసించిన  యూరో సెంట్రిక్ ఆలోచన చట్రంలోకి దక్షిణ ఆసియా దేశాల నుండి కనీస ప్రాతినిధ్యం కూడా లేదు. ఒక రకంగా గణితం లో రామానుజన్, ఇంజనీరింగ్ లో ఒక్క మామిడాల రాములు మాత్రమె కనిపిస్తున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షం యూనివర్సిటీ అఫ్ వాషింగ్టన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈనాటికీ అప్రతిహతంగా కొనసాగుతున్న ఆయన పరంపర.

అమెరికా వెస్ట్ కోస్ట్ లో అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాలలో యూనివర్సిటీ అఫ్ వాషింగ్టన్ ఒకటి. అటువంటి విశ్వవిద్యాలయం లో చేరిన ఆరేల్లకే ‘ప్రెసిడెసియల్ యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డుతో బాటు, అక్కడ పనిచేస్తున్న అత్యుత్తమ అధ్యాపకులలో ఒకడిగా గుర్తింపు పొందాడు , మొత్తం విశ్వవిద్యాలయం లోనే అత్యంత ప్రభావవంతమైన అధ్యాపకుడిగా,వందలాది పురస్కారాలు, వేలాది సెమినార్లు, అసంఖ్యాకంగా ఆయన పరిశోధనా అంశాలు ప్రాసంగికత నిలబెట్టుకోవడం ఆయన సాదించిన విజయాలలో ఒకటి. ఒక రకంగా అమెరికన్ సమాజంలో ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఒకట్రెండ్ సెట్టర్ గా మిగిలిన అధ్యాపకుడి శ్రమ మనం అనుకున్నంత తేలికగా లభించలేదు. ప్రపంచంలో అనేక పేరుమోసిన విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ఫెలో గా, అనేక దేశాల శాస్త్ర సాంకేతిక సలహాదారునిగా ముఖ్యంగా ప్రతిష్టాత్మక  బోయింగ్ పెన్నేల్ ఆచార్యుడుగాఈ నాటికీ పనిచేయడం అరుదైనది. ఎయిర్ క్రాఫ్ట్ విమాన నమూనా లో ఆరితేరిన ఆయన ఆరేడు ప్రఖ్యాత జర్నల్స్ వ్యవస్థాపకుడిగా, అమెరికన్ సొసైటీ అఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఫెలోగా, మెకనికల్ ఇంజనీరింగ్ విభాగం జీవన సాఫల్య పురస్కారం తో బాటు  ప్రపంచ వ్యాప్తంగా ఆయన చేసిన పరిశోధనల ప్రాసంగికత ఇప్పటికీ నిలబెట్టుకోవడం అరుదయినది. దాదాపు మూడున్నర  దశాబ్దాల సుదీర్గ అధ్యాపక వ్యాపకం లో ఆయన పొందని పురస్కారం లేదంటే నమ్మరు.

వెనక బడిన కులాలు, ప్రాంతాల వాళ్ళకు  చదువు రాదనీ, సంస్కృతి తెలియదనీ చేసిన వెక్కిరింతలను తన విద్వత్ తో సాధించిన విజయాలతో  నోరు మూయించాడు. సౌడుతో మురికి బట్టలు ఉతికిన చేతులు విమానాలు తయారు చేయగలదని నిరూపించాడు. తన సుధీర్గ అధ్యాపక వ్యాపకం లో వేలాది అంతర్జాతీయ సదస్సులలో తన వివేకం తో వందలాది పరిశోధనా విద్యార్ధులకు మార్గదర్శకత్వం. ప్రపంచం వ్యాప్తంగా  వందలాది విద్యార్దులకు తమ పరిశోధనలో భాగం అయ్యాడు.

‘మానవీయ,శాస్త్ర సాంకేతిక శాస్త్రాలలో  ప్రపంచ వ్యాప్తంగా శూద్ర స్వీయ అనుభవవాదం ఆధిపత్య అగ్రవర్ణ తత్వ అన్వయింపు’ అనే వైరుధ్యం ఉంది. ఇంతకాలం క్షేత్ర స్థాయిలో స్వీయ అనుభవ వాదంతో అపారమైన జ్ఞాన చింతన కలిగినా అంతిమంగా అది ఆదిపత్య కులాలకూ శక్తులకూ  వనరుగా మారింది ఇదో విషాదం. ఇది దాదాపు రెండు వందల ఏళ్ళుగా క్షేత్ర స్థాయిలో వివిధ విశ్వవిధ్యాలయాల లో  పునరావృతం అవుతూనే ఉంది. కానీ మామిడాల రాములు స్వీయ అనుభవంతో చేసిన అన్వయింపు ఫలాలు ఆయనకూ ప్రపంచానికీ ఉపయోగాపడ్డాయి. బహుశా మామిడాల ఇక్కడే ఉండి ఉంటె ఒక సాధరణ మెకానికల్ ఇంజనీర్ గా కాసిన్ని పైసలు సంపాదించే వాడు. పదవీ విరమణ కూడా పొందేవాడు. కానే ఆయన ఎన్నుకున్న కార్యక్షేత్రం తన దైన ముద్రను నిలిచేలా చేసింది.

తరాలుగా తన తాతలు తండ్రులు ఊరి మలినాన్ని చేతులతో ఎత్తి, గోడలకు సున్నాలు కొట్టి, భుజాల మీద దొరల పెళ్లిళ్ల మేనా మోసి, కవుసు పట్టిన గుడ్డలు ఉతికి, నాగరికతకు సబ్బును కనిపెట్టిన సామాజిక శాస్త్రవేత్తల వారసత్వం ఆయనది.  ఊరికీ వాడకూ సంధాన కర్తవ్యం చేసిన బ్రతుకు వ్యధ ఇదొక పల్లెటూరి పసుల గాసే పోరడి కథ, ఇది ఒక తెలంగాణ జ్ఞానసంచారి అసామాన్యమైన ప్రయాణం, అసలు ఒక మనిషి ఇన్ని పనులు సాధ్యమేనా ? బహుశా రాములు గారిని ఏదో తరిమి ఉంటాది. నీ జీవితానికి మిగిలింది ఈ ఒక్క రోజే నీకు ఇష్టమైన పనిచేసి చనిపో అని ఎవరన్నా ఆదేశిస్తే ఆ ఒక్క రోజు చేసే పనిని ఒక లెక్కగా తీసుకుంటే తన జీవితం లో ప్రతిరోజూ ఇదే చివరి రోజు అని మేధో శ్రమకే అంకితం అయిన ఒక అసమాన యాత్రికుని ప్రయాణం. వ్యవస్థీ కృతమైన అసమ విలువలతో యుద్ధం చేసిన ఒక సామాన్య సామాజిక శాస్త్రవేత్త గెలుపు వెనక కన్నీటికథ. ఆయన మార్స్ అంత ఎత్తులో ఉన్నా ఎట్టి గాయాలనూ మట్టి వాసనలనూ మరవని అరుదయిన మనిషి. ఆకలినీ, అవనినీ, అవమానాలనూ  తన ప్రతిభతో జయించాడు. జాతిరత్నం గా మిగిలిన ఆయనను గుర్తించని ఈ దేశ దౌర్భాగ్యానికి సిగ్గుపడుతూ ఇది కొన్ని తరాలు యాది చేసుకోవాల్సిన సందర్భం.

(ఇటీవల హైదరాబాద్  సెమినార్ లో ఆయన చేసిన ప్రసంగం సందర్భంగా)

డా.గుర్రం సీతారాములు

9951661001

అడవిలో కురిసిన రంగుల వాన : ## కాళ్ళ సత్యనారాయణ

కాళ్ళ అని ఇష్టంగా పిలుచుకునే కాళ్ళ సత్యనారాయణ గారు నాకు డా.హరీష్ ద్వారా పరిచయం. ఖమ్మం పాత సిపిఎం ఆఫీస్ పక్కనే ఉన్న ఒక చిన్న షాప్ లో ఆయన స్టూడియో. అంటే ఏదో హంగులు పొంగులతో ఉంటాది అనే బ్రమలు వద్దు. ఒక్కటే గది అందులో చిన్న స్క్రీన్ ప్రింటింగ్ మిషన్, ఒక చిన్న టేబుల్, కుర్చీ నిరంతరం రంగుల మాయాజాలం లో కాళ్ళ. వంటి మీద ఏమాత్రం శ్రద్ద ఉండదు . చింపిరి గడ్డం,అపసవ్యంగా ఉండే జుట్టు.అన్యమనస్కంగా కాళ్ళ. మొదటి సారి చూసినప్పుడు కాళ్ళ ఒక పట్టాన అర్ధం కాడు. కాస్త దగ్గర అయితే ఆ ప్రేమ లోతు కొలవడానికి యంత్రాలు సరిపోవు. మనిషి నలుపు కానీ మనసు రంగుల సింగిడి. నిత్యం ఆయన రంగులతో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.ఆయన బొమ్మలు నున్నగా, కళ్ళకు హృద్యంగా ఉండవు. పెచ్చులు ఊడిన గోడల మీద ఆదిమానవుడు చెక్కిన పురా జ్ఞాపకాలలా ఉంటాయి. నేను చూసిన చానా బొమ్మల్లో బ్రైట్ గా నైరూప్య చిత్రాలు. ఆయన మాటల్లో క్లుప్తత, సూటి తనం, తక్కువ మాట్లాడడం. విస్తారమైన అధ్యయనం. సాహిత్య, సాంస్కృతిక, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల మీద సునిశితమైన ద్రుష్టి. ఇతిమిద్దంగా ఆయన రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కావు. ఆ పాడు బడ్డ లోగిలి ముందు తచ్చాడే కవులు, కళాకారుల, మేధావుల లిస్టు చూస్తే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు.
శివసాగర్ కవిత్వం సంకలనం సేకరణ ప్రచురణ క్రమం లో పుస్తకానికి ఆయన మూడు బొమ్మలు గీసాడు. ఒకటి నరుడో భాస్కరుడా కవితలో ఒక మొరటు మనిషి లాఘవంగా గురి చూసి విసిరే గండ్ర గొడ్డలి, మరొకటి రక్త నది అందులో మొలిచిన ఎగిరే పావురాలు,శివసాగర్ యాభై ఏళ్ళ కవితా ప్రస్తానం ఒక బొమ్మలో ఇమిడి పోయింది. మొత్తానికి మూడు నాలుగు నెలలు పట్టింది కవర్ పేజీ పూర్తి అవడానికి. పుస్తకం వచ్చాక కాళ్ళ కు నేను బాగా దగ్గర అయ్యా. ఆ స్నేహం ఐదారు ఏళ్ళు గడిచింది. పరిశోధన కోసం నేను ఇఫ్లూ కి మారాక ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. మా అయ్య కాలం చేసినప్పుడు ఇంటికి వచ్చాడు. ఒకరి రెండు సార్లు ఇఫ్లూ కి వచ్చాడు. మధ్యలో తన కొడుకు పెళ్ళికి వెళ్ళా. ఇఫ్లూ లో సతీష్ పోడ్వాల్, మధుమిత కలిస్తే కాళ్ళ శ్రీనివాసప్రసాద్, హిందూ సురేంద్ర గారు ముచ్చట్లు.
ఎక్కడో విజయనగరం లో పుట్టిన కాళ్ళకు మా ఖమ్మానికి ఏమిటి సంబంధం? ఖాదర్ మొహియుద్దీన్ వాళ్ళ పెద్దన్న రహమాన్ గారు ఖమ్మం లో ఉండేవాడు. ఆయన,కౌముది, హరీష్ గారు ముగ్గురూ కలిసి “సరిత” అనే సాహిత్య పత్రిక తీసుకొని రావాలి అనుకొనే సమయంలో ఒక ఆర్టిస్ట్ కోసం వెతికే క్రమం లో ఖాదర్ అన్న నాటికి విజయవాడ లో ఉంటున్న కాళ్ళను ఖమ్మం వైపు నడిపాడు. మొదట్లో రెహమాన్, కౌముది గారు హరీష్ సహచరి మాధురి గారి పేరుమీద ఒక ‘మాధురి ప్రెస్’ నడిపారు అని విన్నా. కొంత కాలం నడిచిన ఆ ప్రెస్ మూత పడ్డాది. ఆ పత్రిక మొదలు కాలేదు, ఖమ్మం వచ్చిన కాళ్ళ మళ్ళీ వెనక్కు పోలేదు.
1948 April 10న ఉత్తరాంధ్ర విజయనగరం లో పైడమ్మ, సన్యాసి కడుపున పుట్టిన కాళ్ళ, కుటుంబం బ్రతుకు దేరువులో బాగంగా మొదట ఏలూరు ఆ తర్వాత బెజవాడ అంతిమంగా ఖమ్మం దిశగా సాగింది.ఆయనది ఒక్క మజిలీ కాదు. ఆయన స్నేహాలో రాజకీయాలో వ్రుత్తి ప్రవ్రుత్తి వ్యాపకాలో ఆయనను ఒక్క దగ్గర ఉండేలా చేయలేదు. అంతిమంగా ఆయన ప్రయాణం ఖమ్మం లోనే ముగిసి పోయింది. 40 ఏండ్ల క్రితం రంగుల కుంచెను బుజాన వేసుకుని ఖమ్మం చేరుకున్న ఆయన బాల్య యవ్వనాలు ఉమ్మడి కమ్యూనిస్ట్ ఆచరణలో సాగాయి. పార్టీ విడిపోయాక ఆయన ఏ నిర్మాణాలలోనూ ఇమడక పోయినా ఆయన గీసిన బొమ్మలు నిర్మాణాల కన్నా ఎక్కువనే పనిచేశాయి. డెబ్బై ఏళ్ళ జీవితం లో బ్రతుకు కోసం అగ్గిపెట్ట లాంటి ఆయన స్టూడియో లో పెళ్లి,వి జిటింగ్ కార్డులు ముద్రించాడు. ఎవరయినా అడిగితే లోగో లు ఇచ్చేవాడు. తనకు కనీసం బువ్వ పెట్టని రంగుల లోకం లో విహరించాడు. ఎవరన్నా ఆయనను చూస్తే అన్నం మానేసి కనీసం ఏళ్ళు అయినా అయి ఉండొచ్చు అనే భావన కలగొచ్చు. ఎంత నవ్వినా తొనకడు బెనకడు.
గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఆయన ఎక్కడ ఉన్నాడో ఎలా బ్రతికాడో తెలియదు. ఖమ్మం శివారు పాండురంగాపురం పొలాల మధ్య ఒంటరిచుక్కలాగా ఆయన ఇల్లు. చుట్టూ ప్రహరీ లేదు పంట పోలాలకి ఆసరాగా పాడిన కంప చెట్లే ఆయననూ పొలాలనూ కాపాడాయి. ఆయన సహచరి కోటమ్మ ఇద్దరికీ కలిపి నలుగురు అమ్మాయిలు, ముగ్గురు కొడుకులు శ్రీను, రాజు ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నారు. ఇటీవలే మరణించిన కోటమ్మ గారు. అందులో చిన్న పాటి కొలువులు యేవో చేసుకుంటున్నారు.
కాళ్ళ గుర్తుకు వస్తే నాకు ప్రపంచ ప్రఖ్యాత స్పానిష్ చిత్రకారుడు ‘ఫ్రాన్సిస్ కో గోయ’ యాదికి వస్తాడు. ప్రపంచ చిత్రకారుల్లో ఆయన చిట్ట చివరి ప్రాచీనుడు మొట్ట మొదటి ఆధునికుడు. పద్దెనిమిదో శతాబ్ద మధ్య బాగం పందొమ్మిదో శతాబ్ద ప్రధమార్ధం అంటే ప్రాచీన ఆధునిక సంధి దశలో లో పుట్టిన ఆయన శైలి నేను కాళ్ళ బొమ్మల్లో చూసా. ఆయన కూడా చిట్ట చివరి సనాతనులా తొట్ట తొలి ఆధునికుడిగా రంగులతో ప్రయోగాలు చేసాడా అనిపించింది. ఎందుకో ఆయన బొమ్మలు సవ్యంగా ఉండవు. గోయ బ్రతుకు ‘రాజాస్థానాల’లో గడిచింది. కాళ్ళ బ్రతుకు ప్రజల కష్టాల కన్నీళ్ళ మధ్య గడిచింది. డా.హరీష్ గారు అన్నట్టు “కాళ్ళ ఒక గీత, శ్రుతి అపశ్రుతుల సంగీతం, మనిషి మాత్రం పిట్టంత, అతని నీడ చెట్టంత, అతను నల్లగా, మెత్తగా, నిజాయితీగా, పచ్చిగా, మనిషి వాసన కొట్టే నీడ” అన్నాడు.ఈ ప్రపంచానికి కాళ్ళ మీద హరీష్ గారికి మాత్రమె సాధికారత ఉంది. ఇప్పుడు ఆయన చరిత్ర, నిబద్దత,బొమ్మల తాత్విక లోతు చెప్పడానికి హరీష్ లేడు వినడానికి కాళ్ళ లేడు.
ఆయన గీతల్లో వికారమైన తలలేని మొండాలు, సాగిన చేతి వెళ్ళు,మనల్ని వెంటాడే నీడలు, చుట్టూ ఆవరించి ఉన్న సమస్త వైకల్యాలు, స్త్రీల వేదనలు, డంకేల్ దుర్మార్గాలు, లాతూర్ విషాదాలు, కాస్ట్రో, అలెండీ వీరోచిత గాధలూ, చిద్రమైన అద్దాలు, గడ్డ కట్టిన కన్నీళ్లు, ఏకాంత మృత్యువు, తెగిన దారాలు, మాతృ బంగం, దూది పింజలు ఆయన కాన్వాస్ మీద యుద్ధం చేస్తాయి. కాళ్ళ బొమ్మలు ఏ ఒక్క అంశాన్నో తడమలేదు, గడిచిన ఐదు దశాబ్దాల సాహిత్యాన్ని పలవరించి కలవరించిన అలసట లేని ప్రయాణం ఆయనది. ఆయన కుంచెకు శాశ్వత విరామం దొరికినా మనల్ని వెంటాడే వెన్నాడె బొమ్మలు ఎన్నో ఈ వ్యవస్థ మీద సందించి వెళ్ళాడు. అవి కేవలం బొమ్మలు మాత్రమె కాదు. నాగరిక జీవనం మీద మొలిచిన గాయపు మరకలు.
పుట్టింది ఉత్తరాంధ్ర, పెరిగింది ఏలూరు బెజవాడ అయినా ఆయన బ్రతుకంతా తెలంగాణ గడ్డమీదనే గడిచింది. ఆయనను ఏమి నడిపించిందో ఎందుకు నడిపించిందో గానీ ఖమ్మం ఆయనను కడుపులో పెట్టుకొని సాకింది. ఖమ్మం అంటే ముఖ్యంగా డా.హరీష్ గారు ఆయన వెనక ఉన్న చోదక శక్తి. ఆయన చోదక శక్తి కనుక హరీష్ ఏమి చెబితే అది చేసే మనిషి కాదు. నిత్యం పనుల మధ్య సతమతం అయ్యే డాక్టర్ గారు అలా కాళ్ళ స్టూడియో కి వచ్చి ఒక కాఫీ తాగి కాళ్ళ బొమ్మలో ఒక సారి తల దూర్చి ఇద్దరూ రంగుల విన్యాసాల మీద కుస్తీ పట్టేవారు. అలా సినిమాలు,రంగులు, బొమ్మలు, పుస్తకాలు, డంకేల్, దండకారణ్యం, గోద్రా మీదుగా నడిచి మళ్ళీ ఇంకో కాఫీలోకి మారేవారు. డాక్టర్ గారు వచ్చారు కనుక వొద్దిక గా చేతులు కట్టుకుని నిల్చునే మనిషి కాడు ఆయన బొమ్మల లోకం లో ఆయన ఉండేవాడు. నాలాంటి పిపీలకాల కు వాళ్ళ రంగుల లోకం అర్ధం అయ్యి చచ్చేది కాదు.నాకు ఇప్పటికీ కాళ్ళ బొమ్మ అర్ధం అయి చావదు. ఇదేంటి కాళ్ళ అంటే అలా అంటే ఏం చెప్పాలి బాబూ అనేవాడు. అర్ధం చేసుకుంటే శక్తి ఉంటె ఆయన బొమ్మల్లో ఆదిమ కాలాన గుహలలో బ్రతికిన యాది గుర్తులు చూడొచ్చు. క్రూరజంతువులు దాడి చేసినప్పుడు గోడలమీద చిందిన రక్తపు చారికలూ చూడొచ్చు. మధ్య యుగాల నుండి ఆధునిక యాంత్రిక లోకం దాకా మనిషి నడిచొచ్చిన సమస్త నాగరిక గుర్తులూ ఆయన గీతల్లో చూడొచ్చు. అబాగ్యుని ఆకలి కేకలు, ఆకలి గొన్న పశువులా అబలమీద దాడి చేస్తే ఆ కళ్ళల్లో ఒలికే భయాన్నీ చూడొచ్చు. ఎగిరే ఎర్రజెండాలో అమరుని విస్వాశాన్ని చూడొచ్చు. ఒక దారం సుడి తిరిగి తనను తాను ఉరేసుకునే కార్మికుని సంక్షుభిత ముగింపు చూడొచ్చు. పెత్తందారీ పెద్దన్న ఒంటి కన్ను రాక్షసుడిగా ఈ సమాజాన్ని కబళించే డాలర్ విక్రుతాన్ని చూడొచ్చు. శిలువ మోస్తున్న రైతన్న వ్యధను, గ్రహం స్టెయిన్ చెదిరిన చెదిరిన కలనూ, పిండాలకు గుచ్చిన త్రిశూలాలు, తెగిన తలలూ, విరిగిన విగ్రహాలూ, తొంబయ్యో దశకం లో ఆధునిక కవితా చోదక శక్తులు అయిన రక్తస్పర్శ కవుల ద్వేషం లో, బ్రతికిన క్షణాల వలపోతల్లో, పునరపి లో, నరుడో భాస్కరుడు విసిరిన గండ్రగొడ్డలి ఒడుపులో, గులాంగిరి అట్టమీద దైన్యంగా కూర్చున్న శ్రామికుడి నుదిటి స్వేదంలో, కాల కూట విషంలా మానవత్వం మీద దాడిచేసిన గోద్రా గుజరాత్ గాయపు కన్నీటి చారికల్లో,దళిత రాజకీయాల్లో,భామ కరుకు,సంగతి లో, కేశవరెడ్డి నవలల అట్ట మీద బొమ్మల్లో, ఒకటా రెండా వేలాది బొమ్మల్లో ఆయన మార్క్ గీత అర్ధం కావాలి అంటే ముందు కాస్త రంగు అర్ధం కావాల. వర్తమాన వాద వివాదాల లోతు తేలియాల,ముఖ్యంగా రవివర్మ బొమ్మల్లో సుకుమారం, ఆహ్లాదం వెతికే బాపతు గాళ్ళకు కాళ్ళ బొమ్మలు నప్పవు. ఆరించుల కంప్యూటర్ మీద టెక్నాలజీ చేసే విన్యాసపు తంత్రీ వెలుగులకు అలవాటు పడ్డ వాళ్ళకు కూడా కాళ్ళ బొమ్మలు అర్ధం కావు. అవి అర్ధం కావాలి అంటే పాలరాతి గదులు తూడ్చి శుచి శుభ్రాన్ని ప్రసాదించిన కూలి తల్లి చేతికి అంటిన మరక తెలియాలి, అరచేతిలో అరిగిపోయి అదృశ్యం అయిన గీతల ఆనవాళ్ళు తెలియాలి. అగొ అప్పుడు కాళ్ళ సత్యనారాయణ సాక్షాత్కారం నీకు లభించుద్ది.
ఖమ్మం మేడినోవా డా హరీష్ గారి ఛాంబర్ లో గోడమీద పెద్ద మ్యూరల్ పెయింటింగ్ చూడొచ్చు. దానిపేరు కాలం. స్థల కాలాల మధ్య మనిషి ప్రస్తానం వలయాలు వలయాలుగా నైరూప్య కుడ్య చిత్రం అది. ఆయన వేసిన బొమ్మల్లో బాగా పేరు సంపాదించు కున్నది. ఉండడానికి ఎక్కడో మారుమూల డంజన్ లో ఉన్నా ఆయన ద్రుష్టి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చిత్రకళ లో వచ్చిన ధోరణులు,కళలు సాహిత్య గమనాలు, ఆధునిక ఆత్యాదునిక ధోరణులు, సాల్విడార్ డాలీ, ఇంకా నాకు నోరు తిరగని ప్రాచ్యాత్య చిత్రకారుల నడవడికతో పోటీ పడతాడు కాళ్ళ. తెలుగు సమాజాన ఆకలితో, అవమానాలతో బ్రతికే బడుగు జీవుల ఆర్తనాదాలు, పికాసో గుయర్నికా విద్వంసాన్ని నేను మొదటి సారి కాళ్ళ బొమ్మల్లోనే దర్శించాను. గోయా, పికాసో బొమ్మల్లో బీభత్సాన్ని తెలుగునాట వర్తమాన కన్నీళ్లు ఆయన కాన్వాసును తడిపాయి.ఆయనకు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత చేయూత ఇచ్చినా జీవితాంతం లేమిలోనే బ్రతికాడు.
ఆయన ఎప్పుడూ శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథల గురించి ఎక్కువగా చెప్పేవాడు.పతంజలి,చలం, ప్రేమ్ చంద్, కో.కు అన్నా ప్రేమ. బొమ్మలూ, సినిమాలూ,సాహిత్యం ఆయనకు ఇష్టమైన వ్యాపకం.మొత్తం పుస్తకం చదివితే తప్ప బొమ్మ వేసేవాడు కాదు. తొందర పెడితే అసలే వేయడు.ఆయన బొమ్మలను నేను అమ్ముకోను అవి నా బిడ్డలు అనేవాడు. ఒక సారి కాళ్ళ గురించి తెలిసిన నాటి ఖమ్మం కలెక్టర్ అరవింద కుమార్ ఆఫీసు ల్లో బొమ్మలు వేయండి కాసిన్ని డబ్బులు ఇస్తాం అంటే “ఆ పనికి చానా మంది ఉన్నారు నేను చేయను అని సున్నితం గా తిరస్కరించాడు.ఈ బొమ్మలు బువ్వ పెట్టకుంటే నా రిక్షా నాకు ఉంది అనే తెగింపు. ఆయన ఆకలిని ఎక్కువగా ప్రేమించి ఉంటాడు.ఆయన కన్నీళ్ళు,పేగులు ఎప్పుడో ఎండిపోయి ఉండొచ్చు. ఆయన సహచరి కోటమ్మ గారు, ఇష్ట సఖి డా. హరీష్ గారు పోయాక మరీ ఒంటరివాడు అయ్యాడు. ఒక రకంగా ఆయనకు ఆ రెండు మరణాలు కోలుకోలేని దెబ్బ తీసాయి.అందుకే చావుకూడా నిర్దయగా ఆయనను దొంగ దెబ్బ తీసింది.
కాళ్ళ ఆయన పూర్వీకుల నుండి పొందిన ఆస్తులూ అంతస్తులూ జ్ఞానమూ ఏమీ లేదు.తండ్రి ఒక సాధారణ రిక్షా కార్మికుడు. కాళ్ళ కూడా బ్రతుకు దెరువు కోసం రిక్షా తొక్కాడు. ఖమ్మం లో రెండు గదుల ఇల్లు తప్ప ఆయనకు మిగిలింది ఏమీ లేదు.ఇప్పుడు ఇవ్వడానికి ఆయన వారసులకూ ఏమీ మిగల్చలేదు.తన తండ్రి మిగిల్చు కున్న నిజాయితీ మినహా అది కాళ్ళ కడుపు నింపలేదు ఆయన వారసుల కడుపూ నింపదు. తాను బ్రతికి నంతకాలం కీర్తికీ, ప్రచారానికీ, ఆడంబరాలకీ దూరంగా తాను ఈ లోకం లోకి ఎంత నిరాడంబరంగా వచ్చాడో అంతే నిదానంగా నిష్క్రమించాడు. ఆయన బొమ్మలకి విలువ కట్టే సాహసం మనం చేయలేము.మన మధ్యే బ్రతికిన ఒక మహా చిత్రారుడి అమూల్యమైన సంపద ఎలుకలకూ పందికోక్కులకూ బలికావడమే ఈ కాలపు విషాదం. ఇది ఒక కాళ్ళకు జరిగిన నష్టం కాదు. ఒక మహా చిత్రకారుడు నిష్క్రమణ ఈ లోకానికి తెలియకుండా పోవడం వెనక మనందరి సామూహిక వైఫల్యం ఉంది. ఆయన బొమ్మలు ముందు తరాలకు చేర్చాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అదే కాళ్ళకు మనం ఇచ్చే నివాళి.

జోహార్ కాళ్ళ! జోహార్ !! జోహార్.!!!
డా.గుఱ్ఱం సీతారాములు
995166100146819131_2388006357894631_3472700948256653312_n

కొంకణ్ తీర ‘నల్ల కలువ’ఊర్మిళ పవార్’ .

ఈ రోజు ఆంధ్ర జ్యోతి లో ఆంధ్ర,తెలంగాణ,హైదరాబాదు ఎడిషన్ లో నా వ్యాసం…వీలుంటే చదవండి.ఇది పూర్తి గా .

 

కొంకణ్ తీరం వెంబడి ఇంట్లో అల్లిన తట్టలు బుట్టలు నెత్తిన పెట్టుకొని వంట్లో చమటను ఉప్పు చెలిమిగా మార్చుకున్న బాల్యం ఆవిడది. పచ్చిగడ్దో, ఎండుకట్టెలో అమ్మ అల్లిన తట్టలో,బుట్టలో నెత్తిమీద పెట్టుకొని సమీప పట్టణానికి నడిచి వెళ్లి ఊరంతా తిరిగి అమ్మి కాసిన్ని నూకలు ఇంటికి తెస్తే అప్పుడు నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళేవి. రత్నగిరి లో మొదలైన ఒక అంటరాని జ్ఞాపకాలు నేడు ప్రపంచ వ్యాప్తంగా బ్రతుకు పాఠాలుగా మారి తరగతి గదుల్లో ప్రతి ద్వనిస్తున్నాయి. తరతరాలుగా సహ్యాద్రి పర్వత శ్రేణుల కింది అణగారిన బ్రతుకులు వాళ్ళవి.ఆకలి,అబద్రత,అంటరానితనం,అంధవిశ్వాసాల నడుమ పెరిగిన బాల్యం, యావత్ కొంకణ్ రీజియన్ లోనే తొలి పోస్ట్ గ్రాడ్యుయేట్ . తన పూర్వీకుల మౌఖిక గాధలకు తరాలుగా అల్లిక వార రసత్వాన్ని చరిత్ర రచనలో సృజనాత్మక సాహిత్యంలో అన్వయించి రాసిన ఆమె రాతలు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించినవి. ఆమే ఊర్మిళా పవార్. ఆమెకు ఈ ఏడాది త్రిపురనేని గోపీచంద్ జాతీయ పురస్కారం ప్రకటించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్య సాహిత్య చరిత్ర ‘ఆత్మకథ’ను తక్కువ చూపు చూసింది. పదిహేడో శతాబ్దం తర్వాత ప్రపంచ సాహిత్యంలో నల్లజాతి స్వాభిమాన పోరాటాల అనుభవిక జ్ఞానం పునాదిగా బయలుదేరిన ఆత్మకథలు ప్రత్యామ్నాయచరిత్ర నిర్మాణ వనరుగామారాయి. యూరోపియన్ మేదో ప్రపంచం లో 17 శతాబ్దం తర్వాత జరిగిన మార్పు, బానిసత్వ నిర్మూలన చర్చ మూలంగా బానిసల అనుభవాలకి, జ్ఞాపకాలకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ స్పూర్తిని కొనసాగించింది మరాఠా సాహిత్యలోకం. ఫూలే అంబేద్కర్ విప్లవాత్మక తాత్విక భూమికగా విస్తృతమైన కథ,కవిత్వం,నవల,ఆత్మకథలువచ్చాయి. వీటి వెనక భక్తిఉద్యమ చోఖమేల, సంతురవిదాస్,నామదేవ్ పరంపరఉంది. యాభయ్యో దశకం చివరి అంకంలో ‘మహారాష్ట్ర దళిత సాహిత్య సంఘ’ ఆవిర్భావం దాని కోనసగింపు గా ‘దళిథ్ పాంథర్’ ఆత్మగౌరవ దిక్కారం తొంబైల చివరలో ధారావి మురికివాడల్లో ఆదిపత్య మరాఠా సాహిత్యానికి వ్యతిరేకంగా పురుడు పోసుకున్న‘విద్రోహి’ సాహిత్య సమ్మేళనం స్ఫూర్తి ఉంది. ఆపరంపర నుండి బాబూరావు బాగుల్, నామదేవ్ దసాల్, వసంత మూన్,దయపవార్,లక్ష్మన్ మానె,శరణ శరణ్ కుమార్ లింబాలే లాంటి ఎంతో మంది బయలుదేరినా ఈ పోరాటాల్లో స్త్రీవాద అస్తిత్వ పొలికేక రత్నగిరి ఆడబిడ్డ ఊర్మిలా పవార్.

పందొమ్మిది వందల నలభై చివరి అంకం లో బోంబే ప్రెసిడెన్సీ రత్నగిరి జిల్లాలో జన్మించిన ఆమె తండ్రి ఒక బడిపంతులు,కుల పూజారి కూడా. తన పూర్వీకులకు పూజారులకూ మధ్య జరిగిన అభిప్రాయబేదాలతో తానే కుల పూజా క్రతువులు నడిపాడు. బాల్యంలోనే దూరం అయిన తండ్రి, ముగ్గురు చెల్లల్లు,ముగ్గురు తమ్ముళ్ళు నిట్టాడి లేని వంటరి బ్రతుకుల్లో ఒక్కొక్క పైసా కూడేసిన వెలుగు నింపడానికి తన తల్లి బ్రతుకంతా యుద్దమే చేసింది. పుట్టింది దళిత కుటుంబం అయినా తన పూర్వీకుల వ్రుత్తి మేదరిపని. ఇంట్లో అల్లిన తట్టలు,బుట్టలు తన బ్రతుకు సోపానాలు అయ్యాయి. తల్లి త్యాగం తన చుట్టూ వ్యవస్థ చేసిన కుల గాయాలు ఆమెను దేశం గర్వించ దగిన రచయిత్రినీ ,చరిత్రకారిని, స్త్రీవాదిని చేసింది. ఏ తరగతి గదులు తనను అంటరానిది,మురికిది అని ముద్రేసాయో, ఏ తరగతి గదులు పాకీదానిలా మార్చి అవమాన పరిచాయో, అవే తరగతి గదుల్లో ఆమె బ్రతుకు పాటం బడిపాఠాలు అయ్యాయి.

ఊర్మిళ పవార్ పుట్టిన పెరిగిన ప్రాంతాలు బుద్దుడు బ్రతికి ఉండాగానే ఆయన తాత్విక ధారలో ఉన్నట్టు చారిత్రిక ఆధారాలు అంబేద్కర్ పెరిగిన గుర్తులూ ఉన్నాయి. మళ్ళీ రెండు వేల ఏళ్ళ తర్వాత అంబేద్కర్ చివరి దశలో వేలాది మందితో ప్రత్యామ్నాయ ఆలోచనల వైపు మళ్ళారు. మహారాష్ట్ర పల్లెల్లో పూరి గుడిసెల్లో గోడలకు తరతరాలుగా వేలాడుతున్న విశ్వాసాల అవశేషాలను చెత్త బుట్టల్లో విసిరేశారు. ఇదేదో ఒక మతం మీద మరొక మతం సాధించిన పైశాచిక విజయం కాదు. మనిషిని మనిషిగా చూడని ఒక విశ్వాసం మీద సమతా భావనల తిరుగుబాటు. అది జరిగే నాటికి ఆమె వయసు పదకొండేళ్ళు. తన అసలు పేరు విమల తన సహచరుడు అంబేద్కర్ ఆలోచనపరుడూ అయిన హరిశ్చంద్ర తో పెళ్లి తర్వాత విమల ఊర్మిళ పవార్ అయ్యింది.

ప్రపంచ ద్రుష్టి రాత అయితే ఉర్మిలది అల్లిక సంస్కృతి. ఒక వైపు వాళ్ళ అమ్మ తన జీవిక కోసం బుట్టలు అల్లడం ఇంకో వైపు ఊర్మిళ తన నడిచి వచ్చిన కస్టాలు, నష్టాలు అల్లుకుంటూ ఒక రూపం ఇవ్వడం. ఇద్దరూ ఏకకాలం లో చరిత్ర నిర్మిస్తూ ఉన్నారు. ఒకరు తన బ్రతుకు నిట్టాడి కూలి తనువంతా బరువూ బాధ్యతలు మోస్తే మరొకరు ఆ అల్లిక వారసత్వ పునాదిగా దళిత మహిళా చరిత్రను పునర్న్నిర్మించే పనిలో ఉన్నారు.

డెబ్బైల లో రత్నగిరి నుండి బొంబాయికి మారాక అక్కడి కవులు రచయితలు మేధావుల కలయికతో మొదట మైత్రిని, ‘సంవాదిని’ అనే సాహితీ మిత్రమండలితో కలిసి స్త్రీవాద సాహిత్య నిర్మాణాలు చేసిన ఆమె నాందేవ్ దసాల్,అరుణ్ కాంబ్లె, జెవి పవార్, అర్జున్ డాంగ్లె లు ఇచ్చిన స్ఫూర్తి, షర్మిలారేగె,ఎలెనార్ ల సహచర్యంలో ప్రోదిచేసుకున్న బౌద్ధిక జ్ఞానం అట్టడుగున కనిపించని మరాఠ మహిళా చరిత్ర వెలికి తీయడానికి దోహదపడ్డది. వసంతమూన్ సహచరి మీనాక్షిమూన్ తో కలిసి మహారాష్ట్ర కేంద్రంగా బయలుదేరిన స్వాభిమాన ఉద్యమాల చారిత్రిక నేపధ్యాన్నివిద్యావ్యాప్తిని,అనాదిగా దళితబహుజన కులాల్లో అమానవీయమైన దేవదాసి వ్యవస్థను, మొదట అంబేద్కర్ రాజకీయ పునాదుల్లో అనామకంగా మిగిలిపోయిన స్త్రీవాద రాజకీయాలను,దళిత స్త్రీవాద నిర్మాణాలకుఒక రూపంఇవ్వాలనుకుంది. యాభయ్యో దశకం మొదలు నేటి దాకా సాంస్కృతిక నిర్మాణంలో ఉన్న దాదాపు యాభై మందికి పైగా స్త్రీల బ్రతుకు చిత్రాలను చరిత్రలో మొదట మరాఠలో ఆ తర్వాత ఆంగ్లం లో “వి అల్సొమేడ్ హిస్టరీ” మేధావుల విమర్శకుల అభిమానాన్ని పొందింది. రమాబాయి అంబేద్కర్ మొదలు రాధాబాయికాంబ్లె,బేబీకాంబ్లె,ఎందరోఅట్టడుగునకనిపించనికథలు బయటకు తేవడం దేశస్త్రీవాద రాజకీయాలకు ఒక మేధో చేయూత నిచ్చింది.

ఆమె అనుభవించిన వివక్ష ఉద్వేగాల కొలిమిలోంచి పురుడుపోసుకున్న ‘సిక్స్త్ ఫింగర్’,’ఉదాన్,’అయదన్’ రెండు ఏకాంకికల తోబాటు యత్రాకథనాలు, నాందేడ్, వార్ధా,ముంబై ప్రపంచ వ్యాప్తంగా అనేక పేరుమోసిన విశ్వవిద్యాలయాలలో ఆమె ఆత్మకథమీద చర్చలు పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుకు పరిశోధనా పత్రాలు, వందలాది సదస్సులలలో పాల్గొన్న ఆమె ఈ తరానికే కాదు రాబోయే తరాలకూ ఒక దిక్కార పతాక. ’నేను సావిత్రి భాయిఫూలే నాటకాన్ని రాసి అందులోనటించిన ఆమె సాహిత్యం అనేక భాషల్లోకి అనువాదం జరిగి , రేడియో వివిధ టి వి చానెల్లలో కథా వస్తువుఅయ్యాయి. జబ్బార్ పటేల్ తీసిన అంబేద్కర్ సినిమాకి కూడా పనిచేసారు.
పందొమ్మిది వందల డెబ్బై లలో మొదలైన ‘దళిత్ పాంథర్స్’ దేశ స్వాభిమాన ఉద్యమాలకు ఒక దిక్సూచి. దానిలో మహిళా ప్రాతినిథ్యం లేకపోవడాన్ని సూటిగా ప్రశ్నించింది. ఆకలి అవమానం,నిరక్ష్యరాశ్యత,అంధ విశ్వాసాలులతో సతమతం అవుతున్నమహిళలకు రాజకీయ,సాహిత్య నిర్మాణాలు ఉండాలని ఉద్యోగాన్ని కుటుంబాన్ని వదిలి తన సాహిత్య జీవిత గమనాన్ని నిర్మించుకుంది. తన రాజకీయ కార్యాచరణ లక్ష్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని అంబేద్కర్ చూపిన ప్రత్యామ్నాయ మార్గం వైపు మారేలా దారి చూపాయి.

పదిహేను ఏల్లకింద మరాఠ లో ‘ఆయదాన్’ గా ఆంగ్లం లో “వీవ్ అఫ్ మై లైఫ్” పేరుతో రాసుకున్న ఆత్మ వ్యధాత్మక కథనం అస్తిత్వ రాజకీయాలలో, స్వాభిమాన పోరాటాలలో చెరిగిపోలేని సంతకం. తన మాతృభాషలో రాసిన దానిని ఆంగ్లంలో మా ఎఫ్లూ అధ్యాపకురాలు మాయ పండిట్ అనువదించగాప్రఖ్యాత కొలంబియా విశ్వవిధ్యాలయం ప్రచురించారు. ఆమె రచనలు అనేక భాష లోకి అనువాదం అయ్యాయి.గడిచిన ఏడు దశాబ్దాల దళిత మహిళ గుండె చప్పుడు ‘అయదాన్’. ‘ఇది కేవలం నా కథ కాదు నా మూలవాసుల ఆత్మకథ’ నేను పొందిన అనుభూతులూ అనుభవాలు నాసొంతం కావు అవి ప్రజల సామూహిక దుఖంసాగరం నుండి పురుడు పోసుకున్న ఆకాంక్షలు అని రాసుకుంది. బాల్యం లోనే కోల్పోయిన తండ్రి, గంపెడు కుటుంబాన్ని గంపలు అల్లి అమ్మి సాకిన తల్లి, డెబ్బై ఏల్లకింద కొంకణ్ తీరంలో ఆకలి అవమానాలకు, జ్ఞాపకాలకు తన వర్తమాన కార్యాచరణ కలిపి రాసింది. తనకు ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు. ఆమె జీవితం లో అంతులేని విషాదం ఉంది. ఇష్టపడి చేసుకున్న హరిశ్చంద్ర, వైద్య విద్యచదువుతున్న ఒక్క గానొక్క కొడుకునూ కోల్పోవడం. ఆ క్షోభని తథాగతుని తత్వాల అనువాదంలో సాంత్వన పొందింది.

ఆదిపత్య కులాల స్త్రీ హక్కుల మధ్య అనాకారిగా మిగిలిన దళిత మహిళ అస్తిత్వ పునాదుల్లో ఊర్మిలాపవార్ నడిపిన రాజకీయాలు ఉన్నాయి. జాత్యహంకార వ్యతిరేక దర్భన్ సదస్సు మొదలు బీజింగ్ లో అంతర్జాతీయ మహిళా సదస్సు మహారాష్ట్ర కేంద్రంగా జరిగిన అనేక స్వాభిమాన పోరాటాల లో ఆమె ప్రాతినిత్యం ఉంది. తన అమ్మ బువ్వ కొరకు బుట్టలు అల్లుతూ ఉంటె మరోవైపు వైపు తనబ్రతుకును అక్షరాలలోకి బట్వాడా ఏక కాలంలో చేసింది . అల్లిక తన పూర్వీకుల నుండి అబ్బిన విద్య, రాత తన జీవితాలోకి ఆలశ్యంగా వచ్చినా వారసత్వంగా వొనకూరిన అల్లిక తన రాతలనుభిన్నంగా నిలిపాయి. ఆధునిక సమాజం లో కులం అరణ్యాలలో క్రూర జంతువులు మాయం అయినట్లు కనిపిస్తది,కానీ పొదల్లో ఏ క్రూర జంతువు ఏ క్షణాన దాడి చేస్తాదో నిత్యం బడుగు జీవితాలు బిక్కు బిక్కుబిక్కుమంటూనే ఉన్నాయి. రోజు కొక కుల ఉత్పాతం మానుదిటిపై చేసిన గాయాలను మోస్తూనే ఉన్నాం అంటుంది. ఆమె ఈ కాలపు నిజమైన ఆచరణ వాది.
తన తల్లిచెమట రక్తం కలిపిన అల్లికల కొనసాగింపుగా ఊర్మిల ఒక్కొక్క దర్భ కూడేసి తన జీవితాంతం అల్లుకున్న పిచ్చుక గూడులోంచి ఒక్కొక్క పాత్రా మాయం అయ్యింది.పెంచి పెద్దచేసిన తల్లి, తండ్రి, తమ్ముడు, కొడుకు, భర్త ఒక్కొక్కరు దూరం అయితే తన కల్లోల జీవితానికి రచనవ్యాపకం మాత్రమె సాంత్వన అయ్యింది. ఆమె ఆత్మకథ అయదాన్ కుపదిహేను ఏల్ల కిందనే ‘మహారాష్ట్ర సాహిత్య పరిషత్’ ‘లక్ష్మిభాయితిలక్’ పేర ఏర్పడిన రాష్ట్ర ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని తిరస్కరించిన ఆమె రాజ్యం ఇస్తున్న పురస్కారాల పట్ల తన వైఖరిఏమిటో ప్రకటించారు. పందొమ్మిది వందల యాభైలలో మొదలైన ఊర్మిళ ప్రస్తానం గడిచిన ఆరు దశాబ్దాల కష్టాలలో,కన్నీళ్ళలో జయాపజయాలలో మహోన్నతమైన మరాఠ దళిత స్త్రీవాద రాజకీయాలో అణువణువూ నింపుకున్నది. ఆమె వర్తమాన రాజ్య వికృతానికీ, విషాదానికీ సాక్ష్యంగా మిగింది.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసాక రెండు మహోన్నతమైన వ్యక్తిత్వాలు లండన్ కేంద్రంగా తమ రాజకీయ తాత్విక కార్యాచరణను మొదలు పెట్టాయి.అంబేద్కర్ కొలంబియా వదిలి లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో రీసెర్చ్ మొదలు పెట్టేనాటికి త్రిపురనేని డబ్లిన్ నుండి బారిస్టర్ పట్టాతో తిరుగు ప్రయాణంలో ఉన్నాడు అదే ఏడు అంబేద్కర్ స్కాలర్ షిప్ అయిపోతే ఇండియా వచ్చాడు. ఒకరు ఫూలే మరొకరు పెరియార్ స్పూర్తితో ఆధునికతను ప్రత్యామ్నాయ ఆలోచనలనూ తమ పుట్టిన గడ్డకు మోసుకొని వచ్చారు. ఒకరు విశాలమైన విముక్తి రాజకీయాలను నడిపితే మరొకరు తెలుగునాట ద్రావిడ,జస్టిస్ పార్టీ రాజకీయాలు కొనసాగించారు. అచంచల విశ్వాసం తో కడదాకా నమ్మిన విలువల కోసం తపించిన మహోన్నత వ్యక్తిత్వాలు వాళ్ళవి.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక ప్రపంచ వ్యాప్తంగా అల్లుకున్న అబధ్రతా భావం,మానసిక భావసంఘర్షణ, జాతీయోద్యమ ప్రభావం,హేతువాద,నవ్యమానవవాద రాజకీయాల కొనసాగింపును తెలుగు సాహిత్యంలో, కథల్లో,నవలాతాత్విక రచనల్లో మధ్య తరగతిఊగిసలాట, తన చుట్టూ ఉన్నసంక్లిష్టత ‘అసమర్ధుని జీవన యాత్ర’, ‘పండిత పరమేశ్వరుని వీలునామా’ లాంటి రచనలలోకి మరికొన్ని సినిమాల్లోకి మనల్ని తీసుకొని వెళ్ళిన గొప్ప సాహితీవేత్త గోపీచంద్. అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితం అయిన ఊర్మిళాపవార్ కు గోపీచంద్ పేర ఏర్పడిన పురస్కారం లభించడం కేవలం యాదృచ్చికం కాదు. మూడున్నర దశాబ్దాల కొనసాగింపు లో భాగంగా, అదే విలువల దారిలో నడిచిన ఏడు దశాబ్దాల స్వాభిమాన పోరాటాల నిలువెత్తు ఆత్మగౌరవానికి ఇవ్వడం నిజంగా ప్రత్యామ్నాయ విలువల కొనసాగింపే.

(అపర్ణ లాంజీవర్ అమ్మమ్మ అంబేద్కర్ తో కలిసి పనిచేసిన వాలంటీర్, ఊర్మిళ పవార్ వసంత మూన్,అంబేద్కర్ కొడుకు తో కలిసి పనిచేసింది. వాళ్ళ జ్ఞాపకాలు వినడానికి అయినా రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో కలుద్దాం… )

డా.గుఱ్ఱం సీతారాములు 9951661001
(సెప్టెంబర్ ఎనిమది సాయంత్రం తెలుగువిశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రఖ్యాత మరాటీ రచయిత్రి ఊర్మిళా పవార్ కు త్రిపురనేని గోపీచంద్ అవార్డు ఇస్తున్న సందర్భంగా)

“పల్లె కంటికి రెప్పలు”

గ్రామాల్లో వాడకొక మైఖేల్ ఏంజిలో, డావెన్సీలు ఉంటారు. డేవిడ్ లాంటి కుదిమట్టంగా ఉండే బాహుబలులూ కనబడతారు.

1

ఆదిమ సమాజాల లో నాగరిక భావన మొదలు కాని రోజుల్లో మనిషి స్థిరమైన ఆవాసం లేకుండా సంచరిస్తూ గుహలు పర్వతాలు అవాసలుగా బ్రతికాడు. ఉరుములు మెరుపులు మేఘాల రాపిడికి నిప్పు వస్తది అనీ, విత్తనం నాటితే మొలకలు వస్తాయి అని దానికీ ప్రకృతికీ ఋతువుకీ ఏదో సంబంధం ఉందని రాయికీ రాప్పకీ మొక్కాడు.

ప్రకృతినే దేవతగా భావించి తనకు తెలియని అతీంద్రియ శక్తులు ఏవో తనను నడిపిస్తున్నాయి అనీ తెలియని శక్తికి దాసుడు అవడం మొదలు పెట్టాడు. అనాదిగా వాళ్ళ ఆరాధ్య దైవం గ్రామ దేవతలు.

వేదకాలానికి పూర్వం ప్రజలు ప్రకృతి ఆరాధకులు. చెట్టు, పుట్ట,రాయి నీరు, నిప్పు తన చుట్టూ ఉన్న సమస్త జీవజాలం లో దైవాన్ని చూసుకున్నారు.

ఆ కాలంలో మాతృస్వామిక వ్యవస్థ ఉంది కనుక స్త్రీ ఆరాధ్య దైవం అయ్యింది. ఇది దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలవబడుతూ ఉంది. ఇదొక ఆచరణ దానికో దేశవాళీ క్రతువు ఉంది. పండిత క్రతువుకు సమాంతరంగా మరొక పరంపర ఉంది. ఉత్పత్తి కులాలకి అనుబందం గా ఆశ్రిత లేదా ఉప కుల నిర్మాణాలు ఆయా కులాల జీవితం లో పెళ్లి చావు లేదా మరోదో క్రతువు నిర్వహణ పూర్తిగా ఆయా కుల పూజారుల ఆజమాయిషీ లోనే జరిగేది. వీళ్ళ జీవన వ్యవహారాల్లో గ్రామ దేవతలు బాగం అయ్యాయి. ఇవి ఎన్నో పేర్లతో వ్యాపించి ఉన్నా అన్ని ప్రాంతాల లోనూ దళిత బహుజన కులాల కుల పెద్దలు, కుల గురువులు లేదా బైండ్ల.లేదా బవనీ లాంటి కులాల వాళ్ళు ఈ దేవతల పూజారులుగా చలామణిలో ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా శక్తి ఆరాధకులు ‘శాక్తేయ’ పరంపరను ఆచరించే వైదిక క్రతువుకి బయట ఉన్న ఇది అతిసాధారణ పూజా విధానం నిరాడంబర గుడులు . మూలవాసుల నమ్మిక ఆచారం కల్లూ, సార, జంతుబలి, నైవేద్యం ఒక విశిష్టత. కొన్ని గ్రామాల లో బయట కాక ప్రతి ఇంట్లో తమ నమ్మకానికి అనుగుణంగా ఒక గుడి పూజా క్రతువు ఉంటుంది. వాస్తవానికి ఇవి గ్రామానికి రక్షణగా ఉన్న ఐతిహ్యాలు.

2

ఈ గ్రామ దేవతల ప్రస్తావన పురాణాలలో కనబడదు అయినా “విష్ణుపురాణం” లో జమదగ్ని కథలో ‘ఎల్లమ్మ’ లేదా ‘రేణుకా ఎల్లమ్మ’ ప్రస్తావన ఇలా ఉంది “ఋషి జమదగ్ని తన భార్య రేణుక ఏదో తప్పు చేసింది(తను భర్తను కాక పరాయి పురుషుణ్ణి అలోకన చేసుకుంది అనే అభియోగం) ఆమెను వదించమని తన కొడుకు పరుశురామున్ని ఆజ్ఞాపించగా భయపడిన రేణుక మాదిగ లందలో తల దాచుకున్నది పరుశ రాముడు తన తండ్రి మాట ప్రకారం రేణుక తల నరికి తండ్రికి చూపిస్తాడు. కన్న తల్లిని నరికే అమానవీయ దుష్టాంతం ఇది.

మళ్ళీ తన భార్యను బ్రతికించే క్రమంలో తెగిన తల కోసం వెతకగా కేవలం మొండెం మాత్రమె దొరకగా ఒక మాదిగ స్త్రీ తలను నరికి రేణుక మొండానికి అతికించి ప్రాణం పోసాడు. అప్పటి నుండి రేణుక ఎల్లమ్మ గా పిలువ బడుతోంది అని ఐతిహ్యం. అందుకే కింది కులాల లో ఇంటికొక ఎల్లమ్మ ఉంటది.

ఎల్లమ్మ అంటే ఎల్లలు లేని దేవత అని అర్ధం. ఆమె సోదరీమణులు అయిన మన గ్రామ దేవతలు ఈదమ్మ, ఉప్పలమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, మైసమ్మ, పోలేరమ్మ(పొలి అంటే పోలిమెర-సరిహద్దు), పోచమ్మ, అంకాలమ్మ, సవారు లచ్చమ్మ, పైడితల్లి, గంగానమ్మ, కోట మైసమ్మ, కట్ట మైసమ్మ బందం మైసమ్మ గా గ్రామ గ్రామాన అనేక పేర్లతో విస్తరించి ఉంది. ప్రతి ఇంట్లో తమ ఆడ బిడ్డలను ఆ రూపం లో గౌరవించుకుంటూ ఆ పేర్లు పెట్టుకుంటున్నారు. ఏది ఏమయినా ‘గ్రామ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన స్త్రీలనే దేవతలుగా భావించి గ్రామానికి రక్షణ కల్పిస్తున్నారు’ ఆధునిక పరిశోధనలు నిరూపిస్తున్నాయి

3

దారం పోగు కట్టడిని జంధ్యం శాసిస్తోంది.

ఆధిపత్య శిష్ట ధోరణులు ఈ గ్రామ దేవతలను కబలిస్తున్నాయి.ఆదిమ కాలం నుండీ అనుసరిస్తున్న పూజా విధానంలో వైదిక సనాతన క్రతువు తిష్ట వేసింది, ఇప్పుడు చిందు,డక్కలి,బవనీలు అలంకార ప్రాయం అయ్యారు. భత్యం విదిల్చి గుడి చుట్టూ దాని సంపద చుట్టూ ఈగల్లా బెల్లం నాకేస్తున్నారు.

అసలు రాజ్యం కనుసన్నల్లో బోనాలు దానికి తోడు వందిమాగదులు పొగయ్యారు. దారం పోగు కట్టడిని జంధ్యం శాసిస్తోంది.

సట్టిలో వండే సప్పిడి పులగాన్ని బంగారు గిన్నెలో వండినంత మాత్రాన దాని రుచి మారుద్డా ? శావణమాసం జోగినీ, బవనీ, పంబాల, బైండ్ల,శివసత్తులకి కాస్త గాసం దొరికే మాసం, రాత్రికి రాజులుగా పగలు యాచకులుగా ఆదిపత్య కుల పోరాటాల పైరవీకాల్ల పద ఘట్టనల మధ్య చీమల్లా నలుగుతూన్న అస్తిత్వం వీళ్ళది. ఈ క్రతువులో దేవదాసీలు, మాతంగులు ముందుంటారు. శాక్తేయ పరంపరలో జరిగే ఈ ఆరాధన లో కింది కులాల వారే పూజారులుగా ఉంటారు. వీరి కేంద్రీకృతంగా జరిగే ఈ తంతు ఆదిమ సమాజాల నుండే ఉన్నప్పటికీ మధ్య యుగాల్లో అది వికృత రూపం దాల్చింది

4

ఈ బోణాల పరంపరలో అమానవీయ సంస్కృతి రంగం. తరతరాలుగా మాతంగి కుటుంబీకులు కత్తితో లగ్గం ఆడి రంగం పేరుతో భవిష్యవాణి వినిపిస్తూ ఒక నమ్మకాన్ని విస్వాశాన్ని కొనసాగిస్తున్నారు. మూలవాసుల విశ్వాసాల మీద ఆధునిక హేతువుతో వేసే ప్రశ్నలు నిలబడవు.

కేవలం సప్పిడి పులగానికి బంగారు తెలంగాణ తన బడాయిని వజ్రాల ముక్కుపుడకలు, బంగారు తాపడ బోనాలు సిద్ధం చేసి బ్రమకు బంగారు పూత పూస్తున్నారు . ఏటా పార్టీకి ఒక , ప్రవరకొక, పూటకొక పంచాంగం చెప్పే ఆధిపత్య కుల పూజారుల పంచాంగ విశ్వసనీయత ఈ గుడి ముందు ఎప్పుడూ దిగదుడుపే.

ఆదిమ కాల విశ్వాసాల్లోకి ఆధునికత ఎంత దూకుడుతో వచ్చినా అది బియ్యం లో వడ్ల గింజలా సంకరమే.

5

ఖమ్మం పట్టణానికి పక్కనే ఉన్న మా ఊరు(తల్లంపాడు)లో కొన్ని తరాలుగా గ్రామ రక్షణగా ఉన్న ‘మైసమ్మ’గుడి పునర్నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణ క్రమం లో స్థానిక శిల్ప, అద్దక, తాపీ మేస్త్రీ విద్వత్ స్వయంగా చూసా. గ్రామాల్లో వాడకొక మైఖేల్ ఏంజిలో, డావెన్సీలు ఉంటారు. డేవిడ్ లాంటి కుదమట్టంగా ఉండే బాహుబలులూ కనబడతారు. ఆ క్రమం లో ఇటీవల మైసమ్మ గుడి నిర్మించారు. ఇది మా తమ్ముడు గుఱ్ఱం శ్రీనివాస్ కట్టాడు, ఇంకో తమ్ముడు రామకృష్ణ ఆ శిల్పాలు తయారు చేసాడు. ఇంకో మిత్రుడు వెంకటేశ్వర్లు రంగులు అద్దాడు. వీళ్ళెక్కడో శిల్పశాస్త్ర విద్యలు నేర్వలేదు. ఆగమ శాస్త్ర, శస్త్ర,స్రష్టలూ కారు. బ్రతుకుల్లో అష్టవంకరలు ఉన్నా, నుదిటి మీద గీతలు సరి లేకున్నా చేతిలో మట్టి, సున్నం, సిమెంట్ ఒదిగి పోయింది. వివక్షను నుదుటి బొట్టులా ధరించిన కురూపి బొమ్మలు, వాళ్ళ కరుకు చేతుల సుకుమారానికి సిమెంటు, రాళ్ళు, ఇటుకలు వాళ్ళు వదగమన్న చోట వదిగాయి. ఆ చేతులు ఇంద్రధనస్సు కు తాపడం పెట్టగలవు.

ఇది వెలివాడల

అంటరాని జీవితాల్లో దాగున్న తుమ్మ పూలంత సౌందర్యం.

బీరపూవంత సుకుమారం

ఇవి కవెల కట్టెల్లో శిధిలమౌతూ ..

చరిత్రలో విస్మరణకు వెలివేతకూ లోనవుతూ…

ఒక విషాద గాధలా…

వీటిని వినేందుకూ రాసేందుకు నువ్వు మనిషిగా మళ్ళీ పుట్టాలి…

6

ఈ నెల ఆగష్టు పదహారు నుండి పందొమ్మిది మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన తంతు మా ఊరిలో ఎప్పుడో నూటా యాభై ఏళ్ళ కింద లేదా అంతకు ముందు జరిగి ఉండొచ్చు అని అమ్మ అన్నది. అది చూసిన విన్న వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. పాత ఊరిలో శిధిలం అయిన ఆ గుడి పునర్నిర్మాణ పనులు నా చిన్నతనం నుండే కొత్తది కట్టాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నా మా తమ్ముడు మొదట పూనుకొని పని మొదలు పెట్టాడు. గుడి కట్టడం అంటే చిన్న పిచ్చుక గూడు కట్టినంత తేలిక కాదు. ఖర్చు ‘నిష్ట’తో కూడుకున్న వ్యవహారం. ఈ క్రతువులో అతి ముక్యమైనది జంతుబలి , బలి తర్వాత ఊరుచుట్టూ బలి తిరగడం. అత్యంత బయోత్పాత మైన పని అది. ఆ తంతు చూడడానికి వేలాది మంది జమ కూడతారు. తినడానికి తిండి లేని జనాలకు ఇంటి మీద సరిగా కప్పు లేకున్నా ఊరి బయట ఉండే గుడి నిర్మాణం విషాదం లో విషాదం. మొత్తానికి ప్రజల్లో పెరుగుతున్న భక్తి అనుకోవాలో భయం అనుకోవాలో పెద్ద మొత్తం తో నిధులు సమకూరాయి.

నేను పదహారు అర్ధరాత్రి ఊరికి చేరా. కాలనీ మధ్య కాళీ స్థలంలో రెండు హోమ గుండాలు ఒక చతురస్రాకారం లో మరొకటి గుండ్రంగా అందంగా మట్టితో అలికి ముగ్గులు పెడుతున్నారు. కింది కులాలలో ఈ హోమాలు ఉండవు ఏనాడు అయితే ఈ క్రతువు చుట్టూ డబ్బు పోగు అయ్యిందో సాంప్రదాయం పేరుతో కుల పూజారుల విశ్వసనీయత ప్రమాదం లో పడుద్ది. ఆరోజు ఎందుకో వేల ఏళ్ళుగా ఈ క్రతువు నడిపే ‘బవనీ’ ఉనికి అస్తిత్వం ప్రశ్నార్ధకం అయ్యింది. సాంప్రదాయంగా వస్తున్న ఒక క్రమానికి ఆధునికత పేరుతో జరిగే ఎక్కిరింత అది. అక్కడ హోమాలు సాంప్రదాయ ముగ్గులు,కొబ్బరి,గుమ్మడి,ఇతరత్రా సామాగ్రి జమకూడింది. మొదటి రెండు రోజులు సంప్రదాయ కుల పూజారి అయిన బైండ్ల వెంకన్న మౌనంగా తన పరంపరలోకి దూసుకొని వచ్చిన సంస్కృత క్రతువు వెక్కిరింతల మధ్య గడిచింది. లీటర్ల కొద్దీ పాలు,నెయ్యి, హోమగుండంలో ఎండిన తంగేడు,మోదుగు,సండ్ర సమిధలుగా పదహారు రోజులు ఆరకుండా ఆవిరి అయ్యాయి. పూజా,పుణ్యాహ వచన,పంచగన్య,ప్రవచన,అఖండదీపారాధన,అగ్నిహోమం,యాగశాల,మండపారాధన,నవగ్రహ, అష్టదిక్పాలక, మంత్రం పుష్ప,తీర్ధ ప్రసాద, ధన, ఆర్ష, జల, పుష్పఅభిషేకాలు, యంత్ర లాంటి క్రతు లాంటి అర్ధం కాని సంస్కృత శ్లోకాల ఉక్కిరిబిక్కిరి మధ్య ‘సనాతన వైదిక’ పరంపర ముగిశాక మూడో రోజు బైండ్ల వెంకన్న తన ఆధీనం లోకి తీసుకున్నాడు.

అప్పటిదాకా జరిగిన క్రతువు వాళ్ళ జీవితం లో ఏనాడూ లేనిది. బవనీ ప్రవేశంతో ఆ ప్రదేశానికి ఒక్క సారి జవసత్వాలు వచ్చాయి. మూడో రోజు శివసత్తుల డప్పు కేరింతలతో ఊరు ఊరంతా శిగం ఊగింది. రోజంతా చిందాడిన శివసత్తులు తమ అలసట భారాన్ని మైసమ్మ గుడి ముందు మందు బీర్ బాటిల్స్ చీర్స్ కొట్టడం కల్లుపాక ఎల్లమ్మ గుడి ఎందుకు కలిసి ఉంటాయో అర్ధం అయ్యింది. ఆ రాత్రి మొత్తం బైండ్ల ఎల్లమ్మ కథ లయల మధ్య చివరి రోజు జరిగే భయానక ఉద్వేగాల ఎదురు చూపులతో ఆ రాత్రి నిద్రోయింది.

7

చివరి రోజు అతి ముఖ్యమైన రోజు అనిపించింది. వేలాది మంది ఊరును జాతర చేసారు. బలి నిర్వాహకుడికి స్నానం చేయించి. బలి కోసం తయారు చేసిన కత్తికి పూజలు చేసి. కంకణం కట్టి, కులపెద్దకి గజ్జెలు కట్టి వీరపూజ చేసి కత్తికి నిమ్మకాయలు కుచ్చి, కత్తిని గడప గడపకూ సాకబోసిన ఉద్వేగాల నడుమ బొడ్రాయి దాకా ఊరేగింపుగా వెళ్ళారు. తిరిగి గుడి వైపు వచ్చేముందు గ్రామగవిడి ముందు బలమైన దున్న కుర్రకు నాలుగు వైపులా తాళ్ళు కట్టి వొక్క వేటుతో తెగిన తల వేలాది మంది శిగం ఊగగా జరిగింది. రెండో దున్న గుడిముందు. మరో రెండు మేక పోటేల్లు కోసి పొట్ట చీల్చి పేగులు మేడలో వేసుకొని, దొబ్బను నోట్లో కరిసి, జొన్నలతో వండిన అన్నం లో కుంకుమ రక్తం కలిపి వాడ సరిహద్దుల చుట్టూ బలి తిరిగి అశ్శరభ శరభ ల మధ్య గ్రామం చిందాడింది. నాలుగు రోజులు నిరవధికంగా జరిగిన ఒక హోరు విశ్రమించింది. వందేళ్ళ తర్వాత జరిగిన ఈ క్రతువు తరానికి తరానికి మారుతూ వస్తోంది. మల్లెప్పుడు జరుగుతదో తెలియదు.

ఈ క్రతువు ప్రత్యక్షంగా చూసిన నాకు ఎక్కడో ఆఫ్రికా ‘చీకటి’ ఖండం లో నోబెల్ గ్రహీత వోలె సోయింకా రాసిన “డెత్ అండ్ కింగ్స్ హార్స్ మాన్” అనే నోబెల్ పురస్కార రచన యాడికి వచ్చింది . నైజీరియా లో ఎరూబా తెగలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రాసిన నాటకం అది. “రాచ పీనుగ ఊకెనే పోదు” అనే సామెత ఎందుకు వచ్చిందో నాకు ఎరూబా తెగ రాజు ఆచారాలు చదివాక అర్ధం అయ్యాయి. స్థూలంగా నాటక కథ ఒక మారుమూల తెగ ఆ రాజు చనిపోతే ఆ తెగ అంతిమ క్రతువులో రాజు గుఱ్ఱం, కుక్క తో బాటు ఆయన ప్రధాన అశ్వకుడు కూడా ఆత్మార్పణ చేసుకోవాలి. ఒక వేల ప్రధాన అశ్వకుడు చనిపోతే, లేక అనారోగ్యంగా ఉంటె ఆయన పెద్ద కొడుకు ఆ బాధ్యతను నెరవేర్చాలి. వినడానికి భయంగా ఉన్నా డెబ్బై ఎనభై ఏళ్ళ కింద దాకా ఈ ఆచారం ఉంది.
బ్రిటన్ వలస పాలనలో ఉన్న కాలం అది నాడు అక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్న ఒక తెల్ల దొర సైమన్ పికింగ్స్, ఆయన భార్య లండన్ లో మెడిసిన్ చదువుతునన్న ఆ ప్రధాన అశ్వకుని కొడుకుని ఒప్పించి ఎలా గయినా ఆ క్రతువు ఆపాలని చేసే ప్రయత్నం. అతను ఓడ లో బయలుదేరిన ఆ ఊరికి వచ్చేదాకా జాగారం చేస్తూ రకరకాల నివేదనలు చేస్తూ ఉంటుంది పల్లె.

అతని పేరు ఒలుండే. తమ తెగ మత విస్వాశాలకు అనుగుణంగా ప్రధాన ఆశ్వికుడు,ఆయన కొడుకు ఒలుండే తమ ప్రాణాలను అర్పిస్తారు.దీని అర్ధం ఆదిమ తెగలు తమ సాంస్కృతిక ఉనికి ప్రశ్నార్ధం అయినప్పుడు దానిని కాపాడు కోడానికి తనువు అర్పించడానికి వెనకాడరు.వలసపాలన తమ మూలవాసుల ఉనికిని అస్తిత్వాన్ని కబలిస్తున్నాయి అనీ,దానికోసం కొన్ని ప్రాణాంతకమైన పనులకూ వెనకాడరు. తరాలుగా నమ్మిన విస్వాశానికే ఒలుండే తలొగ్గడం ఈ నాటకం ముగింపు.”
నాడు జరిగిన సంవాదం లో “ఆధునికత పేరుతో మీరు తెచ్చిన విద్వంశం మా రక్త నాళాల్లో చేరి కలుషితం అయ్యింది. మీనుండి నేర్చుకునేంత దుస్థితి లో నా నాగరికత లేదు అని అంటాడు. ఎక్కడో మాఊరుకి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం లో జరిగిన ఒక సంఘటన ఒకే భావోద్వేగాలను కలిగి ఉండడం . ఒక మనిషి కోసం నమ్మిన విస్వాశం కోసం ఆత్మార్పణ చేసుకోవడం ఒక ప్రత్యామ్నాయ ఆలోచనగా చూడాలి. “ఒలుండే” నుండి నర్మదా నదిలో దూకిన ప్రతాపరుద్రుని దాకా ఒక ప్రాంతీయ విముక్తి కోసం వేలాది మంది అమరులు అవడం. ఎక్కడయినా ఒకే ఉద్వేగాన్ని కలిగి ఉంటుంది అనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆదిమ లేదా మూలవాసుల ఆచార వ్యవహార అలవాట్లు మధ్య కొనసాగుతున్న ఒరవడి నాటి నుండి నేటిదాకా కొనసాగడం వెనక నడిచిన రక్త నదిలో నమ్మిక,విస్వాశం వెనక భయోత్పాతం మూలాలు ఇంకా లోతుగా రాయాలి అనిపించింది.
ఎంతో ప్రజాదారణ పొందిన నైజీరియా ఒలుండే నిష్క్రమణ మాఊరు పక్కనే ఉంది అనిపించింది. మా ఊరిలో దున్న కుర్రను వేలాది మంది చూస్తుండగా వధించడం అందునా నరికిన వీర కత్తిని, నరికిన వాణ్ణీ పవిత్రంగా పూజించడం చూస్తే విభ్రమణ కలిగింది.
చూస్తే ఇదొక ఆటవిక అనాగరిక, హింసాత్మక చర్యలా అనిపించొచ్చు. నాస్తిక హేతువాదులు ఇందులో అనాగరికం వెతుక్కోవచ్చు. అయినా ఒకటి నిజం బలి ఆదిమ సమాజాల శిలాజం, వేట ప్రధాన వనరు అయినప్పుడు దొరికినదేదో ఒక ఉత్సవంలా వేడుకలా జరుపు కొనే ఒక సామూహిక వేడుక. ఈ సమాజం లో నూటికి తొంబై మంది తమవి కాని సాంస్కృతిక బరువులను మోస్తున్నారు. ఆధిపత్య ఐతిహ్యాలను ని దిక్కరించిన తమ వైన జ్ఞాపకాలను నాగరికతను కాపాడుకుంటున్ననిమ్న సాంస్కృతిక ఆలోచనలలో హేతువును వెతకగలమా? తమ తెగ రక్షణ కోసం పొలిమేర చుట్టూ బలి చల్లి ఏర్పరుచుకున్న హద్దులు వాటికి కాపలాగా గ్రామ గవిడిలో నీ ఆధునిక హేతువుకి అందని ఏదో ఒక నమ్మకం విశ్వాసం ఉండొచ్చు. దానికి గౌరవిస్తావా ఈసడిస్తావా అనేది నీ విచక్షణ మీద ఆధార పడి ఉంటది

 

విప్లవ చరిత్రలో విస్తాపితుడు

Tags

, , , , , , ,

39499278_10217754528121399_4516394060067373056_n

షేక్ మసూద్ బాబా నాకు శివసాగర్ మూలంగా వొనకూరిన జ్ఞాపకం. అవి శివసాగర్ చివరి మజిలీ రోజులు హైదరాబాదు లో ఉంటె కొందరి మిత్రుల దగ్గర విశాఖపట్నంలో శివుని చిన్నమ్మాయి శ్రీదేవి,విజయవాడ లో మసూద్ బాబా ఇంట్లో. పదిహేను ఏల్లకింద ఏదో పనిమీద విజయవాడ వెళితే మొగాల్రాజపురం సున్నం బట్టీ సెంటర్ లో ఉన్నా కలువు అన్నాడు. ఆయన కవిత్వ శకలాలను ఒక దగ్గరకు ఏరి కూర్చే క్రమం లో విశాఖ లో ఆయన కూతురు ఇంట్లో విజయవాడ లో బాబా ఇంట్లో తరుచూ కలిసే వాణ్ని. కలిసిన ప్రతిసంధర్భం లో ఎన్నో ముచ్చట్లు చర్చల్లో కదిలేవి. గుంబనంగా శ్రద్దగా వింటూ బాబా. నాటి నుండి మసూద్ బాబా శివసాగర్ పోయాక కూడా మిగిలిన ఒక ఘనీభవించిన జ్ఞాపకం. మధ్య మధ్యలో ఎప్పుడయినా కొడుకు ఆజాద్ బిడ్డ అయేషా చదువు గురించో ఆరోగ్యం గురించో మా ఇద్దరి మధ్య మాటలు కలిసేవి. సహకరించని ఆరోగ్యం తో బాబా పంటి బిగువున బ్రతుకుని సాగదీసాడు. అప్పుడప్పుడూ గుండె మొరాయిస్తే ఖమ్మం స్పందన హాస్పిటల్ లో కలవడం. ఎంతో వీరోచితమైన గతాన్ని మోస్తున్నా ఆ తలపుల భారంతోనే పోయాడు తప్ప చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోలేదు. కడదాకా సడలని విశ్వాసాల తోనే బ్రతికాడు. గతం వర్తమానం ఏదీ కాసిన్ని గంజినీళ్ళు కూడా పోయలేదు. కానీ నిలువెత్తు సడలని విశ్వాసాలని జావలాగా తన కుటుంబానికి పోసి సాకాడు. డెబ్బై రెండేళ్ళ బాబా ఈ ఆగస్ట్ ఐదో తారీకున నిశబ్దంగా ఈ లోకం నుంచి నిష్క్రమించాడు.

దేశానికి అధికార మార్పిడీ జరిగాక, ఎన్నికల తంతులో అపహాస్యం అవుతున్న ప్రజాస్వామ్యం. ఇంటా బయటా, విద్యార్ధి మేధో వర్గం ప్రత్యామ్నాయ సాయుధ రాజకీయాలవైపు చూస్తున్న దశ అది. సిలిగురి లో రాజుకున్న అగ్గి శ్రీకాకుళం లో దావాలం అయ్యింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్య రాజకీయాల కొనసాగింపే అని, తెలంగాణ సాయుధ పోరాట విరమణ పరిణతి లేని అవివేకమ మయిన పని అనీ, దాని కొనసాగింపు నక్సల్బరీ లో ఉందనీ శ్రీకాకుళ సాయుధ పోరాటానికి సన్నద్ధం అవుతున్న దశలో మైదాన ప్రాంతం నుండి దానికి సంఘీభావంగా వెళ్లిన మొదటి తరం విప్లవ చైతన్యం మసూద్ ది. విజయవాడ లో జరిగిన ఒక హత్య కేసులో ఆరోపణలు ఉన్న మసూద్ బ్రతుకు భవిష్యత్ 1969 జనవరిలో ఏజెన్సీ లోకి మారింది. ఉద్యమ విస్తరణలో బాగంగా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ కి వెళ్ళిన ఆయన 1970 ఆగస్టు లో కడలూరు లో అరెస్ట్ అయ్యా అని చెప్పేవాడు.

నాటి వలసపాలకుల మొదలు నేటి పాలకుల దాకా ప్రత్యామ్నాయ రాజకీయాల లో ఉన్న వారిమీద అనేక కుట్ర కేసులు బనాయించారు. మీరట్ కుట్రకేసు మొదలు పెషావర్,కాన్పూర్,లాహోర్,రాంనగర్,సికింద్రాబాద్, దాకా జిల్లా కొక కుట్రకేసు నమోదు అయ్యింది. అందులో పార్వతీపురం కుట్రకేసు అతి పెద్దది . దాదాపు నూటా నలభై మంది ముద్దాయిలు, ఎనిమిది వందల తొంబై ఏడుగురు సాక్షులు గా సుధీర్గ కాలం విచారణ పేరుతో ఆరేళ్ళపాటు కొనసాగిన పార్వతీపురం కుట్రకేసులో నాడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆందోళనలో బాగం అయి అరెస్ట్ కాబడిన అనేక మంది మీద బనాయించి నిర్భందించారు.

నాటి విప్లవనాయకులు, చౌదరి తేజేశ్వరరావు, చారు మజుందార్,కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి ,రవూఫ్ లాంటి ఎంతోమంది మీద కుట్రకేసులు బనాయించారు. నాటి పార్వతీపురం కుట్రకేసులో అనేకమంది నాయకులతో బాటు షేక్ మసూద్ బాబా కూడా అరెస్ట్ అయ్యారు. విచారణ పేరుతో కోరాపూట్, జయపూర్,మల్కన్ గిరి,విశాఖపట్నం, విజయవాడ, బందరు జైల్ లలో దాదాపు ఎనిమిది ఏళ్ళకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన విశాఖ జైలులో శివసాగర్ తో కలిసి జైలు శిక్ష అనుభవించాడు. ఏడెనిమిది ఏళ్ళ నిర్భంధం తర్వాత విడుదల అయిన మసూద్ బాబా ఏ నిర్మాణంలో పనిచేశాడో నేను అడగలేదు. ఆయన చెప్పుకోనూ లేదు. కానీ పందొమ్మిది వందల తొంబై ల దాకా విప్లవ సానుభూతిపరుడిగా ఆ తర్వాత కాలం లో శివసాగర్ తోనే తన రాజకీయ కార్యాచరణ లో ఉన్న ఆయన టాక్సీ నడుపుకుంటూ తనకు చేతనైనంత మేరకు నిర్మాణాలకు సహకరిస్తూ అత్యంత నిరాడంబరంగా బ్రతికాడు. తాను బ్రతకడమే కష్టం అయినా శివసాగర్ ని కలవడానికి వచ్చిన మిత్రులనూ సాకిన ఔదార్యం బాబా కుటుంబానిది. మొన్న ఆగస్ట్ ఐదో తేదీన బాబా ఇక లేడని కబురు. ఆయన డైరీ లో ఉన్న నా ఫోన్ నెంబర్ కు ఎవరో ఫోన్ చేసి చెప్పారు.

డెబ్బై రెండేళ్ళ సుధీర్గమైన కష్టాలూ కన్నీళ్ళ మధ్య విజయవాడ లో చనిపోయిన బాబా పూర్వీకులది గుంటూరు జిల్లా నరసరావు పేట రొంపిచర్ల ప్రాంతం. ఈ దేశ స్వాతంత్రానికి ఉన్న వయసు బాబాది. అమీనాబీ, మస్తాన్ బాబా లకు పందొమ్మిది వందల నలభై ఆరులో పుట్టిన ఆయన కుటుంబం విజయవాడకు వలస వచ్చింది. ఆయన బాల్య యవ్వనాలు విజయవాడలోనే గడిచాయి. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఆచరణలో రూపుదిద్దుకొన్ని ఆయన చైతన్యం సూర్యారావు పేట బెల్లం శోభనాద్రి గ్రంధాలయం లో సోవియట్ పుస్తకాల్లో బొమ్మలు చూడడానికి వెళ్తూ క్రమంగా కమ్యూనిస్ట్ సాహిత్యం చదవడానికి అలవాడు పడ్డా అని చెప్పేవాడు. పార్వతీపురం కుట్రకేసు నుండి విడుదల అయ్యాక ఖమ్మం జిల్లా తొండల గోపవరం కు చెందిన సౌదామిని తో జరిగిన పెళ్ళికి కొల్లా వెంకయ్య అధ్యక్షుడు. ఆయనకు ఆయేషా,ఆజాద్ ఇద్దరు పిల్లలు.చదివిన కొద్దిపాటి చదువుకి దొరికిన ఉపాధిలో బ్రతుకీడుస్తుంది. శ్రీకాకుళ పోరాటం లో బాగం అయిన బాబా దశాబ్దాల జీవితం విప్లవ కార్యచరణలోనే గడిచింది. జైలు నుంచి వచ్చాక సున్నపు బట్టీ సెంటర్ లో చిన్న కుటీరం లోనే ఉండేవాడు, టాక్సీ ఆయన బ్రతుకు ఆదరువు. అప్పడప్పుడూ ఏదన్నా చెప్పాలి అనిపిస్తే నాకు ఫోన్ చేసేవాడు. రెండేళ్లుగా ఆయననుండి ఏ కబురూ లేదు నిష్క్రమణ గురించి తప్ప. ఆయనొక జ్ఞాపకాల తుట్టె కదిలిస్తే ఎన్ని పేజీల లోనయినా నింప గల నిండైన నిలువెత్తు ఆదర్శం.

ఆరేళ్ళ కింద కందులపాడు లో అమరత్వం పొందిన శివసాగర్ మృతదేహాన్ని విజయవాడ బాబా ఇంటికే తరలించారు. కందులపాడులో కానీ, బాబా ఇల్లుకానీ కనీసం నలుగురు కూర్చొనే అంతస్థలం కూడా సంపాదించుకోలేని బ్రతుకులు వాళ్ళవి. సందర్శకుల సౌకర్యార్ధం విజయవాడ కృష్ణాజిల్లా స్వతంత్ర సమరయోధుల భవనం కు తరలించిన శివసాగర్ అంతిమ యాత్ర లో చూడడం మినహా ఆయన గురించి ఇంకే సమాచారమూ లేదు. డెబ్బై ఏళ్ళ వొడుదుడుకుల, వొత్తిడి జీవితాన్ని భరించిన బాబా గుండె, ఊపిరితిత్తులు మొరాయించాయి. దశాబ్దాల ఉద్యమ నేపధ్యం ఉన్న బాబా రాజకీయ జీవితం వాళ్ళ నాన్న ఫోటో లాగానే అదృశ్యం అయ్యింది. ఆయన పోరాటం లో ఉన్న కాలం లో తరచూ పోలీసుల దాడుల మధ్య బాబా కుటుంబ సభ్యులు బాబావి ఆయన తండ్రివి ఫోటోలు కాల్చి వేసారు. శత్రువుకి ఏ ఆధారాలూ దొరకకూడదు అని ఇంట్లో వాళ్ళు ఆపని చేసారు. “మా తాత ఎలా ఉంటాడో కనీస ఆధారం మాకు లేదు” అనేది బాబా బిడ్డ ఆయేషా, ఆయేషా తాత తండ్రుల చరిత్రకాదు కదా వాళ్ళ బ్రతుకు ముద్రలూ ఎప్పుడో చెరిగిపోయాయి. విజయవాడ మొగల్రాజ పురం సున్నం బట్టీ సెంటర్ చుట్టూ అనేక సాహిత్య, రాజకీయ కాల్పనిక గాధలు మన మధ్య చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందులో మసూద్ బాబా లాంటి బడుగుజీవుల ప్రస్తావనే ఉండదు.

శివసాగర్ ‘అంబేద్కర్ సూర్యడు’ పుస్తకం దగ్గరుండి దానికి సంబందిచిన పుస్తక సామాగ్రి రాసుకునే వెసులుబాటు కల్పించిన అతి కొద్ది మంది మిత్రులలో బాబా ఒకడు. చిన్న మంచం కూడా పట్టని మూడు గదుల రేకుల గదిలో ఈగల దోమల, కలిమి లేముల మధ్య జీవం పోసుకున్న ఆ పుస్తకం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో బాబా చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. జీవితాంతం నిర్భందాల మధ్య విప్లవ రాజకీయ అచంచల విశ్వాసాల మధ్య గడిచిన బాబా జీవితం శివసాగర్ జీవితం రాజకీయాలతో కలగలిసి నడిచింది. శివసాగర్ రాష్ట్రం లో ఎక్కడ తిరిగినా సున్నం బట్టీ సెంటర్ ఆయన జంగమ స్థావరం గా ఉండేది. సుధీర్గ మైన స్నేహం వాళ్ళది, గౌరవ పలకరింతలకు స్థానమే లేదు వాళ్ళిద్దరి మధ్య ఆజాద్,ఆయేషా వాళ్ళ తాతను శివసాగర్ లో చూసుకున్నారు. అందుకే కడసారి శివసాగర్ ను బాబా ఇంటికే తరలించారు. వాస్తవానికి బాబా బ్రతికి ఉండగానే ఆయన జ్ఞాపకాలు రాయించి ఉండాల్సింది. అది రాస్తే యాభై ఏళ్ళ నిర్భంద చరిత్ర అయ్యేది. వైయుక్తిక త్యాగాలను సామూహిక చేతనలో భాగం చేసే క్రమంలో ఎందరో చరిత్రలో కనబడకుండా వినబడకుండా పోయారు. ప్రత్యామ్నాయ విలువలకోసం మహోన్నతమైన పోరాట గమనానికి తమ చెమట నూ నెత్తురునూ సాకబోసి నిశబ్దంగా మాయం అయిపోతున్నారు. భావోద్వేగాలను నిశితంగా,నిష్పాక్షికంగా అక్షరీకరించే పని తెలుగు సమాజాన ఇంకా మొదలే కాలేదు. అది జరగనంత కాలం విప్లవ నిర్మాణాలకు రాళ్లెత్తిన కూలీల లాంటి మసూద్ బాబా లాంటి బ్రతుకు ఆవవాళ్ళు కూడా మిగలవు.

“ప్రజా రంగంలో సుధీర్గ కాలం పనిచేసిన వ్యక్తి మరణించినప్పుడు సమీక్షలు జరగవలసింది వర్తమానం లో, తక్షణ గతంలో ఉన్న సంఘటనల ఆధారంగా కాదు. మొత్తం జీవితం ఆధారంగా జరగాలి ” అని ఒక మేధావి సూత్రీకరణ చేసాడు. విప్లవ కార్యాచరణలో అత్యంత నిష్పాక్షికంగా మానవీయంగా ఉండాల్సిన మేధావి వర్గం లోని అగ్రకుల శక్తులు శివసాగర్ పట్ల తక్షణ గత శల్య పరిక్షలు జరిపి ఆయన ప్రాసంగికతను పాతర పెట్టే పనిచేసింది. ఆ విషాదంలో మసూద్ బాబాలాంటి బడుగుజీవుల బ్రతుకు ఎంత? విప్లవ చరిత్రలో ఇలా కొందరు విస్తాపితులుగా మిగలడమే ఈ కాల విషాదం. ఆయన ఆశయాల కొనసాగింపే ఆయనకు మనమిచ్చే నివాళి. జోహార్ కామ్రేడ్ బాబా .

డా.గుఱ్ఱం సీతారాములు.

(ఈ నెల పందొమ్మిది (Aug19 Sunday) విజయవాడ లో కా. షేక్ మసూద్ బాబా సంస్మరణ సభ.)

ఆయన నిబద్దత గురించి ఎంతరాసినా తక్కువే…

ఇలాంటి మానవీయ మనిషి యూనివర్సిటీకి ఒక్కళ్ళు ఉన్నా రోహిత్ వేముల లాంటి విషాదాలు జరగవు. ఇతను మాకు రీసెర్చ్ సూపర్వైజర్. పేరు వి.సుధాకర్ ఎఫ్లూలో సీనియర్ ప్రోఫెసర్. గతంలో ఉస్మానియాలో ఉండేవాడు. దశాబ్దాల ప్రజాపోరాటాల నిర్భందాల మధ్య పెరిగిన కుటుంబం.నిలువెత్తు ఆచరణ.అత్యంత సాదారణ జీవితం. ఎఫ్లూ విద్యార్ధి నాయకుడు సతీష్ కు , నాకు గైడ్ గా ఉన్నాడు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మృత్యుపాశాలుగా మారాయి ఇది వర్తమాన విషాదం. ఎఫ్లూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గడిచిన యాభై ఏళ్ళలో ఎన్నడూ చవిచూడని నిర్భంధాన్ని చూసాయి చూస్తున్నాయి. విషాదం ఏమిటి అంటే అత్యంత ప్రతిష్టాత్మక మైన ఈ మూడు విశ్వవిద్యాలయాలకు ముగ్గురు తెలుగు వాళ్ళు వైస్ చాన్సెలర్లుగా వచ్చారు. సునయనసింగ్ (ఈ పేరు ఉచ్చరించడానికే నాకు అసహ్యం) పొదిల అప్పారావు, జగదీశ్ కుమార్. వీళ్ళు వచ్చాకే నిర్భందం వెర్రితలలు వేసింది. ఆ ఒత్తిడి మా మీద పడినంతగా ఎవరి మీదా పడలేదు.ఈ పదేల్లలో ఎఫ్లూ హైదరాబాద్ యూనివర్సిటీ లో పదిహేను మందికి పైగా పరిశోధక విద్యార్ధులు అప్పటిదాకా మాతో ఆడి పాడి బలవన్మరణం పొందారు. నా చేతులతోనే కొన్ని దేహాలను మోసాను.
దీనికి కారణం మేము కేవలం చదువు తరగతి గదిలోనే దొరకదు అని భావించడం మూలంగానే. తెలంగాణా ఉద్యమం కావొచ్చు,ప్రజా ప్రత్యామ్నాయ పోరాటాలు కావొచ్చు విద్యార్ధి ఉద్యమాలు కావొచ్చు సమాజంలో జరిగిన ప్రతి ప్రత్యామ్నాయ ఆలోచనకూ మేము స్పందించడం మూలంగానే నిర్భంధం ఎదుర్కొన్నాం.(బీఫ్ ఫెస్టివల్ ,రావనాశూర,నరకాశూర ఇంకా ఎన్నో)
చానా మందికి తెలియని విషయం ఏమిటి అంటే కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో పరిశోధన విద్యార్ధులను ఒక్కో డిపార్టుమెంటులో నాలుగు నుంచి పదికి మించి సీట్లు ఉండవు. జాతీయ స్థాయిలో పోటీ. ఏదో కష్టపడి సీట్ సంపాదించినా తొందరగా గైడ్ దొరకడు. అలాంటి విపత్కర పరిస్థితుల లో వి.సుధాకర్,బంగ్య బూక్య లాంటి కొందరు అత్యంత ,మానవీయంగా ప్రజాస్వామికం గా వ్యవహరించారు.
ఈ రోజు సతీష్ నైనాల వైవా అయ్యింది అనగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా అడ్మిషన్ రద్దు చేసారు.సతీష్ నైనాల,మోహన్ ధరావత్ లను రెండేళ్ళు రస్టకేట్ చేసారు. సతీష్ కు మూడేళ్ళు ఫెలో షిప్ ఆపారు.ఈనాటికీ ఆ డబ్బులు రాలేదు. మా మీద కేసులు పెట్టారు.యావత్ భారత దేశంలో విద్యార్ధుల మీద ఒక ప్రొఫెసర్ పరువునష్టం దావా వేయడం, శిక్ష పడడం మీకు తెలుసో లేదో ఎఫ్లూ విద్యార్ధులను ఆ విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇన్ని అననుకూల పరిస్థితుల మధ్య మేము వందకు వంద శాతం డాక్టరేట్ డిగ్రీలు పొందాము.ఐదేళ్ళు కస్టపడి డిగ్రీ రాసి వైవా కోసం రెండేళ్ళు ఎదురు చూడడం మీకు తెలుసా ? అది మేము అనుభవించాము.
ఇది సాధ్యం కాడానికి ప్రొఫెసర్. వి.సుధాకర్ సర్ లాంటి టీచర్స్ ఉండడం మూలంగానే సాధ్యం అయింది.
మాకు సూపర్ వైజర్ అవడం మూలంగా ఆయన కూడా ఇబ్బందులు పడ్డాడు.
కానీ ఒక్కరోజు కూడా ఆ ఇబ్బందిని బయటకు చెప్పుకోలేదు.
మేము కలిసిన అరుదైన మనిషి ఆయన. నాకు సతీష్ కు సూపర్ వైజర్ .ఈ ప్రయత్నం లో మేము గెలిచామా ఓడామా అనడం కంటే
మమ్మల్ని కాపాడుకోడానికి సుధాకర్ సర్ చానాసార్లు ఓడాడు అవమానాలు పడ్డాడు. మేము బాగా చడవాలి రాయాలి జీవితంలో కుదురుకోవాలి తపన పడ్డాడు. మాకు నిట్టాడిలా నిలబడ్డాడు.
ఆయన నిబద్దత గురించి ఎంతరాసినా తక్కువే. థాంక్స్ చానా చిన్న మాట సర్…28947614_10216423681091055_4549201351775578195_o

పురాణ వైరి : కవిరాజు వర్తమాన చైతన్యం

jyothi

జమదగ్ని అనే ఋషివర్యుని  భార్య రేణుక ఎల్లమ్మ నదీ తీరంలో రోజులాగే ఒండ్రు మట్టిని పిసికి కుండ చేస్తోంది , ఆ కుండలో నీళ్ళను ఆశ్రమానికి తీసుకొని పోవడం ఆమె  దిన చర్య. కానీ ఆ రోజు ఎంత ప్రయత్నించినా కుండ కాకుండా చెదిరి పోతోంది. దానికి కారణం ఆమె తన భర్తని కాకుండా ఒక పరాయి పురుషున్ని ఊహించుకోవడం మూలాన కలంకితం అయింది. ఆ రోజు కుండతో  నీళ్ళు లేకుండా ఇంటికి పోయిన రేణుకను చూసిన భర్త జమదగ్ని కోపంతో తన కొడుకు అయిన పరుశరామున్ని రేణుక ను చంపమని ఆజ్ఞాపిస్తాడు ఆమె బయంతో వణుకుతూ “బంక మట్టితో కుండను చేసే విద్య నాకు లభించిన వరం కాదు అది నా చేతులకు తగిలించ బడిన సంకెళ్ళు” అని అంటాది. ఈ సన్నివేశం  ప్రళయన్ అనే ఒక తమిళ నాటక ప్రయోక్త ఇతిహాసాల లో చిన్న చిన్న ఉప కథల మీద అల్లుకున్న చిన్న భాగం .

‘మిత్ ఇస్ ఎ  డి పొలిటిసైజడ్ స్పీచ్’  అన్నాడు ప్రఖ్యాత ఫ్రెంచ్ సిద్దాంత కర్త, భాషా శాస్త్రవేత్త రోనాల్డ్ బార్త్స్. నాటి సామాజిక శాస్త్ర వైధానికంలో ఇతిహాస, పురాణ  వాంఘ్మయ పరిమితులను విశ్లేసిస్తూ ఆయన ఈ సూత్రీకరణ చేసాడు. బహుశా రోనాల్డ్ బార్త్స్ రెండేళ్ళ పిల్లవాడుగా ఉన్నప్పటికే  ‘పురాణ ఇతిహాసాలు’ చానా బలమైన రాజకీయ ప్రకటనలు అని, వాటి లోగుట్టు తెలుసుకునే క్రమం లో ఇర్లాండ్ డబ్లిన్ యూనివర్సిటీ లో ‘బార్ ఎట్ లా’ చదువుతున్న ఒక యువ న్యాయ విద్యార్ధి  నాటికి కనీసం మూడు పదులు కూడా దాటని  త్రిపురనేని రామస్వామి పురాణ రచన వినిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాడు. ఈ నవంబర్ పదకొండు కి ఆయన డబ్లిన్ నుండి ‘బార్ ఎట్ లా’ తో స్వదేశానికి తిరిగి వచ్చి వందేళ్ళు అయిన సందర్భం గా  ఈ కాలానికి ఆయన ప్రాసంగికత ఏమయినా ఉందా అని నాలుగు మాటలు అవసరం అనిపిచింది.

వైదిక, సనాతనత్వానికీ దాని బయట ఉన్న ప్రపంచానికీ మధ్య అంతులేని అఘాతం ఉంది. ఆ అఘాతం సృష్టించిన గాయాల రసి ఆరని పుండులా, మానని గాయంగా సలపరం పెడుతూనే ఉంది. హింస, పీడన  లేని సమాజ స్థాపన కోసం అంతులేని రక్త నదులు పారాయి. వాటిని సమన్వయ పరిచే ప్రయత్నాలు రెండు వేల ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నాయి.  క్రీ.శ. ఏడవ శతాబ్దం లో తమిళనాడు కేంద్రంగా మొదలయిన భక్తి ఉద్యమం కేరళ, కర్నాటక మీదుగా ఉత్తర భారతానికి వ్యాప్తి చెందినది. సంతు పరంపర తోబాటు, తమిళనాడులో  ఆళ్వార్లు, నయనార్లు ,ఆండాళ్.  కర్ణాటక కేంద్రంగా సనాతన ధోరణుల మీద తిరుగుబాటు చేసిన బసవేశ్వరుడు, అల్లమా ప్రభు, అక్కా మహాదేవి, తెలుగు నేల మీద వేమన, పోతులూరి, దున్న ఇద్దాసు, తమ రచనలతో ఆలోచనలతో త్యాగాల బాటను వేసారు. లోకాయత చార్వాక తిరుగుబాటు,భక్తి ఉద్యామాల పరంపర, నాస్తిక ,హేతువాద ,వర్తమాన ప్రజా ఉద్యామాల చైతన్యం ఒకదానికి ఒకటి స్ఫూర్తి గా పనిచేశాయి. వాటిని అనేక సామాజిక ప్రజా  ఉద్యమాలు  కొనసాగిస్తున్నాయి. ఉన్న వ్యవస్థలను సమూలంగా కూలదోసి నూతన వ్యవస్థను నిర్మించే వాళ్ళు కొందరు అయితే, ఆ క్రమానికి ప్రత్యామ్నాయ ఆలోచనలతో భావ విప్లవానికి పరిమితం అయిన మరి కొంతమంది మందీ ఉన్నారు. ఆ క్రమం లో ముందుగా గుర్తుంచు కోవాల్సిన వాడు త్రిపురనేని రామస్వామి.

ఇరవయ్యో శతాబ్దపు ప్రధమార్ధం లో ప్రపంచ వ్యాప్తంగా పెల్లుభికిన ప్రత్యామ్నాయ ఆలోచనలను, భావ విప్లవ  పరంపరను అందుకున్న తొలి తరం మేధావి అతను. ‘కవిరాజు’ గా ప్రసిద్ది గాంచిన ఆయన 1887 జనవరి 15 కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారు. గుడివాడ, బందర్, రాజమండ్రి లో విద్యాభ్యాసం చేసి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సంక్షుభిత కాలం లో(1917) ఐర్లాండ్ డబ్లిన్ యూనివర్సిటీలో న్యాయ విద్యను (Bar-at Law) అభ్యసించాడు. కవిరాజుగా, ప్రముఖ హేతువాద సిద్దాంత కర్తగా, ఛందో బద్ద కవిత్వం శతక, అవధాన, నాటక, నవల వ్యాస,విమర్శనా ప్రక్రియల్లో ప్రసిద్దిగాంచిన ఆయన నాటి సాహిత్య లోకం లో ఒక ట్రెండ్ సెట్టర్, వంద ఎల్లకిందనే  సాహిత్య నిర్మాణ, నిబద్దత లాంటి చర్చలు మొదలు కాకముందే తన రచనలు రాజేసిన నిప్పుల మూలంగా ఆయన రచనలు  నిర్భందాలకూ నిషేదాలకూ గురి అయినాయి.

చెళ్ళపిళ్ళ వారి శిష్యరికం  లో ప్రోదిచేసుకున్న అవధాన, పద్య కావ్యాల గమనం శతకం, నాటకం,పురాణ ప్రత్యామ్నాయ రచనలు ఆనాటికే ప్రయోగాత్మకమైనవి. కవిరాజు డబ్లిన్ యూనివర్సిటీ లో చేరేనాటికి ప్రపంచ వ్యాప్తంగా జాతుల పోరాటాలు  పక్వ దశకు చేరుకున్నాయి. రవి అస్తమించని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక వలస దేశాలు పోరాటాలు తీవ్రతరం చేసాయి. న్యాయ విద్యతో తిరిగి వచ్చేనాటికి యావత్ దేశం బ్రిటిష్ సాంస్కృతిక పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. రష్యా ప్రజా పోరాట స్ఫూర్తి ఒక వైపు, వలసరాజ్యాల జాతీయోధ్యమాలు మరొక వైపు గ్రామాలు రాజేసిన నెగడులా చిట పట మంటున్నాయి. అలా వెల్లువలా వచ్చిన కార్యకలాపాలు,  జుస్టిస్ పార్టీ , హోం రూల్ ఉద్యమాల తో రెండో దశ స్వతంత్ర పోరాటం మొదలయిన విపత్కర పరిస్థితుల మధ్య తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి వచ్చాడు. ఐరోపా సమాజం లో నేర్చుకున్న పోరాట స్ఫూర్తి తనను నాటి ప్రజా ఆందోళనలో భాగం అయ్యేలా చేసింది. ఆక్రమంలో  నాటి అగ్రనాయకులతో బాటు  నిర్భందాన్ని స్వయంగా అనుభవించాడు. ఒక వైపు ఆందోళనలు మరోవైపు రచనా వ్యాసంగం. వచనం,కావ్యం,నాటకం,నవల ఏదయినా తనదైన ముద్ర తిరుగుబాటు తో  సాహిత్య ప్రపంచం లో ఒక ప్రకంపనలు సృష్టించాడు.

నాటి తెలుగు సాహిత్య లోకం లో విశ్వనాధ పరంపర బలంగా ఉండేది. సనాతన సమాజానికి విశ్వనాధ ప్రతినిది అయితే, హేతు తత్వానికీ ప్రత్యామ్నాయ ఆలోచనకి  కవిరాజు రచనలు ప్రేరకంగా ఉండేవి. విశ్వనాధ ‘వేనరాజు’ నాటకానికి విమర్శనాత్మకంగా రాసిందే ఖూనీ. వాటితో బాటు  సూతపురాణం, కురుక్షేత్ర సంగ్రామం, శంభుక వధ, వివాహవిది, కుప్పుస్వామి శతకం, ధూర్త మానవా, భగవత్ గీత, లాంటి ఎన్నో విమర్శనాత్మక ప్రయోగాత్మక రచనలు చేసాడు. సాహిత్యం లో అంతర్లీనంగా ఉన్న ఆర్య ద్రావిడ సాంస్కృతిక స్పృహ కు  నాడు  పెరియార్, త్రిపురనేని చేసిన కృషి అసమాన్య మైనది.

శంభూకుడు, బర్బరీకుడు, రావణ, జాంబవంతుడు, ద్రౌపది, శూర్పనక, మహిషాశూర, నరకాశూర లాంటి పురాణ పాత్రలు నాటి వ్యవస్థీకృత దాష్టీకానికీ, పితృస్వామిక అహంకారానికీ బలి అయిన ప్రతీకలు. అవి ఇప్పుడు అస్తిత్వ, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో పోరాట రూపాలుగా అవతరించాయి.  స్వాభిమాన,అస్తిత్వ ప్రకటనకి మారు రూపాలుగా మారిన వర్తమాన చైతన్యానికి వందేళ్ళ కిందే పునాది వేసాడు కవిరాజు. అదీ ఆయన ప్రాసంగికత.

న్యాయవాద వ్యాపకంలో ఉంటూనే జాతీయోద్యమం, సాహిత్యం , హేతువాద, కులాంతర మతాంతర వివాహవిధులతో   నిరంతరం మమేకంఅయినాడు. తెనాలి పురపాలక సంఘానికి రెండు సార్లు చైర్మన్ గా, ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ మెంబెర్ గా  పనిచేసి తెనాలి నడిబొడ్డున  కవిరాజు స్థాపించిన ప్రయోగాత్మక ‘సూత ఆశ్రమం ‘నాడు ప్రత్యామ్నాయ ఆలోచనలకు కేంద్రంగా ఉండేది. ఎం.ఎన్.రాయ్ లాంటివాళ్ళు కూడా ఆ ఆలోచనలను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చారు . అంతటి మహోన్నతమైన సూత ఆశ్రమం చిరునామా మాయం అయింది. ఆ ఆలోచనల కొనసాగింపుగా విజయవాడ,ఇంకొల్లు లాంటి నాస్తిక హేతువాద కేంద్రాలు బలపడ్డాయి. ఆయన ఏ లక్ష్యం కోసం కుల మత జాడ్యాల వ్యతిరేక ఉద్యమం నడిపాడో ఆయన తదనంతరం  ఆయన పేరు చివర తోకను తగలించారు. ఇది వర్తమాన విషాదం. స్వాభిమాన ఆలోచనలకూ, ద్రావిడ వైధానికానికీ ఇద్దరు రామస్వాములు సైద్దాంతిక ఇరుసుగా పనిచేసారు. మత చాందసత్వానికి, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తమ రచనలతో, కార్యాచరణతో బ్రతికి ఒక నమూనాగా చరిత్రలో మిగిలి పోయారు . ఆనాటికి ఇది ఒక విప్లవాత్మకమైన గమనం .

నాటి సనాతనత్వానికీ,సాంస్కృతిక పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా  ‘వివాహ విధి (1930) పేరుతో ఒక ప్రత్యామ్నాయ ఆలోచనకు కవిరాజు ఇచ్చిన స్ఫూర్తి అనేక వందల కుల,మతాంతర, ఆదర్శ వివాహాలు జరిగాయి. విజయవాడలో  నాస్తిక కేంద్రం లో  గోరా పెద్ద కూతురు మనోరమ- అర్జునరావు తో చేసిన కులాంతర వివాహం, దాని  కొనసాగింపుగా  గుర్రం జాషువా చిన్నకూతురు హేమలత, గోరా పెద్ద కొడుకు లవణం ల ఆదర్శ వివాహం (రెండు జంటల సహజీవనం వార్ధా ఆశ్రమంలో మొదలైంది.)  వీటి  వెనక త్రిపురనేని ఇచ్చిన ఒక పరంపరణ ఉంది. సాహిత్యం లో కవిరాజు ఒరవడిని  కొనసాగించిన  నాస్తిక కేంద్రం హేలమతా లవణం కొనసాగించిన ఆచరణ, గోపీచంద్ సాహిత్య  కార్యాచరణ వెనక దశాబ్దాలుగా మూడు నాలుగు తరాలు వేసిన ప్రత్యామ్నాయ ఆలోచనల స్ఫూర్తి ఉంది. సాహిత్యంలో తమ రచనలకూ వ్యక్తిగత జీవితానికీ సమన్వయం లేని ఎంతో మందిని చూసాం,  కానీ కవిరాజు తరం  తమ ఇంటిని ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారు .విభిన్న రచనాప్రక్రియల్లో స్వాభిమాన ఆలోచనకూ, సామ్యవాద భావాలకూ, మత చాందసత్వానికి, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తన రచనలతో, కార్యాచరణతో బ్రతికి ఒక నమూనాగా చరిత్రలో మిగిలిన ఆయన నిష్క్రమణ అటు సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలకు కుదుపే. పరాయి పాలననుండి విముక్తి కోసం కొట్లాడిన ఆయన  స్వాతంత్రానికి నాలుగేళ్ల ముందే జనవరి పదహారున అర్ధాంతరంగా తన ప్రయాణాన్ని ముగించారు. కానీ ఆ స్పూర్తిని నమ్మిన, విశ్వసించిన వాళ్ళు ఎందరో ఉన్నారు.

నేడు అసహనం రంకెలు వేస్తూ  ఇంట్లోకీ వంటింట్లోకి వచ్చి భయోత్పాతం కలిగిస్తోంది . నువ్వు నమ్మిన విలువలు, విశ్వాసాలు రాసే, మాట్లాడే హక్కుని నిరాకరిస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ పోరాటాల అవసరాన్ని ఏనాడో గుర్తించిన కవిరాజు  ఆలోచనల ప్రాసంగికత ఏమాత్రం తగ్గలేదు అనిపిస్తోంది . వందేళ్ళ కిందనే ఈ ప్రమాదాన్ని గుర్తెరిగిన కవిరాజు తరం ముందు చూపు నేడు అందరికీ ఆదర్శం. ఆ ఒరవడిని కాపాడుతున్న కొనసాగిస్తున్న  ప్రజా పోరాటాల లో మమేకం అవడమే ఆ తరానికి మనం ఇచ్చే నిజమైన నివాళి .

సాంస్కృతిక పీడనానికి వ్యతిరేకంగా పోరాడిన కులం మారిన అధికార మార్పిడీ క్రమంలో కారంచేడు గుండె గాయం తోబాటు పీడకులుగా మారడమే వర్తమాన విషాదం…అయినా నా ప్రయాణం హేతువాదిగా మొదలైంది కనుక కవిరాజుకి నా నివాళి….

(ఈ నవంబర్ 11 కవిరాజు త్రిపురనేని రామస్వామి  స్వదేశానికి తిరిగి వచ్చి వందేళ్ళు అయిన సందర్భంగా 12 ఆదివారం ఉదయం సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో సాయి చంద్ నిర్వహణలో సమావేశం)

 

డా.గుఱ్ఱం సీతారాములు

9951661001

వివక్షల భారతంలో విద్యాశిఖరం

raju nayak

ఎర్రటి ఎండల్లో ఎర్రదుబ్బ నేలల్లో పోడు గొట్టి పాటిమట్టి తో గట్టిన గుడిసెలో పాముల మధ్య తేల్ల మధ్య నెరిపిన పారాడిన బాల్యం అది, తాతల తండ్రుల వలస బతుకుల్లో సంచారుల్లా బ్రతుకు దెరువు కోసం ఎడ్ల కచ్చడం మీద ఉప్పమ్మా.. ఉప్పో.. గెనుసుగడ్డలో అని అరిచీ అరచీ  వంట్లో చమట ఉప్పు కనికెల్లా మార్చుకున్న బాల్యం అది. ఎగిలివారంగానే మొదలయిన శ్రమ జీవన యుద్ధం.ప్రకృతి తో, బ్రతుకుతో,ఆకలితో,అవమానాలతో కట్టె గొట్టి, కంపగొట్టి, కట్టెలు బండ్ల కొద్దీ నెత్తిన మోసి ఊడిపోయిన జుట్టుతో పాలి పోయిన జీవితంతో దినాం గండంగా సోలెడు నూకల కోసం పడ్డ అగచాట్లు అవి, ఇదీ రాజూ నాయక్ వారసత్వంగా పొందిన ఉపమానాలు. విశాలమైన ఈ భారత మాత  ఈ భూపాలపల్లి భూమి పుత్రునికి పోతే పూడ్చేందుకు గజం నేల కూడా మిగల్చలేదు. సంచార జీవితాలు, వలస బ్రతుకులు, ఆయన కుటుంబానివి. వలసవాద చరిత్రలో దొంగలు, హంతకులుగా నమోదు అయిన వైనం. అతను చాందా రాజ వంశాల వారసుడూ కాడు, చంబల్ లోయ రాణి దాయాదీ కాదు. కానీ బ్రతుకు పోరులో యుద్ద రంగం లో తరలబడ్డ లక్షలాది రాజస్థానీ విస్తాపితుల లో ఒకడు. అసలేవరీ రాజూనాయక్? భూపాలపల్లి తండాకు చెందిన అతను ఆంగ్లమూ మరియు విదేశీ బాషల విశ్వవిద్యాలయం లో చదువుకోసం నమోదు చేసుకున్న రెండో ఆదివాసీ  విద్యార్ధి. రెండో గిరిజన అధ్యాపకుడూ అతడే. ఒక మారుమూల తండాలో మొదలయిన ఆయన బాల్యం నేడు ప్రపంచం లో అత్యంత ప్రతిష్టాత్మకమైన  ఇన్స్టిట్యూట్ ఫర్ సౌత్ ఏసియన్ స్టడీ, యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా చదివే అరుదయిన అవకాశం లభించింది. తాను అసమాన్య పరిస్థితుల మధ్య ఏటికి ఎదురు ఈదుతూ రామానుజన్ ఫెలో గా దిగ్విజయంగా పూర్తి చేసుకొని భారత దేశానికి  తిరిగి వస్తున్న సందర్భంగా ఆ గిరిజన పరిశోదకుడి పరిచయం ఈ తరానికి అవసరం అని ఈ ప్రయత్నం. ఏ లక్ష్యం ఆయనను రూపుదిద్దింది ?

ఈ పనిచేయడానికి ఆయన పుట్టుకతోనే నోట్లో బంగారు చెమ్చా తో పుట్ట లేదు తర తరాలుగా వలస జీవితాలు గడుపుతూ వెట్టికీ,వెతలకీ నిలయం అయిన భూపాల పల్లి తండాలో  పుట్టాడు . ఒక రకంగా ఇప్పటి ఆంగ్లమూ మరియు విదేశీ బాషల విశ్వవిద్యాలయం మెట్లు ఎక్కిన రెండో గిరిజనుడు .  ఆయనకు ముందు భరత్ చౌహాన్ అనే లంబాడా విద్యార్ధి మొదటి సారి సీఫెల్ మెట్లు ఎక్కాడు. నగరం నడిబొడ్డున ఉన్నా సీఫెల్ మెట్లెక్కడానికి నువ్వు కచ్చితంగా కారణ జన్ముడివి అయిఉండాల్సిందే . ఏభై ఏళ్ళ కింద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంగ్లీష్ గా ఆ తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ డీమ్డ్ యూనివర్సిటీగా ఆ తర్వాత ఆంగ్లమూ మరియు విదీశీ బాషల కేంద్రీయ విశ్వవిద్యాలయం గా అవతరించాక మాస్టర్స్  చేయడం కోసం ఎఫ్లూ మెట్లు ఎక్కాడు రాజునాయక్. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ బ్రతుకు యుద్ధం ఆయనను ముందుకు నడిపింది. నడిపింది అనడం కంటే ఒక గాలివాటం ఆయనను నెట్టింది . ఎఫ్లూ వచ్చేనాటికి ఒంటిమీద ఒక చొక్కా సంచిలో మరొక జత బట్టలు . హాస్టల్లో వసతి  దొరకడానికి మూడు నెలలు వారాసిగూడ మిత్రుని ఇంట్లో ఉండి ఆతర్వాత హాస్టల్లోకి వచ్చాడు. నేటి ఎఫ్లూ  పేయి మీద కట్టే బట్ట బరువు అయినట్టు సగం గుడ్డలతో, చేతిలో సిగేరేట్ తో ఆడా మగా, అధ్యాపకుడూ-విధ్యార్ధి తేడా లేకుండా స్వేచ్చగా ఉండే వాతావరణం లో మొదటి తరం బడికి పోయిన ఎవరికయిన బెరుకు బెరుకు గానే ఉంటాది. ఆయననే కాదు ఈ వ్యాస రచయితనూ బయపెట్టింది. విద్య పరంగా,ఆర్ధిక సామాజిక వ్యవహారాల్లో రెండు ప్రపంచాల మధ్య అఘాతాన్ని చూస్తాం అక్కడ. తెలుగు అన్నా, తెలంగాణా అన్నా అప్రకటిత వివక్ష అ సర్వకాలాల్లో పరివ్యాప్తం అయి ఉంటాది.  మొదటి ఏడాది విచిత్రమైన విపత్కరమైన ఆ వాతావారణం లో పూర్తి చేయగలిగాడు కానీ రెండు నెలల సెలవుల్లో అందరూ ఇంటికి పోతుంటే బస్సు కిరాయికి డబ్బులు లేక హాస్టల్ లో ఉండలేక ఇంటికి పోలేని సంకటిత స్థితి ఆయనది.

నాటి వరంగల్ జిల్లా భూపాలపల్లి లో డెబ్బయ్యో దశకం చివరి అంకం లో వెలమ దొరల జీతగాడు అయిన  విస్లావత్ లాలూ నాయక్, కల్యా కడుపున రాజునాయక్ జన్మించాడు. తన తాత తండ్రులు కుంట పొలం లేకుండా వెట్టిలో బ్రతుకీడ్చారు. మహదేవపూర్ సమీప గిరిజన సంక్షేమ హాస్టళ్ళ పురుగుల జావతో బ్రతుకు పోరాటం, ఒక వైపు అటవీ ప్రాంతంలో అన్నల పలకరింపులు తరగతిగదిలో తనతో కలిసి చదువుకొని ప్రత్యామ్నాయ పోరాట వెలుగులో దాదాపు ఇరవైకి పైగా అసహజంగా అమరత్వం అయి కనుమరుగు అయ్యారు. గ్రామం లో అంబేద్కర్ సంఘాల సహచర్యం చదువు విలువ తనను వరంగల్ కు పంపింది. సంక్షేమ హాస్టళ్ళ చదువులలో ఏరుకున్న పరిగ గింజల్లాంటి నాలుగు అక్షరాల సంచిలో వేసుకొనివసతుల లేమి, కొరవడిన అధ్యాపకత్వం, నిర్దేశం లేని నిరర్ధకం అయిన చదువులు కేవలం రాజూ నాయక్ మాత్రమె కాదు నాటికి ఎవరినీ సంస్కరించలేదు. ఆ వైఫల్యాలే  ఎనభయ్యో దశకం లో వందలాది మంది తమ భవిష్యత్ ను గ్రామాలకు తరలండిలో చూసుకున్నారు. కానీ రాజూ నాయక్ తన బ్రతుకు ప్రయాణం సీఫెల్ వైపు మళ్లేలా చేసింది. అది కేంద్రీయ విశ్వవిద్యాలయం బహుళ సంస్కృతుల కలబోత,సంపన్న వర్గాల పిల్లలు స్వేచ్చగా తనువు పులకింతలతో అరేసుకొని పారేసుకొని ట్విట్టర్ పిట్టల్లా ఎగిరిపోతారు. బిక్కుబిక్కుమంటూ తండాల, గూడేల పిల్లలు వచ్చీరాని ఆంగ్లం లో ట్విట్టర్ పిట్టల ముందు న్యూనతతో ఒక మూల బ్రతుకు పోరులో నాలుకు ఆంగ్ల ముక్కలు జేబులో వేసుకుంటారు.అది పూడ్చలేని సాంస్కృతిక అఘాతం.

మండల్ కమీషన్ దేశ మేధో సమాజంలో ఉన్నత విశ్వవిద్యాలయాలలో ఒక నిట్టనిలువు చీలిక తెచ్చింది. ఉన్నత విశ్వవిద్యాలయాలలో వెనకబడిన కులాలకు తెగలకు రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక వైరి వర్గాలుగా చీలిక ఏర్పడిన సంధి దశలో రాజునాయక్ తన ఉన్నత విద్యను కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మొదలు పెట్టాడు. అదే దశలో బంగ్యా భూక్యా, జంగం చిన్నయ్య, గుండెమెడ సాంబయ్య లాంటి వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా పేరుమోసిన విశ్వవిద్యాలయాలలో తమదయిన ఒక సాహిత్య సాంస్కృతిక,పరిశోధనా ఒరవడిని వేస్తున్నారు. మరో వైపు గుజరాత్ నరమేధం, లాంటి కాషాయా కుట్రలూ వికృతంగా విశ్వవిధ్యాలయాలనూ తాకాయి. ఒక విధంగా అది సంధి దశ, మరో రకంగా దళిత బహుజన విద్యార్ధుల సంఘటిత, ప్రత్యామ్నాయ పోరాట రూపాలు విద్యార్ధుల్లో మమేకం అవుతున్న దశ. ఇంకో వైపు ప్రాంతీయ,లింగ అస్తిత్వ వేదనలతో వచ్చిన చైతన్యం విశ్వవిద్యాలయాలలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇంతటి సంక్షుభిత దశలో ఒక తరం ఉన్నత విధ్యాలయాలలోకి ప్రవేశించింది.

ఆ నాటికి సీఫెల్ ఒక వింత ప్రపంచం ఎంతో మంది విదేశీయులతో అలరాలే నేల అది, నాడు యూరో సెంట్రిక్ ఆలోచనలతో కుళ్ళి కునారిల్లు తున్న దశ అది. యురోపియన్ ఆధారిత చరిత్ర, సంస్కృతులతో అలరారుతూ కేవలం భాషా నైపుణ్యాలు మాత్రమే వండి వార్చే ఒక యాంత్రిక అకడమిక్ వాతావారణం లో మాతరం అక్కడకి వచ్చింది. సీఫెల్  ఒక ఏక ధ్రువ ప్రపపంచం.అంతా కాఫీ టేబుల్ సిలబస్, క్రెడిట్లు, కోర్స్ వర్క్ లు సంప్రదాయ తరగతి గదికి ఒక భిన్నమయిన లోకం అది. దేశవాళి కళలూ,సంస్కృతులూ అంటరానివి. అక్కడ చదువుతున్న చదువు సాంప్రదాయ తెలుగు సమాజ లోకానికి వందేళ్ళ ముందు ఉంది. కానీ కోయ, లంబాడ,కులపురాణాలు.చిందు యక్షగానాలు, వీధిభాగవతాలు పరిశోధనా అంశాలుగా  మార్చడానికి మాతరం యుద్దమే చేసింది. అంతకాలం విశ్వవిద్యాలయంలలో చదువుకుంటున్న  పాఠాలు మనవి కాని మన చరిత్రలు. కోల్పోయిన పేజీల కోసం వెతుకులాటల మధ్య కుల పోరాటాలు కుల చైతన్యం తో ఆలోచనలు కుల చరిత్రలు,పురాగాధలు పరిశోధనాత్మక అంశాలుగా మారడానికి మేము యుద్దమే చేసాం. నాడు ఏ అధ్యాపకుడూ వాటిని పరిశోధనాత్మక అంశంగా పరిగణించలేదు, పైగా అనేక ఈసడింపులు,చీత్కారాలు ముఖం మీదనే ఏ యురోపియన్ రచయితో అమెరికా రచయితో మన బుర్రల్లోకి జొప్పించి పరిశోధనలు చేయిస్తున్న దశలో లంబాడా కులగాధాలు,’భాట్’ పురాగాదల మీద పరిశోదన చేసిన అతికొద్దిమంది  ఆదివాసీ విద్యార్ధి పరిశోధకుల్లో  రాజునాయక్ ఒకడు.

ఈ రాష్ట్రంలో పందొమ్మిది వందల ఎనభైల తర్వాత మారిన అధికార మార్పిడి కొన్ని సంక్షోభాలను సృష్టించింది. ఒక కులం నుంచి మరో కులం పీడకుల అవతారం ఎత్తింది.కానీ పీడితులు మాత్రం మారలేదు. అంతే కాకుండా విచ్చలవిడిగా శ్రీ చైతన్య, నారాయణ లాంటి  విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యను కుదేలు చేసాయి. ఆ అసంతృప్తి లో కొందరు ప్రత్యామ్న్యాయ రాజకీయాల వైపు మల్లెలా చేసింది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు పోరాట క్షేత్రాలు అయ్యాయి. ఆ మార్పుని పాలకులు జీర్ణం చేసుకోలేక పోయారు. వందలాది అధ్యాపక కాళీలు మా తరాన్ని వెక్కిరించాయి. దానికన్నా మేము సాంస్కృతికంగా లేవనెత్తిన ప్రశ్నలను పాలకులు ప్రమాదకరంగా చూసారు. వీటి పర్యావసానమే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో బలవన్మరణాలు, నిర్భందాలు. ఇన్ని నిర్భందాల లోనూ అననుకూల పరిస్థితులలోనూ నెత్తిన కత్తి వేలాడుతుండగా ఉన్నత విద్యను డాక్టరేట్ పట్టానూ పొందారు. వాళ్ళు కేవలం తరగతి గదికే పరిమితం కాలేదు, మండల్ వెలుగు,చుండూరు కారం చేడు గాయాలు రగిల్చిన కసి విశ్వవిద్యాలయాలను మానవీయంగా మార్చేందుకు పోరాట రూపాలు అయ్యాయి. ప్రజాస్వామిక స్ఫూర్తి కోసం ఆహార హింస కు వ్యతిరేకంగా ఉద్య మిస్తున్నారు, పురాణాల గుట్టును నిట్ట నిలువుగా ఛీల్చేస్తున్నారు. కానీ  ఇప్పుడు ఉన్నత విశ్వవిద్యాలయాలు మరింత సంక్షోభంలోకి వెళుతున్నాయి. విశ్వవిద్యాలయం లో జాతీయ జెండాలు, యుద్ద టాంక్ లు జాతీయతకు ప్రత్యామ్నాయాలు అయ్యాయి.దానికి భిన్నంగా ఉంటె అది ఈ దేశ అంతర్గత రక్షణకు ముప్పుగా మారే ప్రమాదం ఉంది అని కాషాయ చట్టాలు పొగరుతో రంకెలు వేస్తున్నాయి. వలసకూలీ కొడుకు రాజు నాయక్ భూపాల పల్లి తండా నుండి డాక్టర్ రాజునాయాక్ సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా  యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా లో పోస్ట్ డాక్టోరల్ ఫెలో మారడానికి, ముళ్ళ బాటను చదువుల బాటగా మార్చడానికి ఇంతటి విపత్కరాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇది కేవలం ఒక తండా బాలుడి కథ కాదు గడిచిన రెండు దశాబ్దాలుగా ఒక తరం బ్రతుకు యుద్ధం లో అనుభవించిన మానసిక ఉక్కపోత. వారు  గెలిచారో ఓడారో తెలియని అంతర్ బాహిర్ యుద్ధం వెనక ఉన్న కథ. నువ్వు నీకులం, నీ అస్తిత్వం,సంస్కృతి బహిష్కృతం అయినప్పుడు నిటారుగా నిలబడడమే గొప్ప అయిన సంక్షుభిత కాలంలో, బ్రతుకుసమరంలో సొంత గొంతుకలతో మాట్లాడుతున్నారు. రాజూ నాయక్ దిగ్విజయంగా తన చదువును ముగించి వివక్షల భారతానికి తిరిగి వస్తున్నాడు. వాస్తవానికి  అసలు యుద్ధం ఇప్పుడే మొదలయింది.

డా.గుర్రం సీతారాములు

9951661001

Continue reading